పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చిన యూట్యూబ్ చానళ్లకు సెలబ్రిటీలు ఇచ్చే ఇంటర్వ్యూల్లో ఏవైనా హాట్ టాపిక్స్ రేగితే వాటిని ప్రధాన మీడియా వర్గాలు, ప్రింట్ మీడియా కూడా కవర్ చేయడం ఈ రోజుల్లో రివాజుగా మారింది. అలా కవర్ చేయడం తప్పనిసరిగా మారింది కూడా! దీనికి తెలుగులో గట్టిగా పునాదులు వేసుకున్న ప్రధాన ప్రింట్ మీడియా వర్గాలు కూడా మినహాయింపు కాదు ఏ మాత్రం!
ఇది వరకూ చిన్న చిన్న యూట్యూబ్ చానళ్ల ఇంటర్వ్యూల్లోని హైలెట్ లను అన్ని ప్రధాన మీడియా వర్గాల వెబ్ సైట్లూ వెనుకాడకుండా వేసుకుంటూ వచ్చాయి. కనీసం సదరు యూట్యూబ్ చానల్ కు క్రెడిట్ కూడా ఇవ్వకుండానే అవి బ్రేక్ చేసిన వార్తలను వేసేసుకునే రుబాబును ప్రదర్శించాయి పెద్ద పెద్ద మీడియా సంస్థలు!
మరి అవసరం కొద్దీ అలాంటి పనులు చేసినా, ఒక హాట్ టాపిక్ విషయంలో మాత్రం కన్వీన్సింగ్ కళ్లు మూసుకోవడం గమనార్హం. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవలి ఇంటర్వ్యూలో నటుడు బాలకృష్ణ తనతో దశాబ్దాల వెనుక అనుచితంగా ప్రవర్తించిన తీరును బయటపెట్టారు. తను ఎన్టీఆర్ కు పేరడీ లాంటి వేషం కట్టినందుకు, తన మొహంపై గాండ్రించి ఉమ్మేశారంటూ బాలకృష్ణ తత్వాన్ని కోట బయటపెట్టారు.
ఒకవేళ కోట ఈ విషయాన్ని దశాబ్దాల కిందటే చెప్పి ఉంటే.. అప్పుడు దాన్ని పట్టించుకునేందుకు ఈ మాత్రం మీడియా కూడా ఉండేది కాదేమో. అలాగే ఆయన కెరీర్ కు కూడా ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులు తప్పేవి కావు. దీంతో ఆ దారుణ అవమానాన్ని కోట మనసులోనే పెట్టుకుని, చివరకు ఓపెనప్ అయిపోయారు. ఆయన అప్పుడే స్పందించి ఉంటే, ఈ నాణ్యమైన నటుడు టాలీవుడ్ లో ఉనికిని కోల్పోయేవారంతేనేమో! మరి ఇప్పుడు చెప్పారు కదా.. ఎవరైనా దాన్ని ప్రస్తావిస్తున్నారా? అంటే కిక్కురుమంటే ఒట్టు!
పిల్ల పిల్ల యూట్యూబ్ చానళ్లకు దిక్కుమాలిన సెలబ్రిటీలు ఇచ్చే ఇంటర్వ్యూల్లో చెప్పే పోచికోలు విషయాలను వార్తలుగా ఇచ్చే ప్రధాన మీడియా స్రవంతి ఒక వెటరన్ టాలీవుడ్ యాక్టర్, మరో టాలీవుడ్ స్టార్ హీరో తనతో ప్రవర్తించిన తీరు గురించి చెబితే.. దాన్ని కనీస వార్తగా ఇచ్చే దమ్ము లేదు!
ఒక వర్గం మీడియాకు ఏమో ఈ వార్త ఇస్తే అది తమ రాజకీయ ప్రయోజనాలకు చాలా నష్టం కలుగుతుంది. బాలకృష్ణ అభిమానుల మీద పడి పిడిగుద్దులు కురిపించిన సమయాల్లో కూడా అవి కిక్కురుమనవు. అలాంటి సంఘటనలను కొన్ని చానళ్లు కనీసం మాట వరసకు అయినా చూపించేవి. అయితే ఒక వెటరన్ యాక్టర్ ను, తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరు.. అనిపించుకున్న నటుడు తన ఆవేదనను బయటపెడితే, దాన్ని ప్రస్తావించేందుకు ఇతర చానళ్లు కానీ, మీడియా వర్గాలు కూడా మొహం చాటేస్తున్నాయి.
ఇక ఇదే సమయంలో ఒకవేళ బాలకృష్ణ కాకుండా మరో హీరో విషయంలో కోట ఇలాంటి విషయాన్నే చెప్పాడనుకుందాం! అప్పుడేమయ్యుండేదో వేరే చెప్పనక్కర్లేదు. బోలెడంత స్పందన వచ్చేది మీడియా నుంచి. లెక్కకు మించి వార్తలు వచ్చేవి. ఆ హీరో బతుకును బస్టాండ్ చేసే వాళ్లు. టీవీల్లో చర్చాకార్యక్రమాలు లైవ్ లో నడిచేవి, దుమ్ము రేగిపోయేది!