ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ మరోసారి హవా కొనసాగించింది. అయితే తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో మాత్రం టీడీపీకి వైసీపీ ఏకగ్రీవాల రూపంలో వార్డులను సమర్పించుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక్కడి నుంచి కిలివేటి సంజీవయ్య వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో మూడు టీడీపీకి, ఒకటి వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయంటే… అధికార పార్టీ ఎంత బలహీనంగా వుందో అర్థం చేసుకోవచ్చు.
నాయుడుపేల మండలంలోని గొట్టిపోలు గ్రామ పంచాయతీలో, ఓజిలి మండలంలోని రావిపాడులో, తడ మండలంలోని పూడి పంచాయతీలోని ఒక వార్డు చొప్పున మూడు స్థానాలు టీడీపీకి ఏకగ్రీవం కావడం విశేషం. సూళ్లూరుపేట మండలంలోని కేసీఆర్‌గుంట పంచాయతీలో ఒక వార్డు వైసీపీకి ఏకగ్రీవమైంది.
సూళ్లూరుపేట వైసీపీలో ఇటీవల కాలంలో తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలపై ఎమ్మెల్యే సంజీవయ్య పోలీసులతో హింసిస్తున్నారంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. గడపగడపకూ వెళుతున్న సంజీవయ్యను వైసీపీ శ్రేణులే నిలదీస్తుండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో టీడీపీకి ఏకగ్రీవాలు కావడం అంటే, వైసీపీని ఎమ్మెల్యే పూర్తిగా విడిచిపెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూళ్లూరుపేటపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టకపోతే మాత్రం రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.