మీడియా చేయగలిగింది.. చేస్తున్నదీ

సిఎమ్ జగన్ కు, ఓ సెక్షన్ ఆఫ్ మీడియాకు ముఖాముఖి యుద్దం ముదిరినట్లు కనిపిస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ జనాలకు ఏ మాత్రం ఆసక్తికరంగా వున్నాయి? ఏ మేరకు వినోదాన్ని పంచుతున్నాయి?…

సిఎమ్ జగన్ కు, ఓ సెక్షన్ ఆఫ్ మీడియాకు ముఖాముఖి యుద్దం ముదిరినట్లు కనిపిస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ జనాలకు ఏ మాత్రం ఆసక్తికరంగా వున్నాయి? ఏ మేరకు వినోదాన్ని పంచుతున్నాయి? ఏ మేరకు కాలక్షేపం కలిగిస్తున్నాయి? అన్న సంగతి పక్కన పెడితే, రాష్ట్రంలో మెజారిటీ మీడియా జగన్ ను గద్దె దింపేయాలనే పట్టుదలగా వున్నట్లు కనిపిస్తోంది. 

మీడియా తలుచుకుంటే ముఖ్యమంత్రిని చేయగలదా? అనే ప్రశ్న సబబే. కానీ చేసే ప్రయత్నం అయితే చేయగలదు. కానీ చంద్రబాబు వెన్నుపోటు, నాదెండ్ల వెన్నుపోటు .. ఈ రెండింటి మధ్య తేడానే మీడియా శక్తికి ఉదాహరణం. నాదెండ్ల టైమ్ లో మీడియా అంతా ఎన్టీఆర్ వైపు నిల్చుంది. చంద్రబాబు టైమ్ లో మాత్రం ఎన్టీఆర్ వైపు నిల్చోలేదు. బాబు వైపు మోహరించింది. అలా కాకుండా ఎన్టీఆర్ వైపే నిల్చుని వుంటే బాబు ఆ రోజే సిఎమ్ అయి వుండేవారు కాదు. 

ఇక మీడియా తలుచుకుంటే సిఎమ్ ను చేయడం, చేయలేకపోవడం అన్న సంగతి అలా వుంచితే తప్పులు కప్పి పుచ్చడం లేదా భూతద్దంలో చూపించడం ఈ రెండు పనులు బ్రహ్మాండంగా చేయగలదు. వైఎస్ లేదా జగన్ హయాంలో రాసిన కథనాలు చూస్తే, అవే కథనాలు బాబుగారి హయాంలో కూడా రాయొచ్చు. కానీ ఎందుకు రాయలేదు అన్నదే పాయింట్. ప్రతి ప్రభుత్వ పాలనలోనూ మంచీ వుంటుంది చెడూ వుంటుంది. 

బాబుగారి టైమ్ లో ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో మంచి మాత్రమే కనిపించింది. చెడు కనిపించలేదు. జగన్ హయాంలో అదే మీడియాలో చెడు మాత్రమే కనిపిస్తోంది. మంచి కనిపించడం లేదు. పైగా ఈసారి మీడియా మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రం మొత్తం సర్వ నాశనం అయిపోయినంత యాగీ చేస్తోంది. ఆర్థికంగా మునిగిపోయింది. 

ఎందుకు ఈ పాయింట్ తీసుకుందీ అంటే జగన్ సంక్షేమ కార్యక్రమాలు ఓ సెక్షన్ ఆఫ్ ఓటర్లను ఆయన వైపే వుండేలా చేస్తున్నాయి. వాటిని అడ్డుకోలేరు. అందుకే ఆ పథకాలు అందని వారిని రెచ్చగొట్టాలి. వాళ్లను ఇటు వైపు మళ్లించాలి. ఉద్యోగులు, మిడిల్ క్లాస్ జనాలు, టాక్స్ పేయర్స్ ను రెచ్చగొట్టి జగన్ కు దూరం చేయాలి. ఈ హిడెన్ ఎజెండా ఎవరికి తెలియంది?

జగన్ ను ఇప్పటికిప్పుడు గద్దె దింపితే అతగాడికే మంచిది. ఈ సంగతి ఈ మీడియాకూ తెలుసు. కానీ అలా అని వదిలేస్తే మరో మూడేళ్లకు పాతుకుపోతాడు. పెరగడం వీలు కాదు. ఒకవేళ మరే విధంగా అయినా జగన్ గద్దె దిగాల్సిన పరిస్థితులు వస్తే జనం ఇది కుట్ర అనీ, కావాలని చేసి వుంటారనీ అనుకోవడానికి లేకుండా ముందస్తు సన్నాహాలు జరగాలి. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే జనం 'హమ్మయ్య' అనుకోవాలి. అందుకే ఇదంతా. ఇది ఎవరికి అర్థం కాని వ్యవహారం ఎంత మాత్రం కాదు. కానీ తెలివిగా చేసే వ్యవహారం. 

ఆ దిశగానే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రాతలు సాగుతున్నాయి. అది కవర్ చేయడానికి వేరే వేరే ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా సంధించవచ్చు

నాదెండ్ల, చంద్రబాబు చేసిన దానికి ఏమిటి తేడా? ఎందుకు చంద్రబాబు వైపు నిల్చున్నారు? ఎందుకు నాదెండ్లను టార్గెట్ చేసారు?

బాబు హయాంలో అప్పులు చేయలేదా? ఒక్క అప్పు గురించి, ఒక్క వార్త అయినా రాసిన దాఖలా వుందా?

బాబుగారి పసుపు కుంకుమ స్కీము మంచిది అయినపుడు, కేసిఆర్ దళిత బంధు మంచిది అయినపుడు, జగన్ స్కీము లు మంచివి కాదా?

రేవంత్ రెడ్డి పిసిసి సీన్ లోకి ఎంటర్ అయ్యేవరకు కేసిఆర్ మీద నెగిటివ్ వార్తలు ఎందుకు కనిపించలేదు. 

బాబుగారు పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్ పెట్టి వెళ్లిన వ్యవహారాన్ని కానీ, ఖజానా ఖాళీ చేసి వెళ్లిన వ్యవహారాన్ని కానీ ఎందుకు చాటి చెప్పడం లేదు. 

బాబుగారి టైమ్ లో కొత్త రాష్ట్రం, ఆర్థిక కష్టాలు అన్న మాటలు ఎక్కువగా వినిపించాయి. మరి జగన్ టైమ్ లో అవన్నీ ఏమయ్యాయి?

ఇలాంటి ప్రశ్నలు అనేకం సంధించవచ్చు. జగన్ పై కక్ష అన్నది నిత్యం పత్రికలో, వార్తల్లో కనిపిస్తుంటే, ఇంకా బుకాయింపు, పదాల విన్యాసాలు అవసరమా? జనానికి అంతా అర్థం అవుతూనే వుంది.

ఆర్వీ