ఆత్మహత్య చేసుకుంటానంటున్న మాజీ మంత్రి

తెలంగాణ సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కేసీఆర్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. గ‌త…

తెలంగాణ సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కేసీఆర్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. గ‌త కొంత కాలంగా ఆయ‌న కేసీఆర్ ప్ర‌భుత్వ అనుకూల వైఖ‌రితో మాట్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీకి కూడా రాజీనామా చేశారు.

ఈ ప‌రంప‌ర‌లో ద‌ళిత‌బంధు పథ‌కంపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, ఇత‌ర పార్టీ నేత‌ల‌తో క‌లిసి అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నారని, వారి వైఖ‌రికి నిర‌స‌న‌గా బేగంపేట‌లోని త‌న నివాసంలో మోత్కుప‌ల్లి ఆదివారం నిర‌స‌న చేప‌ట్టారు. 

ఈ సంద‌ర్భంగా మోత్కుప‌ల్లి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో నూటికి నూరు శాతం దళితబంధు పథకాన్ని అమలు చేస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారన్నారు. కేసీఆర్ అమలు చేస్తారనే నమ్మకం ఉందన్నారు.

సీఎం కేసీఆర్‌ మాటల్లో నిజాయతీ కనిపించిందని.. ఒకవేల దళితబంధు అమలు కాకపోతే యాదగిరిగుట్ట దగ్గర ఆత్మహత్య చేసుకుంటాని ఆయ‌న హెచ్చరించారు. గ‌తంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం చేయ‌ని విధంగా ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని కేసీఆర్ స‌ర్కార్ తీసుకొచ్చింద‌న్నారు. 

కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేశారే త‌ప్ప‌, వారెవరూ దళితుల సంక్షేమం కోసం కృషి చేయ‌లేద‌న్నారు. దళితబంధు పథకం అమలుకు కాంగ్రెస్, బీజేపీ ఎందుకు అడ్డుపడుతున్నాయని మోత్కుప‌ల్లి ప్ర‌శ్నించారు.