చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మరోసారి టీడీపీకి ఎదురుగాలి తగిలింది. వై నాట్ కుప్పం నినాదంతో దూసుకెళుతున్న వైసీపీకి తాజా స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు జోష్ పెంచాయి. కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డులకు ఉప ఎన్నికలు జరగ్గా, కేవలం ఒక్కటంటే ఒక్క చోటే టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. వైసీపీ నాలుగు చోట్ల గెలుపొందగా, ఒక స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవడం విశేషం.
ఈ ఫలితాలపై టీడీపీ నోరు మెదపడం లేదు. అసలు ఏమీ జరగనట్టు టీడీపీ తేలు కుట్టిన మాదిరిగా మౌనాన్ని ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండల పరిధిలోని పెద్దబదినవాడ పంచాయతీలోని నాల్గో వార్డులో టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. ఇదే పంచాయతీలో మరో వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. అలాగే వి.కోట మండల పరిధిలోని కొంగటం పంచాయతీ పడిగలకుప్పం వార్డులో వైసీపీ అభ్యర్థి గెలుపొంతారు. ఇక్కడ ఇద్దరూ వైసీపీ మద్దతుదారులే తలపడడం విశేషం.
శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో 10వ వార్డులోనూ, అలాగే అదే మండలం మఠం పంచాయతీలోని పదో వార్డులోనూ వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఇదిలా వుండగా చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న కడపల్లె పంచాయతీలో కూడా వైసీపీ మద్దతుదారే గెలవడం విశేషం.
వైఎస్సార్ జిల్లాలో రెండు వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు గెలవగా, కడపలో వైసీపీకి ఎదురు గాలి అంటూ రాసిన ఎల్లో పత్రిక, స్వయంగా చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఆయన పార్టీకి ఘోర పరాజయం ఎదురైనా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. చంద్రబాబుకు కుప్పంతోనూ, చిత్తూరు జిల్లాతోనూ ఏ విధమైన సంబంధం లేదన్నట్టు ఎల్లో మీడియా వ్యవహరించడం చర్చనీయాంశమైంది.