హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు మళ్లీ ఎంపీ టికెట్ కష్టంగా మారిందని టాక్. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల మార్పులో భాగంగా గోరంట్ల మాధవ్ కు హిందూపురం ఎంపీ టికెట్ దక్కే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మాధవ్ కు కూడా ఈ స్పష్టత వచ్చిందని, అందుకే ఆయన పార్టీ వ్యవహారాలతో కూడా అంటీముట్టనట్టుగా ఉన్నాడనే మాట వినిపిస్తూ ఉంది.
వచ్చే ఎన్నికల్లో చాలా మంది సిట్టింగులకు నిరాశ తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనే అభిప్రాయాలు చాన్నాళ్ల నుంచినే వినిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు తేడా లేకుండా చాలా మంది సిట్టింగులకు టికెట్ లు దక్కవనే టాక్ ఉంది. ఈ జాబితాలో గోరంట్ల మాదవ్ పేరు కూడా ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతూ ఉంది.
గత ఎన్నికల ముందు పోలీస్ వృత్తికి రాజీనామా చేసి ఎంపీగా నెగ్గారు మాధవ్. కురుబ సామాజికవర్గానికి చెందిన మాధవ్ స్థానికేతరుడు అయినా హిందూపురం నుంచి మంచి మెజారిటీతో నెగ్గారు. సంచలన విజయం సాధించిన మాధవ్.. రాజకీయంగా నిలదొక్కుకోవడంలో కష్టాలనే పడుతున్నట్టుగా ఉన్నారు.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మంది సిట్టింగులను మార్చే ఆలోచనతో ఉంది. అదే సామాజికవర్గాలకు చెందిన వేరే నేతలను రంగంలోకి దించేలా ఉంది ఆ పార్టీ. ఈ నేపథ్యంలో హిందూపురం ఎంపీ సీటు విషయంలో కూడా సిట్టింగును మార్చనుందనే ప్రచారం జరుగుతోంది. మాధవ్ గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించడం లేదు. నామమాత్రంగానే ఆయన పార్టీ కార్యకలాపాల్లో కనిపిస్తూ ఉన్నారు. దీంతో మాధవ్ కు కూడా స్పష్టత వచ్చిందనే ప్రచారానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది.
మరి మాధవ్ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ప్రస్తుతానికి క్లారిటీ లేని అంశమే. పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణను హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కురుబ సామాజికవర్గానికే చెందిన శంకర్ నారాయణ పెనుకొండలో నెగ్గుకు వచ్చారు, మరి హిందూపురం నుంచి ఎంపీగా ఆయన ప్రభావం ఎలా ఉంటుందో!