శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ పరిధిలో ఉన్న విద్యుత్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం అనుచితమైన రీతిలో వ్యవహరించడాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆఖరికి ఈ విషయంలో కేంద్ర సంస్థలు జోక్యం చేసుకుని.. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి విడుదలను కొనసాగించడాన్ని ఆపాలంటూ లేఖలు రాసినా తెలంగాణ స్పందించడం లేదు. తన తీరును మార్చుకోవడమూ లేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు అనే కొండను తెలంగాణ సర్కారు తన నెత్తిన పెట్టుకుంది. ఎంత కరెంటు ఉత్పత్తి చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతలకే అది సరిపోదు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే కాళేశ్వరం కరెంటు ఖర్చు భారీగా ఉంటుందని అనేక మంది మేధావులు కూడా వివరించి చెబుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టు కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎడాపెడా నీళ్లను విడుదల చేయడానికి తెలంగాణ తెగించింది.
రాష్ట్రాల మధ్యన నీటి యుద్ధాలు జరుగుతాయంటే ఇలాంటి చేష్టల వల్ల కాదా! కనీస నీటి మట్టాన్ని ఉంచాలన్న స్పృహ కూడా లేకుండా తెలంగాణ వ్యవహరిస్తోంది. ఎన్నో నీతులు చెప్పే కేసీఆర్ తమ రాష్ట్రం ఇలా అసంబద్ధంగా వ్యవహరించినా పట్టించుకోరు. పట్టించుకునేంత పరిస్థితి లేదు. ఇక పక్క రాష్ట్రం యుద్ధం ప్రకటించాలా!
నాలుగేళ్లుగా పుష్కలమైన వర్షాలు కురిసి, శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో నీటి లభ్యత ఉంది కాబట్టి సరిపోయింది. ఈ సారి అరకొర వర్షాలతో ప్రాజెక్టులో నీటి లభ్యతే తక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో కూడా తెలంగాణ సర్కారు తీరు మారడం లేదు!