ఏపీలో లేని భయం తెలంగాణలో ఎందుకు..?

రెండు తెలుగు రాష్ట్రాలను పోల్చి చూస్తే.. ఏపీలో కంటే తెలంగాణలోనే కరోనా విలయతాండవం ఎక్కువగా కనిపిస్తోంది. అత్యాధునిక వసతులతో కూడిన వైద్యం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నా.. కరోనా విషయానికొచ్చేసరికి.. ఏపీ కంటే…

రెండు తెలుగు రాష్ట్రాలను పోల్చి చూస్తే.. ఏపీలో కంటే తెలంగాణలోనే కరోనా విలయతాండవం ఎక్కువగా కనిపిస్తోంది. అత్యాధునిక వసతులతో కూడిన వైద్యం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నా.. కరోనా విషయానికొచ్చేసరికి.. ఏపీ కంటే తెలంగాణ ప్రమాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారితో సామాన్యులు వణికిపోతున్నారు. తెలంగాణలో ఏకంగా ముగ్గురు ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

మొదట్నుంచీ కరోనా విషయంలో తెలంగాణ సర్కారు ధోరణి విమర్శలకు తావిస్తోంది. కరోనా టెస్టుల్లో నిర్లక్ష్యం, వైద్య సదుపాయాల్లో అలసత్వం, వలస వచ్చినవారిని గుర్తించడంలో సరైన ప్రణాళిక లేకపోవడంతో తెలంగాణలో కరోనా చాపకింద నీరులా పాకుతోంది. తక్కువ సంఖ్యలో టెస్టులు చేసినా ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు 6వేల మార్కు దాటాయి. ఏపీలో 7496కి చేరుకున్నాయి. ఏపీలో ఎక్కువ టెస్ట్ లు జరుగుతున్నాయి కాబట్టి కేసుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే కనపడుతోంది.

అదే సమయంలో మరణాల సంఖ్య మాత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని బోనులో నిలబెడుతోంది. ఏపీలో కరోనాతో చనిపోయినవారు 92మంది. తెలంగాణ విషయానికొస్తే ఆ సంఖ్య 195. హైదరాబాద్ లో అన్ని వసతులున్న ఆస్పత్రులున్నా కూడా కేవలం గాంధీని మాత్రమే నమ్ముకుని ఇన్నాళ్లూ కరోనా రోగుల్ని అక్కడే వదిలేశారు. అక్కడి వసతులపై ఏనాడు ఆరా తీసిన దాఖలాలు లేవు.

వీఐపీలను మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించే ప్రభుత్వం, సామాన్యులను గాంధీ ఆస్పత్రిలో ఎందుకు వదిలేస్తోందనే విషయంపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. గతంలో ప్రైవేట్ ఆస్పత్రులకు కరోనా వైద్యం చేసే స్థాయి లేదని చెప్పిన ఆరోగ్య మంత్రి ఈటల.. కేసుల సంఖ్య పెరగడంతో.. హడావిడిగా వాటికి అనుమతులెందుకిచ్చేశారని ప్రశ్నిస్తున్నారు.

అదే సమయంలో ఏపీలో కరోనా వైద్యం పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంది. పాజిటివ్ గా తేలిన ప్రతి ఒక్కరినీ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్నారు. క్వారంటైన్ సెంటర్లతో సహా.. అన్నిట్లో మెరుగైన వసతి, భోజన సదుపాయం ఉండటంతో ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత లేదు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారు తమంతట తామే కొవిడ్ టెస్ట్ లకు వస్తున్నారంటే.. కరోనా భయం ఏపీలో ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కరోనా విజృంభణలో దోషి ప్రభుత్వమేనని నిందిస్తున్నాయి ప్రతిపక్షాలు. సామాన్య జనం కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్వయంగా తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తంచేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మరణాల సంఖ్య ప్రామాణికంగా తీసుకుంటే.. ఏపీలో కరోనా పూర్తిగా కట్టడిలో ఉన్నట్టే లెక్క. అదే సమయంలో తెలంగాణ సర్కారు నిర్లక్ష్యానికి ప్రజలు బలైపోతున్నారు. 

ఎన్టీఆర్ ఆత్మ యనమలని క్షమించదు

నేను జిప్ తీసినట్టు నిరూపించండి