ఎట్టకేలకు వైసీపీ సోషల్ మీడియా మొద్దు నిద్ర వీడింది. దాదాపు ఏడాదిగా తనకేం పట్టనట్టు ఉంది వైసీపీ సోషల్ మీడియా. దీంతో టీడీపీదే పైచేయిగా మారింది. ఉన్నవి లేనివీ సృష్టించి జగన్ పై అసత్య ప్రచారం మొదలు పెట్టింది. జనాల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాకు చురుకు పుట్టింది.
జగన్ పాదయాత్ర సమయంలో ఎంత యాక్టివ్ గా ఉందో ఓ సారి గుర్తు చేసుకుంది. రెండేళ్లకు పైగా స్తబ్దుగా ఉన్న సోషల్ మీడియా శ్రేణులు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. జగన్ పాలన ఫెయిల్ అని చెబుతున్న టీడీపీని ఓ రేంజ్ లో కార్నర్ చేస్తున్నారు.
ఈ రెండున్నరేళ్లు మీరు ఏం చేశారు?
జగన్ పాలన ఫెయిల్ ఉంటున్న టీడీపీ రెండున్నరేళ్లుగా ఏం చేసింది అనేది వైసీపీ సోషల్ మీడియా సూటి ప్రశ్న. ఏపీ అభివృద్ధిని రెండున్నరేళ్లుగా టీడీపీ అడ్డుకుంటోందని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నాయి వైసీపీ శ్రేణులు.
1. కోర్టుల్లో కేసులు వేసి ప్రజలకు ఉపయోగ పడే కార్యక్రమాలు అడ్డుకోవడం..
ఇంగ్లిష్ మీడియంను అడ్డుకోడానికి కేసులు, ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకోడానికి కేసులు, ఆఖరికి టెన్త్ పరీక్షల్ని అడ్డుకోడానికి కూడా కేసులు… ఇలా చెప్పుకుంటూ పోతే నవరత్నాల్లో అంతర్భాగమైన ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోడానికి టీడీపీ, దాని అనుబంధ విభాగాలు కోర్టులకెక్కాయి. ప్రతి చోటా అవాంతరాలు సృష్టించాలని చూశాయి. ఏపీలో అభివృద్ధి ఆలస్యం అయితే దానికి అసలు కారణం టీడీపీయేనని ఈ కేసులతో రుజువైంది.
2. మూడు రాజధానుల్ని అడ్డుకోవడం..
అభివృద్ధి వికేంద్రీకరణ కోసం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకి, దొడ్డిదారిన శాసన మండలిలో టీడీపీ ఎలా అడ్డుపడిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత కోర్టుల్లో కేసులు వేయించి ఇప్పటి వరకూ కర్నూలుకి న్యాయ రాజధాని కళ లేకుండా చేశారు. విశాఖకు పాలనలో భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారు. ఈ అడ్డగింపులు ఇంకెన్నాళ్లు అని టీడీపీని ప్రశ్నిస్తోంది వైసీపీ సోషల్ మీడియా విభాగం.
3. విశాఖ అంతమైపోతోందంటూ దుష్ప్రచారం..
సుందర సాగర తీరం విశాఖపై కూడా దుష్ప్రచారానికి వెనకాడలేదు టీడీపీ. పాలనా రాజధానిగా విశాఖకు పేరు రావడం ఇష్టం లేని టీడీపీ.. విశాఖ సాగర గర్భంలో కలసిపోతుందంటూ నాసా రిపోర్టుల్ని సైతం వక్రీకరించి తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించింది.
4. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చిందంటూ కథనాలు..
రాష్ట్రం అప్పుల్లో ఉన్నమాట వాస్తవం. విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గత పాలకులు గట్టెక్కించలేదు కాబట్టి ఆ అప్పులు కంటిన్యూ అయ్యాయి, ఆ తర్వాత కరోనా కష్టకాలం ఉండనే ఉంది, దానికితోడు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువయ్యాయి.
వెరసి రాష్ట్రం అప్పులు ఎక్కువగా చేయాల్సి వస్తోంది. కానీ ఆ సొమ్మంతా తిరిగి ప్రజల వద్దకే వెళ్తోంది కదా అనేది వైసీపీ లాజిక్. దీనిపై కూడా టీడీపీ, బీజేపీతో కలసి విషప్రచారం చేయిస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చిందంటూ కథనాలల్లుతోంది. ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టిస్తోంది.
5. వైసీపీ జనాల్లో ఉంటే టీడీపీ జూమ్ లో..
కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ప్రజలతోనే ఉంది. అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అధికారుల్ని అప్రమత్తం చేసి, కరోనా నష్టనివారణ చర్యలు చేపట్టారు. మరి బాధ్యత ఉన్న ప్రతిపక్షం ఏం చేసింది. జూమ్ కాన్ఫరెన్స్ లతో ప్రజల్ని భయాందోళనలకు గురి చేసింది. చేతల్లో ఏదీ చూపించకుండా కేవలం మాటలకే పరిమితం అయింది.
6. మతకల్లోలాలు రెచ్చగొట్టే ప్రయత్నం..
రాష్ట్రంలో ఎప్పుడూ లేనిది వైసీపీ అధికారంలోకి వచ్చాక మతకల్లోలాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి టీడీపీ, బీజేపీ. ఆమధ్య ఆలయాల్లో వివిధ ఘటనలు జరిగాయంటూ తమ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశాయి. తీరా పోలీసులు అలాంటి చర్యలపై ఉక్కుపాదం మోపడంతో కాస్త వెనక్కు తగ్గారు.
జగన్ ప్రజలకు ఏం చేశారనేది.. ఊరూవాడా సచివాలయాలే చెబుతున్నాయి, లబ్ధిదారులకు చేరువైన పథకాలే మాట్లాడుతున్నాయి. వాలంటీర్లే సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యక్ష సాక్షులు. అయితే అదే సమయంలో ప్రతిపక్షాల తప్పులేంటనేది వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పుడిప్పుడే జనాల్లోకి తీసుకెళ్తోంది. ప్రతిపక్షాలను ఎండగడుతోంది.