కాళ్లు మొక్కిన రజనీ.. కస్సుమంటున్న తమిళనాడు

తమిళనాట 'ఆత్మగౌరవ నినాదం' ఎప్పుడూ ఉండేదే. తమిళ భాషపై వాళ్లు చూపించే మక్కువ గురించి అందరికీ తెలిసిందే. బయట జనాలు 'అతి' అని విమర్శించినా అది తమ ఆత్మాభిమానం అంటారు. అలాంటి తమిళనాడు గడ్డపై…

తమిళనాట 'ఆత్మగౌరవ నినాదం' ఎప్పుడూ ఉండేదే. తమిళ భాషపై వాళ్లు చూపించే మక్కువ గురించి అందరికీ తెలిసిందే. బయట జనాలు 'అతి' అని విమర్శించినా అది తమ ఆత్మాభిమానం అంటారు. అలాంటి తమిళనాడు గడ్డపై నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్.. తనకంటే చిన్నవాడైన ఓ వ్యక్తి కాళ్లు మొక్కారు. అదే ఇప్పుడు అరవ రాజ్యంలో ఆజ్యం పోసింది.

ఇలా కారు దిగి అలా యోగి ఆదిత్యనాధ్ కాళ్లపై పడ్డారు రజనీకాంత్. తమ అరాధ్య నాయకుడు ఇలా ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాళ్లకు మొక్కడాన్నిచాలామంది తమిళిలు సహించలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్. రజనీకాంత్ సూపర్ స్టార్. ఎవరైనా ఆయన కాళ్లపై పడాల్సిందే. అంతేతప్ప, తమ నాయకుడు, యోగి ఆదిత్యనాధ్ కాళ్లకు మొక్కడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాళ్లకు మొక్కడం ఓ ట్రెండ్..

అసలు ఇలా కాళ్లపై పడే సంస్కృతి/ఆచారానికి తమిళనాట చాలా పెద్ద చరిత్ర ఉంది. అక్కడ తమ అభిమానాన్ని ఇలా కాళ్లపై పడి చూపిస్తుంటారు. జయలలిత కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేయని ఎమ్మెల్యే లేడు అప్పట్లో. కరుణానిధి దగ్గర కూడా ఈ ఆచారం ఉన్నప్పటికీ, జయలలిత దగ్గర ఇదో ట్రెండ్ గా మారింది. అయితే రజనీకాంత్ ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు. ఎందుకంటే, ఆయన పెద్ద హీరో. కోట్లాది మంది దృష్టిలో సూపర్ స్టార్.

మరి ఇంత పెద్ద హీరో ఎందుకిలా యోగి ఆదిత్యనాధ్ కాళ్లకు నమస్కారం చేశారు. ఇదే రజనీకాంత్ అభిమానులకు నచ్చడం లేదు. అంత ప్రేమ-భక్తి ఉంటే నాలుగు గోడల మధ్య చూపించుకోవాలని, కెమెరాల ముందు ఇలా కాళ్లపై పడ్డం ఏం బాగాలేదంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

రజనీకాంత్.. నో ఇగో.. నో ఫార్మాలిటీస్..

రజనీకాంత్ వయసు 72 ఏళ్లు.. యోగి ఆదిత్యనాద్ వయసు 52 ఏళ్లు. వయసులో తనకంటే చిన్నవాడైనప్పటికీ, యోగి కాళ్లపై పడ్డారు రజనీకాంత్. ఈ విషయాన్ని రజనీకాంత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు కానీ, చాలామంది మాత్రం రజనీ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.

రజనీకి దైవభక్తి ఎక్కువనే విషయం తెలిసిందే. జైలర్ సక్సెస్ అయిన తర్వాత కూడా ఆయన సంబరాల్లో పాల్గొనలేదు. హిమాలయాలకు వెళ్లారు. యోగులు, స్వాములకు ఆయనిచ్చే గౌరవం అపారం. సీఎం యోగి ఆదిత్యనాధ్ కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే. ఆయన చాన్నాళ్ల కిందటే యోగిగా మారారు. అదే రజనీకాంత్ ను ఆకర్షించింది. అందుకే కాళ్లకు నమస్కరించారు. ఈ విషయంలో వయోబేధం లేదు. చినజీయర్ స్వామి కంటే వయసులో చాలా పెద్దవాళ్లు ఆయన కాళ్లకు మొక్కడం లేదా.. ఇది కూడా అలాంటిదే.

అయితే ఇది రాజకీయంతో ముడిపడిన అంశం. యోగిపై ఉత్తరప్రదేశ్ లో విమర్శల గురించి అందరికీ తెలిసిందే. తనకు తాను యోగిగా చెప్పుకుంటే సరిపోదని, స్థాయికి తగ్గ పనులు చేయాలంటూ ఉత్తరాదిన యోగిపై ఎప్పటికప్పుడు విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి, ఆయనపై విమర్శలు సహజం అని కొట్టిపారేయడానికి వీల్లేదిక్కడ.

రాజకీయం.. భక్తి.. వివాదం..

యోగీ బీజేపీ మనిషి, ఇటు రజనీకాంత్ కూడా బీజేపీకి దగ్గరైన మనిషి. కాబట్టి కమలంను ప్రసన్నం చేసుకునేందుకు రజనీ ఇలా యోగి కాళ్లకు మొక్కారని, ఇందులో భక్తిభావం కనిపించడం లేదని కొంతమంది రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదని ఆల్రెడీ ప్రకటించారు కదా. కాబట్టి ఈ చర్చకు ఇక్కడ తావులేదంటున్నారు మరికొంతమంది.

ఇలా ఒకటి కాదు, రెండు కాదు, రకరకాల వాదనలతో తమిళనాట సోషల్ మీడియా, వార్తాఛానెళ్లు రెచ్చిపోతున్నాయి. ఎవరి వాదన వాళ్లది, ఎవరి విశ్లేషణ వారిది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోయింది కానీ.. సూపర్ స్టార్, యోగి కాళ్లపై ఎందుకు పడ్డారో భవిష్యత్తులో ఎవ్వరికీ తెలియదంటూ విపరీతంగా మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.

బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది కూడా రజనీకాంత్ సింప్లిసిటీలో భాగమేననే విషయాన్ని చాలా తక్కువమంది గ్రహిస్తున్నారు.