తగుదునమ్మా అంటూ తమ్ముళ్ళు….?

అవును మరి. తెలుగు తమ్ముళ్ళు ప్రతీ దానికీ మోకాలడ్డుతూ మరో వైపు ఎక్కడ అభివృద్ధి అంటూ గావు కేకలు పెడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారంటే ఆలోచించాల్సిందే కదా. విశాఖ సిటీలో పేదలకు పక్కా ఇళ్ళు…

అవును మరి. తెలుగు తమ్ముళ్ళు ప్రతీ దానికీ మోకాలడ్డుతూ మరో వైపు ఎక్కడ అభివృద్ధి అంటూ గావు కేకలు పెడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారంటే ఆలోచించాల్సిందే కదా. విశాఖ సిటీలో పేదలకు పక్కా ఇళ్ళు ఇవ్వకుండా కోర్టు కేసులు కూడా వేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

మరో వైపు దర్జాగా విశాఖకు పరిపాలనా రాజధాని తీసుకువస్తామని వైసీపీ సర్కార్ చెబితే వద్దు అంటూ ఎంత రచ్చ చేయాలో అంతా చేశారు. ఇక ఇపుడు చూస్తే విశాఖ ప్రగతి మీద చర్చిద్దామంటూ తమ్ముళ్ళంతా తాజాగా సమావేశాలు పెడుతున్నారు.

విశాఖకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయ‌లేదని ఆడిపోసుకుంటున్నారు. అందుకే దీని మీద చిర్రెత్తుకువచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ అసలు విశాఖ అభివృద్ధి మీద మీకు శ్రద్ధ ఉందా అంటూ టీడీపీ నేతలను సూటిగా నిలదీశారు. విశాఖ రాజధాని వద్దు అన్నదెవరు అంటూ ఆయన నిగ్గదీశారు. ప్రతీ అభివృద్ధి కార్యక్రమానికి అడ్డు పుల్ల వేస్తోంది ఎవరు అంటూ బొత్స గట్టిగానే గర్జించారు.

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానీయవద్దు అని తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తమ్ముళ్లకు గుర్తు లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మోడీ కొలువులో క్యాబినేట్ మంత్రిగా పనిచేసిన పూసపాటి అశోక్ గజపతిరాజుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి తెలియదు అనుకునేంత అమాయకులు ఎవరైనా ఉన్నారా అంటూ బొత్స సెటైర్లు వేశారు. మొత్తానికి తమ్ముళ్ళు అంతా కలుస్తారట. 

ఉత్తరాంధ్రా అభివృద్ధి కోసం చర్చిస్తారట. పనిలో పనిగా విశాఖకు రాజధాని వద్దు అని మరో మారు డిమాండ్ చేయండని వైసీపీ నేతల నుంచి సెటైర్లు పడిపోతున్నాయి. ఎంతైనా దేనికైనా తగుదునమ్మా అంటూ రెడీ అవడమే తమ్ముళ్ల పని అంటూ వైసీపీ నేతలు అంటున్నారు మరి.