వైసీపీకి రాజీనామా చేసిన గన్నవరం నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బలహీనతను బయట పెట్టారు. ఇవాళ ఆయన చంద్రబాబునాయుడిని కలిశారు. వైసీపీకి రాజీనామా చేయడం, ఆ తర్వాత రెండు రోజుల్లోనే చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీతో యార్లగడ్డ పేచీ కేవలం టికెట్టే. 2019లో గన్నవరం నుంచి వైసీపీ తరపున యార్లగడ్డ పోటీ చేసి ఓడిపోయారు.
వైసీపీ గాలిలో కూడా యార్లగడ్డ ఓడిపోయారంటే, ఆయన నాయకత్వ సమర్థతను అర్థం చేసుకోవచ్చు. ఇదే సందర్భంలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ విషయమై యార్లగడ్డకు వైసీపీ పెద్దలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
ఇక తనకు టికెట్ దక్కదని తెలిసి యార్లగడ్డ సహజంగానే పక్క చూపులు చూశారు. గన్నవరంలో టీడీపీకి దిక్కులేదని, తాను వెళితే టికెట్ వస్తుందని ఆయన అనుకున్నారు. ఈ మేరకు చంద్రబాబునాయుడిని ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే చేస్తానని చెప్పారు. గుడివాడలో చేయమన్నా చేస్తామని యార్లగడ్డ స్పష్టం చేశారు.
వైసీపీలో మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అంటే టీడీపీలో నాయకుల ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కనీసం పార్టీ కండువా కూడా కప్పుకోకుండానే గన్నవరం నుంచి పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. టీడీపీలో కనీసం చేరకుండానే టికెట్ కూడా ప్రకటించుకోవడం చూస్తే, ఆ పార్టీ ఎంత బలహీనంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షమన్న చందంగా, గన్నవరంలో టీడీపీ పాలిట తాను మహావృక్షమనే ఫీలింగ్‌లో యార్లగడ్డ ఉన్నారు. ఇదంతా టీడీపీ బలహీనత వల్ల తలెత్తిన అవలక్షణాలుగా భావించొచ్చు.