దేశం ఒకవైపు కరోనా నంబర్లను లెక్క వేసుకుంటోంది. రెండో వేవ్ ముగిసిందా, మూడో వేవ్ మొదలైందా, అనే విషయాల గురించి తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. కరోనా భయాల గురించి రకరకాల విశ్లేషణలతో ప్రజల తలలు వేడెక్కిపోయాయి. మరోవైపు స్కూళ్లు తెరుచుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ ల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది! అయితే.. ఇంతలో మరోవైపు వైరల్ ఫీవర్లు ఆందోళన రేపుతున్నాయి.
ఒక్క చోట అని కాదు..దేశంలో వైరల్ ఫీవర్లకు సీజనోచ్చింది. గత ఏడాది ఈ సమయంలో కరోనా కేసులు గట్టిగా వచ్చాయి. అయితే అప్పుడు వైరల్ ఫీవర్ల జాడ లేదు. సాధారణ జలుబు, జ్వరం అంటూ కూడా అప్పుడు హాస్పిటల్ గడప ఎక్కాల్సిన అవసరం జనాలకు పడలేదు. అయితే.. ఈ ఏడాది అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది పరిస్థితి. క్షేత్ర స్థాయికి వెళ్లి చూస్తే.. వైరల్ ఫీవర్ల విజృంభణ పీక్స్ లో కనిపిస్తూ ఉంది.
దోమలకు కూడా వృద్ధికి ఇది మంచి సీజన్ కావడంతో.. మలేరియా, డెంగీ జ్వరాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. ఉత్తరాదిన అయితే తీవ్రత ఎక్కువగానే ఉందట. వెస్ట్ యూపీలో ఆరేడు జిల్లాల్లో కలిసి వారం రోజుల్లో 50 మంది మరణించారట. వీరంతా వైరల్ ఫీవర్లకు గురై మరణించినట్టుగా వైద్య నివేదికలు చెబుతున్నాయి. దారుణం ఏమిటంటే.. ఈ 50 మందిలో 26మంది చిన్నారులున్నారు. యూపీతో పాటు.. ఉత్తరాదిన వివిధ రాష్ట్రాల్లో విషజ్వరాల కేసులు అయితే ఎక్కువ స్థాయిలోనే నమోదవుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
ఇక్కడ మరో గందరగోళం ఏమిటంటే.. వైరల్ ఫీవర్ల సింప్టమ్స్ చాలా వరకూ కరోనాతో రిలేటెడ్ గానే ఉంటున్నాయి. ప్రధానంగా గొంతుకు ఇన్ఫెక్షన్, జలుబుతోనే వైరల్ ఫీవర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఒళ్లు నొప్పులు, విపరీతమైన జ్వరం.. ఇదంతా అచ్చం కరోనా రీతినే సాగుతుంది. కరోనా సోకిన వారిలో కూడా చాలా మందికి ముందుగా గొంతు నొప్పి, ఆ తర్వాత జలుబు, ఆ పై ఒళ్లు నొప్పులు, జ్వరం.. శ్వాస సమస్యలు.. ఇలా సాగాయి సింప్టమ్స్.
వైరల్ ఫీవర్ల సింప్టమ్స్ వరస కూడా ఇలానే ఉంది. అలాగే కరోనాకు గురైన వారిలో రుచి, వాసన రెండూ పోయే అవకాశాలు ఎక్కువ. అయితే వైరల్ ఫీవర్లలో వాసన కోల్పోవడం బహుశా లేకపోవచ్చు. కరోనాకూ, వైరల్ ఫీవర్ కూ బేసిక్ సింప్టమ్స్ లో కనిపిస్తున్న ఏకైక తేడా వాసన కోల్పోకపోవడం మాత్రమేలాగుంది. కరోనా, వైరల్ ఫీవర్ల సింప్టమ్స్ చాలా వరకూ ఒకేలా ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు.
అనుమానం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోవడమే ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం లాగుంది. పల్లెల్లో మలేరియా, డెంగీ కేసులు చోటు చేసుకుంటున్నాయి. అసలే కరోనాతో మూలుగుతుంటే ఇలాంటి విషజ్వరాలన్నీ ఇప్పుడు కలిసి కట్టుగా పడటంతో.. కాస్తంత జలుబు చేసినా, లేనిపోని ఆందోళనలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
గత ఏడాది కరోనా కేసులు తీవ్రంగా ఉన్నప్పుడు వేరే జ్వరాలు కానీ, మలేరియా-టైపాయిడ్ ల ఊసు కానీ, సాధారణ జ్వరంతో ఆసుపత్రులకు వెళ్లే వారు కానీ లేరు. హాస్పిటల్స్ లో సాధారణ వైద్య సేవలను దాదాపు ఆపేసినా.. పెద్దగా నష్టం లేకపోయింది. అయితే..ఇప్పుడు మాత్రం అటు కరోనా, ఇటు విషజ్వరాలతో మద్దెలలా తయారైంది పరిస్థితి.