ఆంధ్రజ్యోతి కొత్తపలుకు సహజ ధోరణిలో జగన్‌ని దుమ్మెత్తి పోసింది. మార్గదర్శిపై దాడి జరుగుతోందని రాధాకృష్ణ ఆవేదన చెందారు. ఒక రకంగా ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అన్నట్టు బాధపడ్డారు. ఈనాడు దుమ్మెత్తి పోస్తోంది కాబట్టి ఇంత కక్ష అన్నారు.
పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడ్డం అనవసరం. ఎందుకంటే ఈ దేశంలో మీడియా అంటే యజమానులు, వాళ్ల రాజకీయ అవసరాలే. జర్నలిస్టులు, జర్నలిజం ఇదంతా భ్రమ, భ్రాంతి. పత్రికలు రాజకీయాలను రాస్తే, ఎవరికీ పేచీ లేదు. రాజకీయాలు చేస్తేనే పేచీ, సమస్య.
గతంలో ఆంధ్రప్రతిక, ఆంధ్రప్రభ ఉండేవి. ఆంధ్రజ్యోతి వున్నా అది విజయవాడకే పరిమితం. ఎమర్జెన్సీలో ప్రభ, ఎక్స్‌ప్రెస్ ఇందిరాగాంధీని వ్యతిరేకించాయి. అంతటి నియంత ఇందిరమ్మ కూడా వాళ్ల ఆస్తుల జోలికి పోలేదు. ఎందుకంటే పత్రికలని ముందర పెట్టి వేరే వ్యాపారాల్ని చేయడం వాళ్లకి తెలియదు. అందుకే కాలక్రమంలో అంతరించిపోయాయి.
ఈనాడుతో కొత్త ఆట ప్రారంభమైంది. అప్పటి సీఎం జలగం వెంగలరావు సాయంతో ఇతర వ్యాపారాలను (ప్రియ పచ్చళ్లు, మార్గదర్శి) అభివృద్ధి చేయడం మొదలైంది. 1983లో తెలుగుదేశాన్ని భుజాన మోసింది. కాంగ్రెస్ భ్రష్టు పట్టడం వల్ల అది సరైన జర్నలిజం అనిపించింది. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత 84లో జరిగిన తిరుగుబాటుని తీవ్రంగా వ్యతిరేకించి ప్రజాభిప్రాయాన్ని మలచడంతో ఈనాడుది పెద్దన్న పాత్ర. 85లో మళ్లీ ఎన్టీఆర్ గెలిచారు. 89లో ఓడిపోయారు. కాంగ్రెస్ అరాచకం మళ్లీ మొదలు. ముఖ్యమంత్రులు మారారు. 94లో మళ్లీ ఎన్టీఆర్. అప్పటికి ఈనాడుకి జ్యోతి కూడా జత కట్టింది. ఆ తర్వాత వీళ్లు గొప్పగా చెప్పే పత్రికా విలువల పతనం ప్రారంభమైంది. రామోజీ, రాధాకృష్ణల ఆస్తులు వేల కోట్లకి చేరుకున్నాయి. వ్యాపారంలో లాభం రావాలంటే ఏదో ఒకటి అమ్ముకోవాలి. వీళ్లు జర్నలిజాన్ని అమ్ముకున్నారు.
ఎన్టీఆర్‌కి బదులు చంద్రబాబు వుంటే వీళ్లకి సేఫ్ గేమ్. లక్ష్మీపార్వతి సాకు దొరికింది. చంద్రబాబు వీళ్లని భ్రష్టు పట్టించాడా? వీళ్లే చంద్రబాబుని భ్రష్టు పట్టించారో తెలియదు. ఒకరికొకరు అండగా నిలిచారు. ఇరువైపులా వేల కోట్ల ఆస్తులు పెరిగాయి.
బాబు తర్వాత ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయితే కథ వేరు. అయితే వైఎస్ అయ్యారు. ఈ రెండు పత్రికల సంగతి ఆయనకి బాగా తెలుసు. అబద్ధాలు, అర్ధ సత్యాలు రాసి నమ్మించగలరు, మెప్పించగలరు.
దాంతో సాక్షి పుట్టింది. ఆ రెండు పత్రికలు రాసే వార్తలకి కౌంటర్ దొరికింది. సాక్షి లేకపోతే ఈనాడు, జ్యోతి కలిసి జగన్‌ని అనామకునిగా చేసేవి. ఓదార్పు, పాదయాత్రలకి సింగిల్ కాలం కేటాయించి , అవి అసలే జరగడం లేదనే కలర్ ఇచ్చేవి.
సాక్షి కొంత కాలం గట్టిగానే పోరాడింది. అయితే రాజకీయ పత్రికగా ప్రారంభమైన సాక్షి, రాజకీయాలతో నిండిపోయింది. గట్టిగా పనిచేసే వాళ్లందరినీ బయటికి పంపడం అనే ఉద్యమాన్ని ఏళ్ల తరబడి చేపట్టి చివరికి ఈ రెండు పత్రికల సరసన చేరింది. ఈనాడు, జ్యోతి గురించి రాస్తున్నప్పుడు సాక్షి గురించి రాయకపోతే నేరం.
కొత్త పలుకు గురించి చెప్పాలంటే మార్గదర్శి మీద దాడులు అన్యాయం. వేల మంది ఉద్యోగులు రోడ్డున పడుతారు. ఈనాడు చేసిన దుష్ప్రచారంలో ఎన్నో చిట్‌ఫండ్ కంపెనీలు మూత పడ్డాయి. అక్కడ పనిచేసిన వాళ్లు ఉద్యోగులు కారా? వాళ్లకి భార్యాపిల్లలు లేరా?
భారతి సిమెంట్ మీద మీరు ఎన్ని వార్తలు రాయలేదు. మరి అక్కడ ఉద్యోగులు లేరా? వాళ్లకి జీవితాలు లేవా? జ్యోతి, ఈనాడులకి దేని గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే పత్రికా నిర్వహణలో పెద్దగా లాభాలు రావని వీళ్లంటారు. వేజ్‌బోర్డులు అమలు చేయాల్సి వస్తుందని ఉద్యోగుల్ని బినామీ కంపెనీల్లో చూపిస్తారు. జీతాలు అన్యాయంగా ఇస్తారు. వెట్టి చాకిరీ చేయిస్తారు. వాళ్ల వరకూ వస్తే విలువల గురించి మాట్లాడ్తారు.
ఆంధ్రజ్యోతి నిర్వహణ కష్టం, నష్టం అనే రాధాకృష్ణ ఆస్తులు జ్యోతి యజమాని కాకమునుపు ఎంత? తర్వాత ఎంత? ఎవరికీ లెక్కలు చెప్పక్కర్లేదు. తనకి తాను చెప్పుకుంటే చాలు. ఈనాడులో పెద్దగా లాభాలు రావనుకుంటే రామోజీ ఎంఫైర్ ఎలా నిర్మితమమైంది. ఈనాడు లేకపోతే ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే. వ్యాపారులు నాయకులకి వినయంగా వుంటారు. నాయకుల్ని శాసించే వాళ్లని మీడియా వ్యాపారవేత్తలంటారు.
యుద్ధంలో నీతినియమాలుండవు. ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయాల్ని యుద్ధంగా మార్చిన పాపంలో ఈ రెండు పత్రికలకి ఎంతోకొంత వాటా వుంది. యుద్ధం ప్రారంభించిన వాళ్లు దాడికి కూడా సిద్ధంగా వుండాలి. దాడి ఎప్పుడూ ఏకపక్షంగా వుండదు. ఆయుధం అవతలి వారి చేతికి కూడా అందుతుంది. తెలుగు డిక్షనరీలో పత్రిక అనే పదానికి అర్థం ప్రయోజనం అని మార్చినందుకు ఫలితం అనుభవించాల్సిందే.