టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈసారి పెద్ద కేసులు

కొన్నాళ్ల కిందటే గప్ చుప్ అయిందనుకున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఇప్పుడు ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్) దృష్టి పెట్టడమే కాకుండా.. ఏకంగా పెద్ద…

కొన్నాళ్ల కిందటే గప్ చుప్ అయిందనుకున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఇప్పుడు ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్) దృష్టి పెట్టడమే కాకుండా.. ఏకంగా పెద్ద పెద్ద లీకులు కూడా వదులుతోంది. డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి నిధుల మళ్లింపుపై దృష్టించిన ఈడీ.. అవసరమైతే ప్రముఖుల ఆస్తుల్ని ఎటాచ్ చేస్తామంటూ లీకులు వదులుతోంది. అదే కనుక జరిగితే ఇది చాలా పెద్ద విషయం అవుతుంది.

టాలీవుడ్ లో కొంతమంది కోసం డ్రగ్స్ ను విదేశాల నుంచి తెప్పించిన మాట విషయం. ఈ విషయాన్ని 2017లోనే ఎక్సైజ్ పోలీసులు ధృవీకరించారు. మరి అలా విదేశాల నుంచి డ్రగ్స్ వస్తే, దానికి డబ్బులు ఎవరు కట్టారు? ఎవరి ఖాతా నుంచి ఎవరి ఖాతాలోకి డబ్బులు వెళ్లాయి అనే కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఒకవేళ ప్రముఖుల ఖాతాల నుంచే డబ్బు చెల్లింపులు జరిగినట్టు గుర్తిస్తే, ఫెమా చట్టాన్ని ప్రయోగించడానికి కూడా ఈడీ సిద్ధమౌతున్నట్టు కథనాలు వస్తున్నాయి.

టాలీవుడ్ లో ఓ సెలబ్రిటీకి సంబంధించిన పబ్ నుంచి డ్రగ్స్ సరఫరా జరిగినట్టు 2017లోనే గుర్తించారు. అయితే ఆ కోణంలో విచారణ చేయాల్సిన ఎక్సైజ్ పోలీసులు.. డ్రగ్స్ ను సరఫరా చేసిన వ్యక్తుల్ని మాత్రం గుర్తించి ఆ కేసును అలా సుప్తచేతనావస్తలో పడేసింది. ఇప్పుడు ఆ కేసులో మనీ లాండరింగ్ అంశాన్ని ఈడీ దర్యాప్తు చేస్తోంది. సదరు ప్రముఖుడికి చెందిన ఎకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్టు గుర్తిస్తే మాత్రం అతడికి చిక్కులు తప్పవు.

అయితే ఈ విషయంపై మాత్రం కొందరు పెదవి విరుస్తున్నారు. చేసింది తప్పు అయినప్పుడు ఏ వ్యక్తి తన సొంత ఎకౌంట్ ఉపయోగించడు. కచ్చితంగా బినామీ ఎకౌంట్ల నుంచి డబ్బులు ట్రాన్సఫర్ చేస్తుంటారు. కాబట్టి సొంత ఖాతాల్లో లావాదేవీలు పరిశీలించడం వల్ల ఈడీకి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని కొందరు
చెబుతున్నారు.

మరోవైపు సెలబ్రిటీల్ని ప్రశ్నించడం కోసం ప్రశ్నావళి సిద్ధం చేసే పనిలో ఈడీ అధికారులు తలమునకలై ఉన్నారు. మంగళవారం నుంచి 12 మంది సినీప్రముఖుల్ని డ్రగ్స్ కేసుకు సంబంధించి వివిధ అంశాలపై ఈడీ ప్రశ్నించనుంది. వీళ్లలో పూరి జగన్నాధ్, చార్మి, రానా, రకుల్, రవితేజ లాంటి ప్రముఖులు ఉన్నారు.