ఏపీలో కూడా పదో తరగతి విద్యార్థులు ఆల్ పాస్

రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్ అంతా పాస్…

రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్ అంతా పాస్ అయినట్టే. అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్స్ కేటాయిస్తారు.

పదో తరగతి పరీక్షలపై కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ తర్జనభర్జనలు జరిపింది. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో విడతల వారీగా విద్యాశాఖ మంత్రి సురేష్ సంప్రదింపులు జరిపారు. అలా సుదీర్ఘంగా సంప్రదింపులు జరిగిన తర్వాత పరీక్షల రద్దు వైపే ప్రభుత్వం మొగ్గుచూపింది. ఈ మేరకు మంత్రి సురేష్ కొద్దిసేపటి కిందట ప్రకటన చేశారు.

ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే.. ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల్ని కూడా ప్రభుత్వం రద్దుచేసింది. అంటే ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్లు కూడా పాస్ అయినట్టే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో ఫెయిలైన విద్యార్థులందర్నీ పాస్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా పరీక్ష ఫీజులు కట్టి ఉంటే ఆ ఫీజుల్ని కూడా వాపస్ చేస్తామని.. విద్యాశాఖ మంత్రి ప్రకటన చేశారు.

“కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఏ ఒక్క తల్లి కూడా తన బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెందకుండా, విద్యార్థులందర్నీ పరీక్షలతో నిమిత్తం లేకుండా పాస్ అయ్యేలా, పదో తరగతి పరీక్షల్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.”

కరోనా కారణంగా పదో తరగతి పరీక్షల్ని రద్దుచేస్తూ తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ కూడా చేరినట్టయింది. పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. రోజురోజుకు కంటైన్మెంట్ జోన్లు పెరుగుతుండడంతో.. తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం.

మరో 30ఏళ్ళు నువ్వే ఉండాలన్నా

చైనాకి బుద్ధి చెబుదాం