మణిపూరుపై నేను రాస్తున్న వ్యాసాల్లో యిది నాల్గవది. మొదటి వ్యాసంలో ఎస్టీ రిజర్వేషన్ అంశం, రెండవ దానిలో భూవివాదాల అంశం, మూడోదైన ఎమ్బీయస్: కుకీ సమస్య లో నార్కో సమస్య, వలసలు, మతకోణం, ప్రత్యేక రాష్ట్ర డిమాండు వగైరా విషయాలు చర్చించాను. ఇది ఘర్షణల గురించి రాస్తున్నాను. ఘర్షణలలో ఎంతమంది చనిపోయారో, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది నిర్వాసితులయ్యారు యిలాటి అంకెలు యివ్వటం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఒకటి చెప్తుంది, యిరు వర్గాలు వాళ్ల వాళ్ల లెక్కలు చెప్తాయి. ఘర్షణల్లో జరిగిన బీభత్సం గురించి కూడా నేను వర్ణించటం లేదు. తెలుగు మీడియా దాన్ని చాలానే కవర్ చేసింది. బాధితుల్లో యిరు వర్గాలూ ఉన్నారు. ఎవరెక్కువ ఘోరాలు చేశారు అనేది మనం తేల్చవలసిన అంశం కాదు. ఎవరు నష్టపోయినా సాటి భారతీయులే కదా! అందుకని వాటి గురించి ఎక్కువ చెప్పకుండా, జరిగిన విషయాలను ఒక క్రమంలో పెట్టి మీ ముందు ఉంచుతాను. ఎందుకిలా జరిగిందో మీ అంతట మీరే ఒక నిర్ణయానికి రావచ్చు.
కుకీలుంటున్న పర్వతప్రాంతంలో ఖనిజాలున్నాయి. ముఖ్యంగా ఘర్షణలకు కేంద్రబిందువైన చురాచాంద్‌పూర్‌లో గ్యాస్ బేసిన్ ఉంది. వాటిపై ఆధిపత్యం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తూ వస్తోంది. రకరకాల పేర్లతో కొన్ని ప్రాంతాలను ప్రొటెక్టెడ్ ఏరియా డిక్లేర్ చేసి అక్కడ నివాసమున్న కుకీలను ఖాళీ చేయించసాగింది. ఇది 10, 12 ఏళ్లగా ఒక పద్ధతి ప్రకారంగా సాగింది. వివరంగా తెలుసుకోవాలంటే యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదులో పొలిటికల్ సైన్సెస్ శాఖకు హెడ్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ ఖామ్ ఖాన్ సువాన్ హౌసింగ్ అనే ఆయన ‘‘మంథన్’’ సంస్థ ఏర్పాటు చేసిన సభలో యిచ్చిన ఉపన్యాసం వినండి. ఆయన మణిపూరు వాడు. బెనారస్ హిందూ యూనివర్శిటీలో కూడా పని చేశాడు. ఆయన ప్రసంగం లింకు యిదిగో
ఇది గంటన్నర సేపుంది. ఆఖరి అరగంట ప్రశ్నోత్తరాలు కాబట్టి వదిలేయవచ్చు. గంట ప్రసంగం ఫాలో కావడానికి ఓపిక కావాలి. మనకు తెలియని అనేక విషయాలు, ప్రాంతాలు ఆయన ఉచ్చారణలో వింటూ ఉంటే అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. ఆయన చెప్పినదాన్ని నమ్మాలా వద్దా అని తేల్చుకోవడానికి మనం యింటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు. మణిపూరు పాత, కొత్త ప్రభుత్వాలన్నీ పర్వతప్రాంతాలను ఎదగనీయకుండా చేశాయని, ప్రభుత్వానికి సంబంధించిన 23 ప్రముఖ సంస్థలుంటే వాటిలో కేవలం 2 మాత్రమే కొండల్లో ఉన్నాయని, 21 లోయలోనే ఉన్నాయని అన్నాడు. ఎస్టీకి రిజర్వ్ చేసిన ఉద్యోగాలు పేరుకు 31శాతం ఉన్నా, ఆచరణలో సగం మాత్రమే యిస్తున్నారని, తనకు లభ్యమైనవి పాత లెక్కలని, కొత్త వాటి కోసం ఆర్టిఐ కింద అడిగితే ప్రభుత్వశాఖలు యివ్వటం లేదని అన్నాడు.
రెగ్యులరైజేషన్ తతంగం – ఆయన చెప్పినదానిలో ఒక అంశం ఏమిటంటే, మైతేయీలు పవిత్రస్థలాలుగా భావించే కొన్ని పర్వతప్రాంతాలను ప్రభుత్వం పుణ్యక్షేత్రాలుగా డిక్లేర్ చేసి, వాటిని డెవలప్ చేసి, యాత్రికులు బాగా వచ్చి వెళ్లేట్లు ప్రోత్సహించింది. స్థూలంగా చూస్తే దీనిలో తప్పేమీ కనబడదు. అయోధ్య విషయంలో చూడండి, మసీదు, ఆలయం పక్కపక్కన ఉండేవి. ఇప్పుడు ఆలయం ఒక్కటే అయింది. మసీదు ఎన్ని కిలోమీటర్ల దూరం పోయిందో తెలియదు. ఇప్పుడు తాజాగా అయోధ్య మొత్తంలో మాంసభక్షణాన్ని నిషేధిద్దా మనుకుంటున్నారు, క్షత్రియుడైన రాముడి పేరు చెప్పి! అలాగే మైతేయీలకు పుణ్యక్షేత్రం కాబట్టి దీని చుట్టూ ఉన్న యిన్ని కిలోమీటర్ల పరిధిని పెంచుతూ పోయి రక్షితప్రాంతం, అన్యులు ఉండరాదు అని చట్టం చేసినా ఆశ్చర్యం లేదు.
ఇంకొకటి ఏమిటంటే ప్రభుత్వస్థలాలో ప్రార్థనాలయాలను కట్టి ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేసే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు సుప్రీం కోర్టు కట్టబెట్టిందట. దాన్ని ఉపయోగించుకుని మణిపూరు ప్రభుత్వం 2011 అక్టోబరులో 5 జిల్లాలలో 188 దేవాలయాలను రెగ్యులరైజ్ చేసింది కానీ ఒక్క చర్చిని కూడా రెగ్యులరైజ్ చేయలేదు అని ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఆరోపించింది. ఏప్రిల్ 11న ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని మూడు చర్చిలను ప్రభుత్వం కూల్చివేసిన సందర్భంగా యిది బాగా చర్చకు వచ్చింది. తాము ఆథరైజ్ చేయలేదు కాబట్టి యివి అక్రమ కట్టడాలంటూ ప్రభుత్వం కూల్చివేస్తానని నోటీసులు యిస్తే, అవి 1974 నుంచి ఉన్నాయి కాబట్టి రెగ్యులరైజే చేయాలని కోరుతూ చర్చిలు కోర్టుకి వెళ్లాయి. 2020లో కోర్టు స్టేటస్ కో యిచ్చింది. ఈ ఏప్రిల్‌లో హైకోర్టులోని జస్టిస్ మురళీధరన్ బెంచ్ (వివాదాస్పద ఎస్టీ తీర్పు యిచ్చినదీ యీయనే) ఆ స్టేను ఎత్తివేసింది. వెంటనే ప్రభుత్వం ఏప్రిల్ 11 తెల్లవారుఝామున 2 గంటలకు బుల్డోజర్లతో చర్చిలను కూల్చివేసింది. ఇదంతా డెక్కన్ హెరాల్డ్‌లో వచ్చింది. ఈ ప్రొఫెసర్ అనేదేమిటంటే యీ ప్రభుత్వ కార్యక్రమంలో అనేక మంది మైతేయీ వాలంటీర్లు పాల్గొన్నారని!
కుకీల భూమిహక్కుల గురించి మైదాన ప్రాంత ప్రజలకు అర్థం కాని విషయం ఒకటి వినబడుతోంది. వాళ్ల సంప్రదాయం ప్రకారం భూయాజమాన్యం గ్రామపెద్ద పేర ఉంటుందట. ఇదెలా అని మనం ఆశ్చర్యపోతాం. కానీ యిది పర్వతరాష్ట్రాలన్నిటిలోనూ ఉందని యీ ప్రొఫెసర్ చెప్తున్నారు. అసాం, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర.. యిలా అనేక చోట్ల యిదే పద్ధతిట. దీన్ని ప్రభుత్వం కూడా ఆమోదించిందట. ‘‘మణిపూర్ భూవివాదాలు’’ అనే వ్యాసంలో నేను రాశాను – 2022 నవంబరు 7న చురాచాంద్‌పూర్-ఖౌపుమ్ రక్షిత అటవీ ప్రాంతంలో నివాసాలపై అప్పటిదాకా ఉన్న ప్రభుత్వ చట్టాలన్నిటినీ ఒక్క జిఓతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రద్దు చేసేసింది. ఎందుకంటే ‘పాత ఆదేశాలన్నీ లోపభూయిష్టమైనవి, అమోదయోగ్యం కానివి, తప్పుడువిట’. (ఇమ్పెర్ఫెక్ట్, డిఫెక్టివ్, ఎరోనస్ అండ్ అన్‌యాక్సెప్టబుల్). ఆ జీఓ ఒక్కటి అడ్డుపెట్టుకుని కుకీ నివాసాలన్నిటిపై ప్రభుత్వం కబ్జా ముద్ర కొట్టేసింది. ఆ విషయాన్నే యీ ప్రొఫెసర్ చెప్పారు.
మయన్మార్ శరణార్థులు వెళ్లినది మిజోరాంకి.. – ఆగస్టు 10న అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ మయన్మార్ నుంచి మణిపూరుకు వలస వచ్చిన వారి వలననే, మైతేయీలలో భయాందోళనలు చెలరేగాయని, వలసదారులు వచ్చిన నివాసం పెట్టిన గ్రామాలను రెగ్యులరైజ్ చేస్తున్నారని ఏప్రిల్ 29న పుకారు రావడంతో మరి రెచ్చిపోయారని, దాంతో అల్లర్లు జరిగాయని చెప్పారు. దాన్ని మిజోరాం రాజ్యసభ సభ్యుడు కె.వన్లవేనా అనే అతను ఆగస్టు 15న ప్రెస్మీట్లో ఖండించాడు. ‘2021 నుంచి మయన్మార్ నుంచి వచ్చిన వారిలో 40 వేల మంది శరణార్థులను తీసుకున్నది మేము! వాళ్ల వలన మాకు ఏ గొడవలూ లేవే!’ అని అడిగాడు.
మయన్మార్ శరణార్థులను మణిపూరు తీసుకోనే లేదు. అలాటప్పుడు అమిత్ షా యిలా ఎలా అంటారని రాజ్యసభలో ప్రశ్నిద్దామని తను ప్రయత్నించినా అడగనివ్వలేదని, మాట్లాడబోతే మైకు కట్ చేశారని యీ ఎంపీ వాపోయాడు. అతను ఎన్‌డిఏలో సభ్యురాలైన మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ నాయకుడు. అయినా యిదీ పరిస్థితి. అమిత్ షా ఎపాయింట్మెంట్ అడిగితే దొరకలేదు. అసాం మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి అయిన సోనోవాల్‌కు ఒక మెమోరాండం యిచ్చినా లాభం లేకపోయింది. దాంతో అతను ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాడు. ఇంతకీ మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చినవారు మణిపూరులో ఎంతమంది ఉన్నారు? 2023 జనవరిలో బీరేన్ వేసిన సబ్ కమిటీ మొత్తం 2200 మంది ఉన్నారని చెప్పింది. ఈ అంకెలూ పేపర్లలో వచ్చాయి. వారిలో 150 మంది మాత్రమే చురాచాంద్‌పూర్‌లో ఉన్నారని పైన చెప్పిన ప్రొఫెసర్ అన్నాడు. అంకెలిలా ఉండగా అమిత్ కానీ, బీరేన్ కానీ గొడవలన్నీ అక్రమ వలసదారుల కారణంగానే వచ్చాయనడంలో విజ్ఞత ఉందా?
మిజోరాం కోణం – రెండు ఎన్‌డిఏకి చెందినవే అయినా మణిపూరు, మిజోరాం ప్రభుత్వాలకు యీ విషయంలో పొసగటం లేదు. కుకీ అని నేను రాస్తున్నా నిజానికి కుకీ-చిన్-జో తెగలుగా పేర్కొనాలి. వీళ్లదీ మిజోరాంలోని జో తెగల వారిదీ ఒకే కుదురు. అందువలన యీ గొడవలు జరగగానే 12 వేల మంది కుకీలు మిజోరాంకు పారిపోయారు. వారి వలన తమకు భారం పడిందని రూ.10 వేల కోట్లు సాయం చేయమని వాళ్లు కేంద్రాన్ని కోరితే, యిప్పటివరకు రూ.3 కోట్లు యిచ్చారు. మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీకి చెందినవాడు. బిజెపితో కలిసి ప్రభుత్వం నడుపుతున్నాడు. ఎన్‌డిఏలో భాగస్వామి అయినా ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నాడు. ఇప్పుడీ మైతేయీ-కుకీ సమస్య రాగానే కుకీలు ప్రత్యేక రాష్ట్రం కోరసాగారు. అంతకంటె కుకీ జిల్లాలను మిజోరాంలో కలిపేసి ‘గ్రేటర్ మిజోరాం’ ఏర్పాటు చేయాలని అతను డిమాండ్ చేస్తున్నాడు.
తెలంగాణ ఉద్యమసమయంలో హైదరాబాదుతో కలిసి ఉంటే లాభమనే లెక్కతో జెసి దివాకరరెడ్డి రాయలసీమను తెలంగాణతో కలిపి, ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయమని కోరారు. అలాగే యిప్పుడు కుకీ భూముల కింద ఉన్న నిక్షేపాల కోసమే గ్రేటర్ మిజోరాం ఐడియాను జోరమ్‌తంగా ముందుకు తెచ్చి ఉండవచ్చు. మే4 నాటి నగ్న వీడియో బయటకు రాగానే కుకీలకు సంఘీభావంగా మిజోరాంలో జులై 26న జరిగిన నిరసన ప్రదర్శనలో అతను పాల్గొన్నాడు. అది బీరేన్‌ను మండించింది. మణిపూరు అంతర్గత వ్యవహారాల్లో కలగ చేసుకోవద్దని అతన్ని హెచ్చరించాడు. మైతేయీలు జోరమ్‌తంగా దిష్టిబొమ్మలు తగలబెట్టారు.
మాదక వ్యాపారంపై బీరేన్ చిత్తశుద్ధి – అల్లర్లు చెలరేగాక, బీరేన్ కుకీలపై నార్కో వ్యాపారుల ముద్ర కొట్టడాన్ని కూడా పైన చెప్పిన ప్రొఫెసర్ విమర్శించాడు. దీని గురించి బీరేన్ ఏం చెప్తూ వచ్చాడాని నేను నెట్ వెతికాను. 2022 డిసెంబరులో ఆయన దీనిపై ప్రకటన చేశాడు. 2022లో రూ.1228 కోట్ల విలువైన నార్కోటిక్స్‌ను పట్టుకున్నామని, 1780 ఎకరాల గసగసాల పంటను నాశనం చేశామని, 497 కేసులు పెట్టి 703 మందిని అరెస్టు చేసామని చెప్పాడు. 2021లో 6742 ఎకరాల గసగసాల పంటను నాశనం చేయగా యీ ఏడాది 1118 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందని అన్నాడు. ఇలా దాన్ని నియంత్రిస్తూ వచ్చామని చెప్తూ వచ్చిన బీరేన్ యిప్పుడీ అల్లర్లు జరగగానే అదే పెద్ద యిస్యూ కింద కలరింగు యివ్వడం వింతగా లేదూ! . మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన వారిలో 33% కుకీలని, 15% మైతేయీలని, 52% మైతేయీ ముస్లిములని పైన చెప్పిన ప్రొఫెసర్ అన్నాడు.
మాదకద్రవ్య వ్యాప్తి గురించి యింత మాట్లాడుతున్న బీరేన్ చిత్తశుద్ధిపై చాలా ప్రశ్నలే వస్తున్నాయి. ‘‘మణిపూరు కుకీ సమస్య’’ వ్యాసంలో ‘గసగసాల సాగు విషయంలో అందరికీ హస్తముందని తౌనావ్జామ్ బృందా అనే ఆవిడ ధృవీకరించారు. ఆవిడ సరిహద్దు ప్రాంతాల్లో నార్కోటిక్స్ విభాగంలో ఎఎస్పేగా పని చేశారు. ఎంతోమంది మాదక వ్యాపారులను చట్టానికి పట్టిచ్చారు. అలా పట్టిచ్చిన వారిలో ఒకతన్ని కోర్టు ఏదో సాకుతో వదిలేయడంతో ఆమెకు కోపం వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేసింది,’ అని రాశాను కదా. ఆవిడకు బీరేన్‌కు చాలా యుద్ధమే జరిగింది. తాను పట్టిచ్చిన డ్రగ్ లార్డ్‌ను వదిలేయమని బీరేన్ 2018లో తనపై ఒత్తిడి తెచ్చాడని ఆవిడ 2020 జులైలో పబ్లిగ్గా ఆరోపించింది. దానితో ఆమెను నార్కోటిక్స్ శాఖ నుంచి నుంచి తీసేసి, ఇంఫాల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కి బదిలీ చేసి ఏ పోస్టింగూ యివ్వకుండా కూర్చోబెట్టారు.
అంతేకాదు అ నెలలోనే ఆమెను ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో ఒక అర్ధరాత్రి 12.40కు మరో యిద్దరు స్త్రీలతో కారులో వెళుతూండగా ఆపేసి వేధించారు. ఎకె 47లు ధరించిన పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ కార్లతో సహా చుట్టుముట్టి అరెస్టు చేస్తామని చెప్పారు. ఆమె తను ఎడిషనల్ ఎస్పీ అని చెప్పినా వినిపించుకోలేదు. ఏమంటే ఆమె కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించింది అనారు. నా పదవి మార్చినా, నేనింకా పోలీసు అధికారిణినే కదా అని ఆమె గగ్గోలు పెట్టింది. అయినా వాళ్లు వినలేదు.. చివరకు ఆమె భర్త హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టుతో సహా వచ్చి గొడవ చేస్తే, 2 గంటల తర్వాత విడిచి పెట్టారు. ‘‘నేను నార్కోటిక్స్ లోంచి వచ్చేసినా, డ్రగ్ వ్యాపారంపై కన్నేసి ఉంచాను. బర్మా నుంచి సుగ్నూకి రవాణా అవుతున్న డ్రగ్స్ వాహనాలను వెంటాడుతూ వెళ్లాను. అప్పుడే వీళ్లు నన్ను ఆపారు. ఎందుకంటే కర్ఫ్యూ పేరు చెప్పారు. అదే సమయంలో అనేక కార్లు యథేచ్ఛగా మా ముందే వెళుతున్నాయి. ’ అందామె. ఈ మేరకు వీడియో కూడా పోస్టు చేసింది.
ఆమె తర్వాత 2018 జూన్‌లో ఏం జరిగిందో విపులంగా చెప్పసాగింది. ‘ఆటానమస్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మాజీ చైర్మన్, బిజెపి నాయకుడు అయిన చందేల్ జౌ యింటిపై నేను 150 మందిని వెంటపెట్టుకుని దాడి చేసి కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుకున్నాను. ఆ చందేల్ ముఖ్యమంత్రి బీరేన్ రెండో భార్యకు కుడిభుజం వంటి వాడు. అందుచేత ముఖ్యమంత్రి బిజెపి వైస్ ప్రెసిడెంటును నా వద్దకు పంపి కేసు విత్‌డ్రా చేయమని చెప్పించాడు. తర్వాత డిజిపి ద్వారా, ఆ తర్వాత నాకు బాస్ అయిన ఎస్పీ ద్వారాచెప్పించాడు. అయనా నేను లొంగలేదు. 2020లో యీ కథనాన్ని బయటపెట్టాక నాపై, నా వెర్షన్ ప్రచురించిన మీడియాపై పరువునష్టం దావాలు వేశాడు బీరేన్. డ్రగ్ లార్డ్ ను వదిలేస్తూ కోర్టు తీర్పు యిచ్చాక, విసిగిపోయి నేను రాజీనామా చేసి, 2022లో జెడియు టిక్కెట్టుపై పోటీ చేశాను. సాక్షాత్తూ అమిత్ షా నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నేను ఓడిపోయాను.’ అంటోందామె. రెండు వారాల క్రితం ఆమె యిచ్చిన యింటర్వ్యూలో చాలా వివరాలున్నాయి.
ఘర్షణలకు ప్రారంభం – ఈ ఘర్షణలకు యింత నేపథ్యం ఉంది. ఇవన్నీ కలబోసి చూస్తే పర్వత భూమి కోసం జరిగిన ప్రణాళికాబద్ధమైన పోరాటంగానే కనబడుతుంది. ఇదంతా ఎస్టీ తీర్పు రావడానికి ముందే జరిగింది. తమను నిర్వాసితులను చేయడం పై కుకీలు మార్చి 10న ఆందోళన చేపడితే అది చూర్చందాపూర్లో మాత్రం హింసాత్మకమైంది. వెంటనే బీరేన్ పర్వతప్రాంతాలన్నిటిలో సెక్షన్ 144 పెట్టేసి, కుకీ తీవ్రవాదులతో గతంలో కుదుర్చుకున్న ఎస్ఓఓ (సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్) ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసి, కూంబింగ్ ఆపరేషన్స్ ప్రారంభించాడు. ఏప్రిల్‌లోనే చురాచాంద్‌పూర్-ఖౌపమ్ ప్రొటెక్టెడ్ ఫారెస్టు ఏరియాలో ప్రభుత్వం రెవన్యూ, ఫారెస్టు శాఖలు జాయింటు సర్వే చేపడతామని ప్రకటించాయి. దీన్ని 2022 నవంబరు జీఓ ప్రకారం చేస్తారని గ్రహించిన ఐటిఎల్ఎఫ్ (ఇండీజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం) ఏప్రిల్ 19న ‘ఇది రూల్సు ప్రకారం లేదంటూ’ సర్వేను అడ్డుకుంటామని ప్రకటించింది.
మార్చి 27న మైతేయీలకు ఎస్టీ హోదా పరిగణించాలంటూ హైకోర్టు యిచ్చిన తీర్పు ఏప్రిల్ 19నే బహిర్గతం అయింది. దానికి 8 రోజుల క్రితమే 3 చర్చిలను నేలమట్టం చేసిన ఘటన జరిగింది. వీటన్నిటితో వాతావరణం వేడెక్కింది. ఏప్రిల్ 28న చురాచాంద్‌పూర్‌లో ఒక ఓపెన్ జిమ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించ వలసి ఉంది. కానీ ఆ సభ జరగడానికి ముందు రోజే కొందరు దాన్ని తగలబెట్టారు. దాంతో ప్రభుత్వం వారం రోజుల పాటు అక్కడ ఇంటర్నెట్ను బంద్ చేసింది. ఆ తర్వాత దాన్ని అనేకసార్లు పొడిగిస్తూ పోయింది.
మైతేయీలకు ఎస్టీ హోదాపై హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ నాగాలతో సహా ఆదివాసీ సంఘాలన్నీ కలసి ‘ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం’, ‘ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ ఆఫ్ మణిపూర్’గా ఏర్పడి మే3న ప్రదర్శనలు చేపట్టాయి. వారు ప్రదర్శన గురించి ప్రకటించగానే మైతేయీ వాలంటీర్లు కుకీలు నివసించే సైకుల్కు సరుకులు చేరకుండా ఇంఫాల్-సైకుల్ రోడ్డును ముందు రోజే దిగ్బంధం చేసి ఇంఫాల్ నుంచి వస్తున్న వాహనాలను వెనక్కి పంపేశారు. దానితో కుకీ ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. దీనికి తోడు కుకీ యుద్ధస్మారకాన్ని మైతేయీలు తగలబెట్టేశారన్న వదంతులు ప్రబలాయి. దీని ప్రభావం చురాచాంద్‌పూర్‌లో కనబడింది. హింస జరిగింది. అక్కడి ప్రదర్శనలో కుకీ తీవ్రవాదుల్లో కొందరు ఆయుధాలు ధరించి కనబడ్డారు. దానికి అసాం రైఫిల్స్ చేయూత ఉందని తేలింది. ఆనాటి ప్రదర్శనలో టోర్బంగ్ ప్రాంతంలో మైతేయీ ప్రజలపై దాడికి తెగబడింది.
ఇదే సమయంలో కుకీల చేతుల్లో ఒక మైతేయి మహిళ అత్యాచారానికి గురైందని ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు అయిందట. దానికి ప్రతిగా మే4న లోయలో కుకీల చర్చిని కొందరు మైతేయీలు కూల్చారు. ఇక అక్కణ్నుంచి చైన్ రియాక్షన్‌లా అల్లర్లు ప్రజ్వరిల్లాయి. అంటే యిదంతా కావాలని చేసిన కుట్ర అనేది అర్థమౌతోంది. రాష్ట్రప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేకపోతోందని గ్రహించిన కేంద్రం మణిపూరులో ఆర్టికల్ 355 విధించింది. అంటే అప్పటికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పరిస్థితి తీవ్రత తెలిసిందన్నమాట. కానీ మే 29 వరకు ఆయన అక్కడకు వెళ్లలేదు. రాష్ట్రప్రభుత్వం వైఫల్యానికి కారణమేమిటంటే, ప్రభుత్వ యంత్రాంగం రెండుగా చీలిపోవడం, ముఖ్యమంత్రి పక్షపాత వైఖరితో, తమ పట్ల ద్వేషభావంతో వ్యవహరిస్తున్నాడని కుకీలు భావించడం!
రెండుగా చీలిన ప్రభుత్వ యంత్రాంగం – మే3న హింసాత్మక ఘటనలు చెలరేగిన తర్వాత జరిగిన పరిణామేమిటంటే, పోలీసు స్టేషన్ల నుంచి, ఆయుధాగారాల నుంచి యిరుపక్షాల ఆందోళనకారులు ఆయుధాలను ఎత్తుకుని పోవడం. ఎత్తుకుపోయారనడం కంటె పోలీసులే వారికి అప్పగించారనడం సమంజసం. ఎందుకంటే ఆందోళనకారులు దాడి చేసినప్పుడు ఒక్క పోలీసు కూడా గాయపడినట్లు తెలియరాలేదు. మైతేయీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మైతేయీ పోలీసులు, మైతేయీ ఆందోళనకారులకు అప్పగించగా, కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కుకీ పోలీసులు, కుకీ ఆందోళనకారులకు అప్పగించారు. వీటిల్లో అత్యాధునిక ఆయుధాలు, ఎసాల్ట్ రైఫిల్స్, మోర్టల్ బాంబులు, గ్రెనేడ్స్ ఉన్నాయి. లోయ ప్రాంతంలోని పోలీసు ఆయుధాగారాల నుంచి ఎక్కువ ఆయుధాలు ‘చోరీ’ అయ్యాయి కాబట్టే అల్లర్లలో మైతేయీలది పైచేయి అయింది.
ముఖ్యమంత్రి సెక్యూరిటీ సలహాదారు బహిరంగంగా చెప్పాడు. ‘ఇరు ప్రాంతాల్లోని క్యాంపుల నుంచి క్యాడర్, ఆయుధాలు రెండూ మిస్సయ్యాయి.’ అని. అంటే ఆయుధాలతో పాటు పోలీసులు, సైనికులు కూడా విధ్వంసకారులతో చేతులు కలిపారు. జనరల్‌గా చెప్పాలంటే మణిపూరు పోలీసులు మైతేయీల పక్షాన నిలవగా అసాం రైఫిల్స్ కుకీల పక్షాన నిలిచారు. మైతేయీలు కుకీల పొలాల మీద, యిళ్ల మీద దాడులు చేసినపుడు అసాం రైఫిల్స్ వారిపై కాల్పులు కాలుస్తున్నారు. బ్రిటిషు కాలం నుంచీ అసాం రైఫిల్స్‌కు 100 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. కేంద్ర హోం శాఖ, ఈశాన్య ప్రాంతాల్లోను, యితర ప్రాంతాల్లోను కౌంటర్ ఇన్సర్జన్సీ ఆపరేషన్స్ (దేశంపై తిరుగుబాటు చర్యలను అరికట్టడం)కై దీన్ని వినియోగిస్తూ ఉంటుంది. 1962 చైనా యుద్ధంలో, 1987లో శ్రీలంకకు పంపిన ఐపికెఎఫ్‌లో పాలుపంచుకుంది. ప్రస్తుతం 46 బెటాలియన్స్ ఉన్నాయి.
మణిపూరులో గిరిజనుల ఆందోళనలు ఎక్కువగా ఉన్న రోజుల్లో అసాం రైఫిల్స్‌ను అక్కడకు పంపారు. 2004లో 32 ఏళ్ల ఒక గిరిజన యువతిని ప్రశ్నించడానికి వీళ్లు హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు. నాలుగు రోజుల తర్వాత ఆమె శవం పొలాల్లో కనబడింది. మానభంగం కూడా జరిగిందని తేలడంతో 12 మంది మణిపూరు మహిళలు అసాం రైఫిల్స్‌కు వ్యతిరేకంగా నగ్న ప్రదర్శన జరిపి యీ అఘాయిత్యాన్ని అందరి దృష్టికీ తెచ్చారు. ప్రధాని మన్మోహన్ వెంటనే వారి హెడ్‌క్వార్టర్స్‌ను వేరే చోటకి తరలించారు.
ఇప్పుడు యిది కుకీల పక్షాన ఉంటూ వారి కొమ్ము కాస్తోందని అనుమానం ఉండడంతో మరో మచ్చ పడింది. చురాచాంద్‌పూర్‌లో మే3న జరిగిన కుకీల ప్రదర్శనలో కుకీ తీవ్రవాద క్యాడర్ పాలు పంచుకోవడం వీరి వలననే సాధ్యపడిందని అనుమానం.
ఎందుకంటే ఆ క్యాడర్లు ఉండే కాంపులన్నీ వీరి పర్యవేక్షణలోనే ఉంటాయి. క్యాంపుల్లోంచి ఎవరు బయటకు వెళ్లినా, లోపలకి వచ్చినా వీరు నమోదు చేస్తూంటారు. మైతేయీలు అసాం రైఫిల్స్‌ను నమ్మనట్లే, కుకీలు మణిపూరు పోలీసులను, ముఖ్యంగా మణిపూరు కమెండోలను నమ్మరు. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే – తాము కుకీ సాయుధులను వెంటాడుతూంటే మధ్యలో అసాం రైఫిల్స్ వారు తమ వాహనాలతో మార్గాన్ని అడ్డగించారని ఆరోపిస్తూ మణిపూరు పోలీసులు ఆగస్టు9 న అసాం రైఫిల్స్‌పై కేసు పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగం జాతుల వారీగా రెండుగా చీలిపోయిందని అందరికీ తేటతెల్లం కావడంతో ఆగస్టు 13న ప్రభుత్వం ప్రభుత్వాధికారులు అన్ని రకాల సోషల్ మీడియా గ్రూపుల్లోంచి తప్పుకోవాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఇలాటి పరిస్థితుల్లో అల్లర్లు ప్రజ్వరిల్లడంలో ఆశ్చర్యమేముంది? దానిపై ‘‘మణిపూరులో ప్రభుత్వవైఫల్యం’’ అనే వ్యాసంలో చెప్తాను. (ఫోటో – పైన – అసాం రైఫిల్స్, మణిపూరు పోలీస్, కింద – మైతేయీ ఎస్టీ హోదాకు వ్యతిరేక ర్యాలీ, మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2023)