రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నాయ‌న‌కు ప్రాధాన్యం!

వైఎస్సార్ ఆక‌స్మిక మ‌ర‌ణం, ఏపీ విభ‌జ‌న తదిత‌ర కార‌ణాలు కాంగ్రెస్ పార్టీని తెలుగు రాష్ట్రాల‌తో పాటు జాతీయ స్థాయిలో కూడా దెబ్బ‌తీశాయి. ఈ నేప‌థ్యంలో కొంత మంది కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుల భ‌విత అంధ‌కార‌మైంది.…

వైఎస్సార్ ఆక‌స్మిక మ‌ర‌ణం, ఏపీ విభ‌జ‌న తదిత‌ర కార‌ణాలు కాంగ్రెస్ పార్టీని తెలుగు రాష్ట్రాల‌తో పాటు జాతీయ స్థాయిలో కూడా దెబ్బ‌తీశాయి. ఈ నేప‌థ్యంలో కొంత మంది కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుల భ‌విత అంధ‌కార‌మైంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన ర‌ఘువీరారెడ్డి రాజ‌కీయాల‌పై విరక్తితో అనంత‌పురం జిల్లాలోని త‌న స్వ‌గ్రామంలో సేద తీరుతున్న సంగ‌తి తెలిసిందే. అలాంటి ర‌ఘువీరారెడ్డికి తాజాగా జాతీయ కాంగ్రెస్ ప్ర‌క‌టించిన వ‌ర్కింగ్ క‌మిటీలో కీల‌క స్థానం ల‌భించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీని ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఆదివారం ప్ర‌క‌టించారు. 39 మందితో సీడ‌బ్ల్యూసీని ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవ‌లం ర‌ఘువీరారెడ్డికి మాత్రమే చోటు ద‌క్క‌డం విశేషం. 18 మంది శాశ్వ‌త ఆహ్వానితులు, అలాగే 13 మంది ప్ర‌త్యేక ఆహ్వానితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన నాయ‌కుల‌కు స్థానం క‌ల్పించారు. అయితే కీల‌క‌మైన సీడ‌బ్ల్యూసీలో ర‌ఘువీరారెడ్డికి చోటు ఇవ్వ‌డ‌మే కాంగ్రెస్ నాయ‌కులు, శ్రేణుల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఎందుకంటే ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా వుండ‌డ‌మే. ఇటీవ‌ల రాయ‌పూర్‌లో జ‌రిగిన కాంగ్రెస్ ప్లీన‌రీ స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. అలాగే కర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా ర‌ఘువీరారెడ్డి విస్తృతంగా తిరిగారు. క‌ర్నాట‌క బోర్డ‌ర్‌లో వుంటున్న ర‌ఘువీరాకు క‌న్న‌డ భాష‌పై ప‌ట్టు వుంది. దీంతో క‌ర్నాట‌క ప్ర‌చారంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యారు. ఆ త‌ర్వాత ఎప్ప‌ట్లాగే రాజ‌కీయాల‌కు దూరంగా వుంటున్నారు.

ర‌ఘువీరాకు అత్య‌ధిక ప్రాధాన్యం ఇవ్వ‌డం వెనుక కార‌ణం ఏమై వుంటుంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రోవైపు తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల‌కు పార్టీ కీల‌క ప‌ద‌వులు ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అవేవీ అమ‌లుకు నోచుకోక‌పోవ‌డం తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల్ని నిరాశ ప‌రుస్తోంది