ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓ ప్రేమ లేఖ రాశారు. ఈ లేఖను చంద్రబాబు రాయించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది వేరే విషయం. అయితే పేరుకే వెలిగొండ… ఆ ప్రాజెక్టు సాకుతో ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్పై బండ వేసేందుకు టీడీపీ నేతల తాపత్రయం కనిపించింది.
వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని, నీటి కేటాయింపులు జరపొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా యాజమాన్యం బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసీఆర్కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికు మార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి కలిసి కేసీఆర్కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు.
వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టుపై ప్రకాశం జిల్లాతో పాటు కోస్తా జిల్లాల ప్రజల మనోభావాలు ఏంటో కేసీఆర్కు లేఖ ద్వారా వివరించారు. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం సరికాదని లేఖలో ప్రస్తావించారు.
ఇదే సందర్భంలో తమ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్పై విషం చిమ్మారు. జగన్ నిర్లక్ష్యం, చేతగానితనం వల్ల కేంద్ర గెజిట్లో వెలిగొండ ప్రాజెక్టు లేదని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం. ఈ ప్రాజెక్టు చేర్చాలని జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేయకపోవడంపై ప్రకాశం జిల్లా రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉందని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం విమర్శలకు తావిచ్చింది.
ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలు, రైతాంగాన్ని బాధితుల్ని చేయడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యేలు ఆ లేఖలో మొసలి కన్నీరు కార్చారు. చివరికి మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కూడా తమ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించడం టీడీపీ ఎమ్మెల్యేలకే చెల్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.