జర్నలిస్ట్ కావాలంటే సమస్యల మీద అవగాహన కావాలి. డాక్టర్ కావాలంటే ఏడేళ్లు చదవాలి. అదే మాదిరిగా ఈ పదేళ్ల అనుభవంతో సిఎమ్ కావడానికి నేను రెడీ అయ్యాను అంటూ వివరించారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. నిజమే ఆ మాత్రం తనకు తాను చెప్పుకోకపోతే, జనం జనసేనకు ఎందుకు ఓటేస్తారు? పవన్ సిఎమ్ అభ్యర్థి కాదు అంటే చాలు జనసైనికులు పవన్ ను చూడడంతో సరిపెట్టేసుకుని, ఎవరికి అభిమానం వున్న చోట వాళ్ల ఓటు అందిస్తారు. అందుకే తాను సిఎమ్ పోస్ట్ కు రెడీ.. రెడీ అని పవన్ గుర్తు చేస్తుంటారు.
కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే పవన్ రెడీ కావడం కాదు కీలకం, పార్టీ రెడీ కావాలి. అది మాత్రం ఇప్పటికి ఇంకా జరగలేదు. ఎప్పటికైనా రెడీ అవుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే పవన్ నేరుగా జనాల్లోకి రారు. చంద్రబాబు పొత్తుతో తప్ప. గతంలో వచ్చినా లోపాయకారీ పొత్తు వుండనే వుంది. గాజువాకలో పవన్ పోటీ చేసినపుడు కూడా చంద్రబాబు అక్కడ తెలుగుదేశం తరపున ప్రచారం చేయకుండా లోపాయకారీగా జరగాల్సిన చర్చలు జరిగాయి.
సో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తో పొత్తు అధికారికంగానో, అనధికారికంగానో వుంటూ వస్తుందో ఆ పార్టీ ఎదగడం అన్నది అసాధ్యం. తెలుగునాట భారతీయ జనతాపార్టీ ని చూస్తనేే ఇది అర్థం అవుతుంది. వెంకయ్య సారథ్యంలో, అదుపాజ్ఙల్లో పార్టీ వున్నంత కాలం అది తెలుగుదేశం బి పార్టీగానే వుంటూ వచ్చింది. ఎదుగు బొదుగులేకుండా వుండిపోయింది. ఇప్పుడు జనసేన కూడా అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకుంది. కాపు సామాజిక వర్గ యువత, పవర్ స్టార్ ఫ్యాన్స్ జై పవన్ అంటున్నారు. పవన్ నే సిఎమ్ అంటున్నారు. పార్టీ మాత్రం ఎదగడం లేదు.
వరుసగా ఫేక్ నో రియల్ నో సర్వేల మీద సర్వేలు వస్తున్నాయి. ప్రతి సర్వేలో అయితే తెలుగుదేశం లేదంటే వైకాపా లీడ్ లో వుంటున్నాయి. అంతే తప్ప జనసేన జాడ కనిపించడమే లేదు. అస్సలు ఓ సీటు, రెండు సీట్లు అన్నదే తప్ప ఊపు లేనే లేదు. అంటే కావాలని జనసేనను తక్కువ చేస్తున్నట్లా? లేక నిజంగా తక్కువే వున్నట్లా?
సరే, సర్వేల సంగతి పక్కన పెడితే సర్పంచ్ పదవుల ఉపఎన్నికలు జరిగాయి. మరి జనసేన వీటిలో పాల్గొనలేదా.. లేదా పాల్గొన్నా ఒక్క ఓటు కూడా పడలేదా.. ఒక్క సీటు కూడా రాలేదా? దీని గురించి జనసేన శతృఘ్ని కామెంట్ ఏమిటో?
పార్టీని పటిష్ట పరచకుండా, ఎక్కడిక్కడ పార్టీ బాధ్యులను, ఎక్కడిక్కడ పార్టీ నిర్మాణం చేయడం అన్నది పవన్ వల్ల కావడంలేదు. అలా నిర్మాణం చేయడం ఒక ఎత్తు. పార్టీలో గ్రూపులు రాకుండా చూసుకోవడం మరో ఎత్తు. ఇదంతా చిన్న చితక విషయం కాదు. ఈ టాస్క్ ను పవన్ చేయలేకపోతున్నారు. అందుకే జనాలు వస్తున్నారు, జేజేలు కొడుతున్నారు. పవన్ ను చూసి వెళ్తున్నారు. అంతకు మించి మరేం లేదు.
దీన్ని చూపించి, తనకు ఎలిజిబులిటీ వచ్చేసింది. సిఎమ్ పోస్ట్ కు రెడీ అంటున్నారుస కానీ చంద్రబాబు కు అంతా తెలుసు కదా డజనో,రెండు డజనో సీట్లు ఇవ్వడం, అందులో కూడా తమకు అనుకూలమైన వారిని సజెస్ట్ చేయడం తప్ప అంతకు మించి వుండదు. ఆ రెండు డజన్లలో నెగ్గుకు వచ్చే వాటిని బట్టి, ఒకటో రెండు మంత్రి పదవులు జనసేనను అంటి పెట్టుకుని వుండడం కోసం ఇవ్వడం తప్ప మరోటి వుండకపోవచ్చు.
ఈ మెచ్యూరిటీ రావాలంటే పవన్ ఈ ఎన్నికల ఫలితాలు కూడా చూడాల్సి వుంటుంది.