భారీవుడ్‌గా టాలీవుడ్‌

టాలీవుడ్‌ అంటే అంతా పద్ధతిగా బడ్జెట్‌ పైసా పైసా చూసుకుంటూ, ప్రీ ప్రొడక్షన్‌ దగ్గర నుంచి విడుదల వరకు పక్కాగా ప్లాన్‌ చేసుకుంటూ సినిమాలు తీయడం. అయితే ఇదంతా గతం. తెలుగు సినిమాకు చెన్నయ్‌లో…

టాలీవుడ్‌ అంటే అంతా పద్ధతిగా బడ్జెట్‌ పైసా పైసా చూసుకుంటూ, ప్రీ ప్రొడక్షన్‌ దగ్గర నుంచి విడుదల వరకు పక్కాగా ప్లాన్‌ చేసుకుంటూ సినిమాలు తీయడం. అయితే ఇదంతా గతం. తెలుగు సినిమాకు చెన్నయ్‌లో పునాదులు వేసిన పెద్దలు పాటించిన పద్దతి. కానీ రాను రాను అంతా మారిపోయింది. ఇప్పుడు అంతా అయోమయం. లెక్కలంటే లెక్కే లేదు. సినిమా తీసామా? లేదా? అన్నదే ఇప్పుడు అంతా. లాభం అన్నది చెప్పలేని సంగతి. నూట యాభై కోట్లు ఖర్చుచేసి, ఆ మేరకు మార్కెట్‌ చేసి, బ్లాక్‌ బస్టర్‌ అనిపించుకున్నా కూడా నిర్మాతలకు నష్టాలే మిగులుస్తున్నాయి సినిమాలు. హీరోల గుడ్‌లుక్స్‌ కోసం పైకి చెప్పలేక, లోపల వుంచుకోలేక నిర్మాతలు సతమతమవుతున్నారు.

ఇదంతా ఓ సంగతి..
ఇక ఇంకో ముచ్చట కూడా వుంది. టాలీవుడ్‌ అంటే కోటి రూపాయిలతో అయినా సినిమా తీయచ్చు. కోట్లు చేసుకోవచ్చు. ఇక్కడ కోటి రూపాయలతో సినిమా తీసి పక్కనపెట్టి, హిట్‌ కొట్టగల సత్తా వున్నవాళ్లు వున్నారు. సినిమా కోటి రూపాయలదా? కోట్ల రూపాయలదా? అన్నది చూడకుండా, మంచి సినిమానా? బాగుందా? లేదా? అన్నదే చూసుకుంటూ సినిమాను హిట్‌ చేసే ప్రేక్షకులు వున్నారు. ఇలాంటి ఫీట్‌ అన్ని భాషల్లో సాధ్యంకాదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో. ఇదే టాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త ముచ్చట.. పాన్‌ ఇండియా ఫిల్మ్‌. బాహుబలి ఇచ్చిన భరోసా. సాహో చూపుతున్న దారి. సైరా చెబుతున్న సత్యం. ఆర్‌ఆర్‌ఆర్‌ అందించబోయే భవిష్యత్‌.

బాహుబలి సినిమా విడుదలై ప్రపంచ మార్కెట్‌పై తెలుగు పతాకాన్ని ఎగురవేసే వరకు మన సినిమా స్టామినా మనకు తెలియలేదు. బాహుబలి వన్‌ సినిమా కూడా అద్భుతమైన మార్కెట్‌ ఏమీ చేయలేదు.  రెండోభాగం వెనకాల వుండగా, డెఫిసిట్‌ తోనే విడుదల చేసారు. అయితే అది విడుదల అయిన తరువాత తెలిసింది దాని స్టామినా. అప్పుడు మొత్తం సినేరియా మారిపోయింది బాహుబలి రెండోభాగం అమ్మకాల రేట్లు విని ట్రేడ్‌వర్గాలు కళ్లు తేలేసాయి. కానీ మళ్లీ అదే వర్గాలు, ఆ సినిమా కలెక్షన్లు చూసి మరోసారి కళ్లు తేలేసాయి.

ఆ విధంగా తెలుగు సినిమా మేకింగ్‌ను కొత్త పుంతలు తొక్కించడం ప్రారంభమైంది. సాధారణంగా తెలుగు సినిమా మార్కెట్‌, తెలుగు రాష్ట్రాల్లో ఒక లెక్క మీద వుండదు. మీడియం హీరోలు అయితే పది నుంచి పదిహేను కోట్లు. మీడియం హీరోల్లో టాప్‌ హీరోలు అయితే ఇరవై కోట్లు. టాప్‌ హీరోలు అయితే ఇరవై నుంచి తొంభై కోట్లు. ఇదీ తెలుగు రాష్ట్రాల మార్కెట్‌. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ ఫైవ్‌ హీరోల మార్కెట్‌ డెభై, నుంచి తొంభై మధ్యలోనే వుంది.

ఇలాంటి నేపథ్యంలో బాహుబలి ప్రభాస్‌ సాహో సినిమా మార్కెట్‌ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 130 నుంచి 140 కోట్ల వరకు వుండే అవకాశం కనిపిస్తోంది. ఒక్క ఆంధ్రలోనే 65 కోట్ల మేరకు మార్కెట్‌ చేస్తున్నారు. అంటే దాదాపు 160 కోట్ల వసూళ్లు రావాలి. బాహుబలి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 కోట్లకు కాస్త పైగానే వసూలు చేసింది. అదే ధీమా సాహొ టీమ్‌ది కూడా. సాహో వెనుకగా వస్తోంది మెగాస్టార్‌ సైరా. ఈ సినిమా కూడా దాదాపు తెలుగునాట 150 కోట్లకు పైగా మార్కెట్‌ చేసేదిశగా లెక్కలు సాగుతున్నాయి. వీటి వెనుకగా రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ వస్తోంది.

సాహో..సైరా కలిస్తే ఆర్‌ఆర్‌ఆర్‌ అనుకోవాలి. కానీ అయినా కూడా తెలుగునాట మహా అయితే 200 కోట్ల వరకు మార్కెట్‌ చేయగలరు తప్ప, అంతకన్నా కాదు. మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్‌లో, తెలుగు రాష్ట్రాల మార్కెట్‌ అంటే… టాప్‌ హీరోలు అయితే దగ్గర దగ్గర వంద కోట్లు, భారీ సినిమా అయితే 150 నుంచి 160 కోట్లు ఇదీ స్థిరపడిన మార్కెట్‌. అయితే ఇదే సమయంలో తెలుగు సినిమాకు మరో భరోసా వచ్చింది. సరైన కాంబినేషన్‌, సరైన సబ్జెక్ట్‌ దొరికితే ఇండియా వైజ్‌గా మరో యాభై నుంచి ఎనభైకోట్లు తెచ్చుకోవచ్చు అన్నది. ఇదికాక ఓవర్‌సీస్‌ మార్కెట్‌. నాన్‌ థియేటర్‌ ఆదాయం వేరే.

ఇలా తెలుగు రాష్ట్రాలు, ఇండియా వైజ్‌, ఓవర్‌ సీస్‌, నాన్‌ థియేటర్‌ అన్నీకలిసి ఓ భారీ కాంబినేషన్‌ సినిమాను. మూడు నుంచి నాలుగు వందల మధ్య మార్కెట్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. మన డైరక్టర్లు, మన హీరోలు ఆ మేరకు స్టామినా సాధించారు. ఎటొచ్చీ పాన్‌ ఇండియా సినిమా అని అనిపించుకోవడం కోసం ఆయా భాషల నటులకు కూడా కాస్త చోటు కల్పించాల్సి వుంటుంది.

టాలీవుడ్‌ చేస్తున్న ఈ ప్రయోగం, బాలీవుడ్‌ మినహా మిగిలిన భాషల సినిమా రంగాలు అంతలా అందుకోలేదు. రజనీకాంత్‌తో మాత్రమే వందల కోట్ల పాన్‌ ఇండియా సినిమా అటెంప్ట్‌ చేసారు. విజయ్‌, అజిత్‌ లాంటి వాళ్ల సినిమాలు లోకల్‌ మార్కెట్‌నే ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్నాయి. రాను రాను టాలీవుడ్‌లో భారీ సినిమాల ప్రయోగాలు ఎక్కువవుతాయనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

హిరణ్య కశ్యప అంటూ రానా ఓ సినిమా తీయబోతున్నాడు. దానికి వందల కోట్ల బడ్జెట్‌. అలాగే రాజమౌళి-మహేష్‌బాబు సినిమా ఒకటి వుండనే వుంది. సాహో తరువాత ప్రభాస్‌-రాధాకృష్ణ సినిమా బడ్జెట్‌ కూడా దాదాపు 200 కోట్లు. సాహో, సైరా సినిమాల ఫలితాలు తెలిసిన తరువాత ఇలాంటి సినిమాల నిర్మాణం మరింత ఎక్కువ అవుతుంది. అందులో సందేహం లేదు.

అయితే ఇక్కడ ముచ్చటించుకోవాల్సిన విషయం ఇంకోటి వుంది. ఇంత భారీ సినిమాలు మనవాళ్లు అటెంప్ట్‌ చేస్తున్నారు. కానీ ఆ ఖర్చు అంతా ఎక్కువగా విదేశాలకు, విదేశీ నిపుణులకు, సాంకేతిక సంస్థలకు పోతోంది. ఇక్కడ మనకు ఆ స్థాయి సాంకేతిక సహకారం అందింతే, ఆ ఖర్చు అంతా ఇక్కడే వుంటుంది. భారీ సినిమాలకు సరిపడా టెక్నాలజీ, నిపుణత ఇక్కడే లభ్యం అయితే నిర్మాణ వ్యయం తగ్గుతుంది లేదా మరింత భారీతనం సినిమాల్లోకి వస్తుంది.

మొత్తంమీద సాహో.. సైరా సినిమాలు టాలీవుడ్‌ భారీవుడ్‌గా మారుతుందా? లేదా? అన్నది డిసైడ్‌ చేయబోతున్నాయి.
-ఆర్వీ

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?