ఏపీలో దాదాపు రెండున్నరేళ్ల వైసీపీ పాలన ముగిసింది. ఇలానే చూస్తుంటే మిగతా రెండున్నరేళ్ల పాలన కూడా ముగిసిపోతుంది. మళ్లీ ఎన్నికలొస్తాయి. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, ఈసారి కూడా జగన్ దే గెలుపు అని అంతా అనుకోవచ్చు. అది వాస్తవం కూడా. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది చంద్రబాబు. ఆఖరి నిమిషంలో తిమ్మిని బమ్మిని చేయగల ఉద్దండుడు.
తను అధికారంలోకి రావడం కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం గల వ్యక్తి. సో.. ఇన్నాళ్లూ టీడీపీ చేసింది ఒకెత్తు. ఈ రెండేళ్లలో అది చేయబోయే రాజకీయ రచ్చ మరో ఎత్తు. అంటే రాబోయే రోజుల్లో జగన్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చేసిందన్నమాట.
ఒక్కసారి గత ఎన్నికల్ని విశ్లేషిద్దాం..
2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఏపీలో జగన్ కే ఎక్కువ ఎడ్జ్ ఉంది. విభజన పాపంలో టీడీపీ కూడా పాలుపంచుకోవడంతో ఏపీలో కాంగ్రెస్ తో పాటు, టీడీపీని కూడా ఓటర్లు పాతాళానికి తొక్కేస్తారని అనుకున్నారంతా.
సర్వేలతో పాటు ఒక దశలో టీడీపీ మీడియా వైసీపీ విజయాన్ని అంగీకరించింది. కానీ సరిగ్గా ఎన్నికలకు 3 వారాల ముందు పరిస్థితులు మారిపోయాయి. అలా మారిపోయేలా చేశారు చంద్రబాబు. జగన్ కు అధికారం చేయి దాకా వచ్చి చేజారిపోయింది. చంద్రబాబు ఏ రేంజ్ లో పావులు కదుపుతారు, రాష్ట్ర పరిస్థితుల్ని ఎలా తలకిందులు చేయగలరు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అది.
జగన్ లక్ష కోట్ల అక్రమ సంపాదన అనే పాయింట్ ని టీడీపీ, దాని అనుకూల మీడియా బాగా హైలెట్ చేసింది. రుణమాఫీకి చంద్రబాబు ఓకే చెప్పడం, జగన్ అది కుదరదని కుండబద్దలు కొట్టడం కూడా మరో వ్యతిరేక అంశంగా మారింది. కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత అధినేత కావాలంటూ టీడీపీ చేసిన ప్రచారాన్ని జనం నమ్మారు.
కేవలం 2 శాతం ఓట్ల తేడాతో 2014లో టీడీపీ విజయం సాధించింది. సరిగ్గా 2024లో కూడా అలాంటి పరిస్థితులే తిరిగి ఎదురైతే, మీడియాని మేనేజ్ చేస్తూ జగన్ ని మరోసారి ఇబ్బంది పెడితే ఫలితాలు ఎలా ఉంటాయి. అందుకే జగన్ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
2019 ఎన్నికల్లో తన నిర్లక్ష్యం, ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రభుత్వ పరంగా చేసిన తప్పులు-అవినీతి వల్ల బాబు ఓడిపోయారు. ఈసారి మాత్రం తన సర్వశక్తులు ఒడ్డబోతున్నారు. సామ, దాన, బేధ, దండోపాయాల్ని జగన్ పై ప్రయోగించడానికి అస్త్ర శస్త్రాలన్నీ సిద్ధం చేశారు. వీలైతే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్ అంటూ.. అక్రమ పొత్తులకు కూడా ఏమాత్రం సంకోచించరు బాబు.
అందుకే జగన్ మరింత అప్రమత్తంగా ఉండాలి. జగన్ మాత్రమే కాదు.. ప్రభుత్వంలో పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చేసింది. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉందనేది కాదనలేని వాస్తవం.