జనసేనాని పవన్‌కల్యాణ్ నాటకాన్ని రక్తి కట్టించారు. టీడీపీ, జనసేన మధ్య సాగుతున్న అక్రమ బంధంపై గత కొంత కాలంగా వైసీపీ ఆరోపిస్తున్నదే నిజమవుతోంది. చంద్రబాబు దత్తపుత్రుడు అని జగన్ ఏ ముహూర్తాన పేరు పెట్టారో గానీ, అది ముమ్మా టికీ నిజమని జనసేనాని తన చర్యల ద్వారా నిరూపించారు. జగన్ , వైసీపీ ఆరోపణలు నిజమని నమ్మడాన్ని పవన్ ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే ఆయనలో ఆ స్థాయిలో అసహనం.
పవన్‌కు సంఘీభావం చెప్పేందుకని చంద్రబాబు వెళ్లడం తెలిసిందే. తమ భేటీకి ఎలాంటి ఎన్నికల ప్రాధాన్యం లేదని పవన్, చంద్రబాబు ప్రకటించినప్పటికీ, ఆ మాటలన్నీ అబద్ధాలే అని తేలిపోయింది.
పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటనలో జనసేన ఉత్సాహం చూపడం విశేషం. నాదెండ్ల బహిరంగ సభ వద్ద జనసేన జెండాలు ప్రత్యక్షమయ్యాయి. అలాగే గ్రామాల్లో కూడా ఆ రెండు పార్టీల జెండాలు ఒకే వాహనానికి కట్టడం గమనార్హం. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మధ్య ముసుగు తెర తొలగింది. ఇక అధికారికంగా వాళ్ల మధ్య పొత్తు ఖరారు కావాల్సిందే మిగిలి వుంది. దీనికి మరికొంత సమయం పట్టొచ్చు.
బీజేపీతో మనువు, చంద్రబాబుతో మనసు పంచుకోవడం పవన్‌కల్యాణ్‌కే చెల్లింది. పవన్‌కల్యాణ్‌ను నమ్మి బీజేపీ మోస పోయింది, ఇంకా మోసపోతోంది. 2024లో జనసేనతో మాత్రమే పొత్తు వుంటుందని బీజేపీ నేతలు ఇంకా చెబుతూ, తమను తాము వంచించుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో కలిసి ప్రయాణం సాగించాలని ఇరు పార్టీల నేతలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని సమాచారం.
ఇక జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే అంశంపై చర్చ నడుస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోశం, “దేశం” కోసం పవన్‌కల్యాణ్ ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారనే ప్రచారం జరుగుతోంది. సీట్లు, ఓట్లపైన పవన్‌కు పెద్ద పట్టింపులు లేవని, ఆయన ఏకైక లక్ష్యం జగన్‌ను గద్దె దించడమే అని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి సీటులో చంద్రబాబును కూచోపెడితే పవన్ లక్ష్యం నెరవేరినట్టే అని రాజకీయ విమర్శకుల అభిప్రాయం. టీడీపీతో మొదటి నుంచి లోపాయికారి ఒప్పందంలో పవన్ ఉన్నారనేందుకు తాజా పరిణామాలే నిదర్శనం. పవన్‌పై ఏవైతే వైసీపీ ఆరోపణలు చేస్తున్నదో, అవి తూచా తప్పక నిరూపణ అవుతున్నాయనేది నిజం. ఇందుకు ఆ రెండు పార్టీల ఎజెండా ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డం, అలాగే వాటి జెండాలు ఒకే బండికి కట్టడమే నిదర్శనం.