సినిమాలకు ఖర్చు అన్నది నిర్మాతల కంట్రోల్‌లో లేని పరిస్థితి టాలీవుడ్‌లో నెలకొని వుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో సినిమా అంటే మామూలుగా వుండదని ఇప్పటికే ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతల అనుభవం.
ఇప్పుడు లేటెస్ట్ సినిమా గాండీవధారి అర్జున కూడా 55 కోట్ల మేరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ మీద ఇంత ఖర్చు చేయడం అంటే కాస్త రిస్క్ నే. కానీ తప్పదు కదా.. ప్రాజెక్టులోకి ఒకసారి దిగిన తరువాత ముందుకు వెళ్లడం తప్ప మరో చాన్స్ వుండదు.
సినిమా కథ కూడా అలాంటిదే. ఖర్చు డిమాండ్ చేసేదే కావడం, విదేశాల్లో ఎక్కువ భాగం షూట్ చేయాల్సి రావడంతో ఖర్చు తప్పలేదు. కానీ సమస్య అది కాదు. ఇప్పుడు అంత అమౌంట్ ను ఎలా రికవరీ చేసుకుంటారు అన్నదే. సినిమాకు నాన్ థియేటర్ 26 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఇంకో ముఫై కోట్ల వరకు రావాల్సి వుంటుంది థియేటర్ మార్కెట్ నుంచి.
సినిమా బాగుంటే కూడా ముఫై కోట్ల వరకు చేయడం అన్నది చాలా కష్టమే అవుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సి వుంటుంది ముఫై కోట్లు థియేటర్ మీద నుంచి రావాలంటే. ఇప్పటి వరకు దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఫేర్ చేయలేదు. ఈ సినిమా ఎలా వుంటుందో చూడాలి.