టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోజురోజుకూ తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటున్నారు. అవసరం ఉన్నా, లేకున్నా ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తేందుకు వెనుకాడడం లేదు. పైపెచ్చు ప్రధాని మోడీ గొప్ప ప్రజాస్వామిక వాది అని చాటేందుకు బాబు తహతహలాడుతున్నారు. బాబులో ఈ ధోరణిని చూసేవాళ్లకు ఎబ్బెట్టుగా ఉంటోంది. ఎందుకంటే ఇదే చంద్రబాబు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకనే నినాదంతో బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో కూడా జత కట్టడాన్ని చూశాం.
ఇక ప్రస్తుతానికి వస్తే బాబు ఎంత దిగజారారో, మోడీ అంటే ఎంతగా భయపడుతున్నారో చెప్పేందుకు గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ప్రధానిని మెచ్చుకోవడమే నిదర్శనం. ముఖ్యమంత్రి జగన్ అరాచకానికి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు బలైపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి జగన్ సర్కార్‌పై ఫిర్యాదు చేశారు. 14 పేజీల లేఖను అందజేశారు.
ఈ లేఖలో పేర్కొన్న ఓ ముఖ్యమైన అంశాన్ని పరిశీలిద్దాం.
‘ప్రధాని మోడీకి ప్రజలు ఓట్లు వేశారు. అలాగని అంతా తన ఇష్ట ప్రకారమే చేస్తున్నారా? రాజ్యసభకు కీలకమైన బిల్లులు వస్తే అందరికీ ఫోన్లు చేసి మద్దతు కోరి ఆమోదింపజేసుకుంటున్నారు’
ఈ సందర్భంగా చంద్రబాబుకో సూటి ప్రశ్న. మరి గత ఏడాది ఇదే జూన్ నెల 20వ తేదీన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేసుకున్న మాటేమిటి? టీడీపీ రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరీ, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావ్‌లకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకోవడం కూడా మోడీ గొప్పతనమేనా? ఇదేనా మాట్లాడుకుని చేర్చుకోవడం అంటే? తమరితో జేపీ నడ్డా మాట్లాడుకుని బీజేపీలో టీడీపీ రాజ్యసభ సభ్యులను విలీనం చేసుకున్నారా?
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం.. మరోవైపు కేసుల భయం వెంటాడుతుండటం వల్ల మోడీని భుజాన మోయాలని తహతహలాడుతున్నారా? రాజ్యసభలో తమకు తగినంత బలం లేదనే ఉద్దేశంతోనే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేసుకుందని జగమెరిగిన సత్యం. కానీ మండలిలో బలం లేదని జగన్ అలా చేయలేదే? ఒకవేళ అలా చేసి ఉంటే మండలిలో వైసీపీ సర్కార్ ఎందుకు ఇబ్బంది పడుతుంది?
నలుగురు రాజ్యసభ సభ్యులను విలీనం చేసుకున్న మోడీ సర్కార్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే దమ్ముందా? కనీసం వారిపై అనర్హత వేటు వేయాలని ఏనాడైనా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ ఇచ్చారా? ఒకవైపు తమ నలుగురు రాజ్యసభ సభ్యులను విలీనం చేసుకున్న బీజేపీ సర్కార్‌పై ప్రశంసలు కురిపిస్తుండటం దేనికి సంకేతం? ఇంత దిగజారుడు రాజకీయాలా? ఈ దేబరింపుల కంటే బీజేపీలో టీడీపీ విలీనం చేస్తే ఓ పనై పోతుంది కదా? ఆ దిశగా ఆలోచిస్తే…ఈ సమస్యలు ఉండవు కదా? బహుశా రానున్న రోజుల్లో అదే జరుగుతుందనే వాదన కూడా లేకపోలేదు.