తెలుగుదేశం పార్టీలో రాబోయే కాలానికి కాబోయే సీఎం తానేనని చినబాబు లోకేష్ అనుకుంటున్నారు. ఆయన్ని అలాగే ఫోకస్ చేస్తున్నారు. ఆయన సైతం పెద్దల సభలో వీరంగం వేస్తూ తనదైన పోరాటాన్ని గట్టిగా చాటుకుంటున్నారు.
అది చూసి పెదబాబు తెగమురిసిపోతున్నారు. మరి అటువంటి చినబాబుని అదుపులో పెట్టుకోమని ఒకనాటి చంద్రబాబు సహచరుడు, టీడీపీలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన దాడి వీరభద్రరావు లాంటి పెద్దలు సుద్దులు చెబితే పచ్చ పార్టీ అధినాయకుడు ఆలోచిస్తారా.
పైగా తమ్ముళ్ళు పెద్దల సభలో వీరుల్లా పోరాడారు, ఇదే తీరు కొనసాగించండి అంటూ ఓ వైపు చంద్రబాబు తన కుమారుడితో సహా ఎమ్మెల్సీలందరికీ కితాబులు ఇస్తూంటే దాడి హిత వచనాలు రుచిస్తాయా.
ఇంతకీ దాడి ఏమన్నారంటే పెద్దల సభకు విలువ, మర్యాదా ఉండనీయడి బాబులూ అని మాత్రమే. అక్కడ వేయాల్సింది వీరంగం కాదు, జరగాల్సింది చర్చలు అని కూడా చెప్పుకొచ్చారు. పైగా అక్కడ యుధ్ధ సన్నివేశాల మాదిరిగా భయానక పరిస్థితులు స్రుష్టించి అదేదో తమ గొప్పతనం అని టీడీపీ పెద్దలు సంబరపడితే పోయేది శాసనమండలి ప్రతిష్టేనని కూడా దాడి అంటున్నారు.
ఇక లోకేష్ దూకుడు ఇదే తీరున కొనసాగిస్తే టీడీపీ చాప చుట్టేసుకోవచ్చునని కూడా దాడి జరగబోయేది కూడా చెప్పేశారు. ఆయనొక్కడు చాలు టీడీపీకి పెద్ద దెబ్బ వేయడానికి అని దాడి ఎకసెక్కమాడేశారు. ఇక ఇలాంటి పనితనమే కావాలంటే మాత్రం చేసేదెవరూ లేరని, చినబాబును అలాగే ముందుకు పోవాలని బాబు దీవించడం తప్ప అని కూడా దాడి సెటైర్లు వేశారు.
మొత్తానికి లోకేష్ ఎంతో బాగా పనిచేస్తున్నాడని బాబు ఫీల్ అవుతూంటే మాజీ మంత్రి పుల్లవిరుపు మాటలు తమ్ముళ్లతో సహా పచ్చ పార్టీని ఫుల్ గా ఇబ్బంది పెట్టవూ.