కరోనా వ్యాప్తి విషయంలో భయపడుతున్నట్టే జరుగుతోంది. కేవలం ఒకే ఒక్క వ్యక్తి ద్వారా 222 మందికి కరోనా సోకింది. భయాందోళన కలిగించే ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండంలో చోటు చేసుకుంది. ఈ విషయం తూర్పుగోదావరి జిల్లాను వణికిస్తోంది.
పెదపూడి మండంలోని గొల్లల మామిడాడలో గత నెల (మే) 21న కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ ఒక్క కేసు ఆ జిల్లా కొంప ముంచుతోంది. కేవలం ఈ ఒక్క కేసుతో 222 మందికి కరోనా బారిన పడ్డారు.
ఒక్క మామిడాడ గ్రామంలోనే 119 పాజిటివ్ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం పెదపూడి మండలంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 125కి పెరిగింది.
మామిడాడలో గుర్తించిన కేసు ద్వారానే రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో 57 మంది కరోనా వైరస్ బారిన పడినట్టు వైద్యాధికారులు తేల్చి చెప్పారు. మున్ముందు ఈ సంఖ్య ఎంతకు పెరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇంకా బయటపడని కేసులెన్నో అనే భయం చుట్టుపక్కల గ్రామాలను వెంటాడుతోంది. ప్రజలు తమకు తాముగా ఫిజికల్ డిస్టెన్స్, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కరోనాను అరికట్టడం ఇప్పట్లో సాధ్యం కాదు.