నేతన్న నేస్తం ఓకే.. సహకార సంఘాల మాటేంటి?

చేనేతలకు రెండో ఏడాది నేతన్న నేస్తం నిధులను విడుదల చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. చేనేత కళాకారులను ఆదుకుంటామంటూ మాటలు చెప్పినవారే కానీ, వారికి నిజంగా అండగా నిలబడ్డ ప్రభుత్వాలు ఇప్పటివరకూ లేవు. గతంలో…

చేనేతలకు రెండో ఏడాది నేతన్న నేస్తం నిధులను విడుదల చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. చేనేత కళాకారులను ఆదుకుంటామంటూ మాటలు చెప్పినవారే కానీ, వారికి నిజంగా అండగా నిలబడ్డ ప్రభుత్వాలు ఇప్పటివరకూ లేవు. గతంలో చేనేత సహకార సంఘాల రుణాలు మాఫీ చేసి వైఎస్సార్ నేతన్నల నేస్తంలా మారితే.. ఇప్పుడు జగన్ రుణాల మాఫీతో పాటు ప్రతి కుటుంబానికీ ఏటా 24వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. రాష్ట్రంలోని 81,024 కుటుంబాలకు 194.46 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకుల్లో జమ అయ్యాయి.

అయితే కరోనా కష్టకాలంలో ఉపాధి లేక నేతన్నలు మరింత ఇబ్బంది పడుతున్నారు. బట్టల షాపుల్లో పెద్దగా బిజినెస్ జరక్కపోవడం, శుభకార్యాల్లో హడావిడి లేకపోవడం, పెళ్లిళ్లు, పేరంటాలు వాయిదా పడటంతో చేనేత ఉత్పత్తుల మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఇదే అదనుగా మాస్టర్ వీవర్లు కూలీల రేట్లు దారుణంగా తగ్గించేశారు. మార్కెట్ లేదు అనే వంకతో కూలీలను తగ్గించేశారు..

ఉదాహరణకు 5వేల రూపాయలు ఉండే కూలీ కరోనా లాక్ డౌన్ తర్వాత 3వేలకు పడిపోయింది. ఇష్టముంటే నేయండి, లేకపోతే లేదు అని చేనేత కార్మికులకు తెగేసి చెప్పేస్తున్నారు ముడి సరుకు చేరవేసే కామందులు. ఒకవేళ కార్మికుడు సొంతంగా ముడి సరుకు కొనుగోలు చేసి వస్త్రాన్ని తయారు చేసినా దాన్ని మార్కెట్ చేసుకోలేని పరిస్థితి. ఇలాంటి సమయాల్లో చేనేత సహకార సంఘాలు పటిష్టంగా ఉంటే నేతన్నలని ఎవరూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు.

అయితే దురదృష్టంకొద్దీ సహకార సంఘాలన్నీ కేవలం అలంకారప్రాయంగా మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోని సహకార సంఘాల్లో 90శాతం కేవలం ప్రభుత్వ సబ్సిడీ కోసమే ఎదురు చూస్తుంటాయి. అయితే ఆ సబ్సిడీ నేరుగా చేనేత కార్మికులకు చేరదు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేతలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తూ వారి కుటుంబాలకు పెద్దదిక్కుగా మారారు సీఎం జగన్. ఇప్పుడు అదే చేత్తో సహకార సంఘాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నారు సగటు కార్మికులు.

సంఘాల పేరుతో లాబీయింగ్ చేసే అతి కొద్ది మందికి మాత్రమే ఇవి ఆర్థిక వనరులుగా ఉపయోగపడుతున్నాయి. జమా ఖర్చులు, ఆడిటింగ్ లు.. అన్నీ తప్పుల తడకలే. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అవినీతిని కడిగేస్తున్న సీఎం జగన్.. చేనేత సహకార సంఘాలపై కూడా పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలని కోరుతున్నారు నేతన్నలు.

నిజంగా జగన్ ఈ పని చేస్తే, దాని ముందు ఏడాదికి 24వేల ఆర్థిక సహాయం కూడా చిన్నదైపోతుంది. సహకార సంఘాల ద్వారా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తే.. ప్రతి చేనేత కార్మికుడూ లక్షాధికారి అవుతాడు. మధ్యవర్తుల ప్రభావం తగ్గిపోతుంది, దళారుల భాగస్వామ్యం లేకుండానే ఉత్పత్తులు నేరుగా మార్కెట్లోకి వస్తాయి. ముఖ్యమంత్రి దీనిపై దృష్టిపెడితే బాగుంటుంది.

మరో 30ఏళ్ళు నువ్వే ఉండాలన్నా

చైనాకి బుద్ధి చెబుదాం