ఇండియాలో ఆన్ లైన్ స్టడీకి ప్రజలు ఏ మేరకు కనెక్ట్ అయ్యారనేది ప్రశ్నార్థకమే. గురువుతో డైరెక్ట్ గా చెప్పించుకోవడం మీదనే మనకు నమ్మకం ఎక్కువ. అసలు గురువులేని విద్య వర్ధిల్లదని బలంగా నమ్ముతాం. ఆన్ లైన్ లో కూడా గురువులుంటారు కానీ, అటాచ్ మెంట్ అయితే ఛాన్సే ఉండదు. ఏడాది నుంచి దేశమంతా ఆన్ లైన్ క్లాసులకే పరిమితం అయ్యింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో చాలా మందికి ఏడాదిన్నర నుంచి సెలవులే.
కరోనాకు ముందే కొన్ని సంస్థలు ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ను ఆఫర్ చేశాయి. దానికి విస్తృతప్రచారం కల్పించాయి. వాటిల్లో ఒకటి బైజూస్. వీళ్లు దాదాపు నాలుగైదేళ్ల నుంచి మహానగరాల్లో వీధివీధి ప్రచారం చేసుకున్నారు. ప్రతి ఆఫీస్ కూ వెళ్లి మీ ఇంట్లో చదువుకునే పిల్లలున్నారా, మా యాప్ మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోండంటూ.. ఉద్యోగులను అడగడంతో మొదలుపెట్టి.. అనేక రకాలుగా బైజూస్ తన ప్రమోషనల్ యాక్టివిటీస్ ను చేపట్టింది.
ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ కు వీళ్లెంతా ఖర్చు పెడుతున్నారో అని సామాన్యుడు విస్తుపోయేంత స్థాయిలో ఉంటుంది వీరి హంగామా. యాడ్ రేట్ పతాక స్థాయిలో ఉండే క్రికెట్ మ్యాచ్ ల సమయంలో లెక్కలేనన్ని సార్లు బైజూస్ యాడే వస్తుంటుంది. అలాగే ప్రాంతీయ భాషల యాడ్స్ కు లెక్కలేదు. మొదట్లో షారూక్ ఖాన్ దీనికి బ్రాండ్ అంబాసిడర్! అంతేనా.. క్రికెట్లో టీమిండియాకు ఇప్పుడు అఫిషియల్ స్పాన్సర్ బైజూసే! ఈ రేంజ్ లో ప్రమోట్ చేసుకోవాలంటే.. ఖర్చు వందలు కాదు, వేల కోట్ల స్థాయికి చేరొచ్చు వ్యవహారం.
అది కూడా ఆన్ లైన్ లో చదువులా అంటూ.. ఆశ్చర్యం వ్యక్తం చేసే జనాల మీద జరిగే వ్యాపారం ఇది. ఒకవేళ కరోనా పరిస్థితులు లేకపోతే.. ఆన్ లైన్ లో బిలో టెన్త్ క్లాస్ పిల్లలకు పాఠాలంటే మనోళ్లు నవ్వేవారు. అలాంటి పరిస్థితుల్లోనే బైజూస్ ప్రయత్నం మొదలైంది. మరి ఇప్పుడు ఆ సంస్థ పది వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందట! ఆ సంస్థ వ్యవస్థపకుడు రవీంద్రన్ ఇచ్చుకున్న స్టేట్ మెంట్ ఇది.
అందులో కనీసం ఇరవై శాతం లాభం ఉంటుందట. అంటే రెండు వేల కోట్ల రూపాయలకుపైనే లాభమట! అంతే కాదు.. తమ వ్యాపారంలో భవిష్యత్తు మరింత ఘనం అని ఆయన చెప్పుకున్నారు. అతి త్వరలో తమ బ్రాండ్ వ్యాల్యూ 30 వేల కోట్ల వరకూ చేరుకుంటుందని చెప్పుకున్నారు. ఈ మధ్య కాలంలో ఏవో విదేశాల్లోని ఎడ్యూ టెక్ యాప్స్ ను కూడా ఈ సంస్థే టేకోవర్ చేసినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి.
మరి ఆన్ లైన్ ఎడ్యూకేషన్ లో ఈ రేంజ్ ఆదాయాలున్నాయనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఈ సంస్థ చెబుతున్న లెక్క. వేరే ఎడ్యూ టెక్ కంపెనీల్లో కూడా టీచర్లకు రికార్డు స్థాయి వేతనాలు అందుతున్నాయని సమాచారం. స్థూలంగా చూస్తే రానున్న రోజుల్లో.. ఈ రంగం మరింత విస్తరించే, అనేక మందికి చేరువయ్యేలా ఉంది. స్టార్టప్స్ మీద ఆసక్తి ఉన్న వారు ఈ దిశగా ఏవైనా ప్రయత్నాలు చేయవచ్చు.
ఎంత చెట్టుకు అంత గాలి! యూట్యూబ్ తో మొదలుపెడితే, ఆన్ లైన్ టీచింగ్ కు బోలెడన్ని అవకాశాలున్నాయిప్పుడు. ఈ దశలో మొదలుపెట్టినా.. మంచి ప్రారంభమే!