అలాంటి వారికి ఒక్క డోసు టీకా చాలు!

క‌రోనా వ్యాక్సిన్ డోసేజ్ లు, వాటి ప్ర‌భావం గురించి ర‌క‌ర‌కాల ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ చిన్న చిన్న శాంపిల్స్ తో జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌లే. వంద మంది, రెండు వంద‌ల మంది శాంపిల్స్…

క‌రోనా వ్యాక్సిన్ డోసేజ్ లు, వాటి ప్ర‌భావం గురించి ర‌క‌ర‌కాల ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ చిన్న చిన్న శాంపిల్స్ తో జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌లే. వంద మంది, రెండు వంద‌ల మంది శాంపిల్స్ తో జ‌రుగుతున్న అధ్య‌య‌నాలు ఇవ‌న్నీ. దీంతో.. ఎటూ తేల‌డం లేదు వ్య‌వ‌హారం! వ్యాక్సిన్ విష‌యంలోనే ఇప్ప‌టికే లెక్క‌లేన‌న్ని అధ్య‌య‌నాలు వ‌చ్చాయి.

వివిధ వ్యాక్సిన్ల సామార్థ్యం గురించి మొద‌లుకుని వాటి ప్ర‌భావం ఎన్నాళ్లు ఉంటుంద‌నే అంశం గురించి కూడా ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి, జ‌రుగుతున్నాయి. వ్యాక్సిన్ 90 శాతం వ‌ర‌కూ క‌రోనా వ‌ల్ల ఆసుప‌త్రి పాల‌య్యే ప్ర‌మాదాన్ని నివారిస్తుంద‌ని కొన్ని అధ్య‌య‌నాలు చెప్పాయి. మ‌రి కొన్ని అధ్య‌య‌నాలు ఏమో వ్యాక్సిన్ ఆరు నెల‌లు మాత్ర‌మే ఇమ్యూనిటీని ఉంచ‌గలుగుతుంద‌ని అన్నాయి. అయితే అన్నీ ప‌రిమిత శాంపిల్స్ కావ‌డంతో దేన్నీ ప‌ట్టుకుని వాదించ‌లేని పరిస్థితి.

ఇక తాజాగా ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆధ్వ‌ర్యంలో ఒక ప‌రిశోధ‌న జ‌రిగింద‌ట‌. అప్ప‌టికే క‌రోనా ఒక‌సారి సోకిన వారికి, ఒక డోసు వ్యాక్సిన్ వేసిన త‌ర్వాత వ‌చ్చిన వ్యాధి నిరోధ‌క‌త గురించి ఈ అధ్య‌య‌నం జ‌రిగింద‌ట‌. దీని ప్ర‌కారం.. ఒక సారి కరోనాకు గురై, కోలుకున్నాకా.. క‌నీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేసుకున్నా.. వారిలో ఆ త‌ర్వాత క‌రోనాను ఎదుర్కొన యాంటీబాడీలు మెరుగైన స్థితిలో ఉన్నాయ‌నేది ఈ అధ్య‌య‌నం సారాంశం.  

ఈ అధ్య‌య‌నాన్ని చేసింది మాత్రం కేవ‌లం 114 మంది హెల్త్ వ‌ర్క‌ర్ల‌పై. వీరంద‌రూ ఒక‌సారి క‌రోనాకు గురై కోలుకున్న వారే. వారికి కోవ్యాగ్జిన్ ఒక డోసు ఇచ్చార‌ట‌. ఆ త‌ర్వాత ప‌రీక్ష‌లు చేస్తే, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి స‌మానంగా .. ఆ హెల్త్ వ‌ర్క‌ర్ల‌లో కూడా క‌రోనాను ఎదుర్కొనగ‌ల సామ‌ర్థ్యం ఉంద‌ని ఐసీఎంఆర్ నిర్ధారిస్తోంది. స‌ర్వే బాగానే ఉంది కానీ, మ‌రీ త‌క్కువ మంది మీదేనేమో అనుకోవాల్సి వ‌స్తోంది.

కొన్ని అధ్య‌య‌నాలు నోటి మాటగా కూడా ఇదే విష‌యాన్ని చాలా నెల‌ల కింద‌టే చెప్పాయి. మీరు ఒక్క‌సారి క‌రోనాకు గురై కోలుకుని, ఆ త‌ర్వాత ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారంటే.. ఏడాది పాటు మీకు క‌రోనాను జయించ‌గ‌ల ఇమ్యూనిటీ ఒంట్లో ఉన్న‌ట్టే  అని ఆరేడు నెల‌ల కింద‌టే కొన్ని అధ్య‌య‌నాలు చెప్పాయి. ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా కాస్త అటు ఇటూ అలానే చెబుతోంది. 

ఇక క‌రోనా నుంచి కోలుకుని ఒక డోసుకే ప‌రిమితం కావాల‌ని కూడా ఆ సంస్థ చెప్ప‌డం లేదు. త‌గిన విరామాల అనంత‌రం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవ‌డం కూడా మంచిదే అని అంటోంది ఐసీఎంఆర్.