మతం వ్యక్తిగతంగా ఉన్నంతసేపు దేవుడితో నేరుగా సంభాషించే వీలుంటుంది – భక్త కన్నప్పలా! కానీ వ్యవస్థీకృతం అయిన దగ్గర్నుంచి దళారులుగా పూజారులు అవతరిస్తారు. అసింటా అసింటా అంటారు, ఆచారాలంటారు, అవి ఉల్లంఘించి దేవుడికి కోపం తెప్పిస్తున్నావని భయపెడతారు. పిలక పొడుగు గురించి, తెల్ల గౌను వదులు గురించి, టోపీ పెట్టుకునే కోణం గురించి ఆచారాలు పెంచిన కొద్దీ అనాచారులు పెరుగుతారు. భక్తి పేర నియంతృత్వం సాగించే పీఠాధిపతులు, మతగురువులు తమ తప్పులను ఎత్తి చూపే ధిక్కారాన్ని సహించలేరు.
సిస్టర్ లూసీ కాలాపురా అనే ఆవిడకి 'ఫ్రాన్సిస్కన్ క్లారిటస్ట్ కాంగ్రెగేషన్ (ఎఫ్‌సిసి) అనే కేరళ చర్చి 'నీ పద్దతి మార్చుకో, తప్పులు దిద్దుకో, లేకపోతే చర్చి నుండి బహిష్కరిస్తాం' అని ఈ జనవరిలో హెచ్చరించింది. చర్చి కళ్లకు ఆమెలో అవిధేయత, విలాసాల పట్ల లాలస కనబడ్డాయి. వాళ్లిచ్చిన ఉదాహరణలేమిటంటే – మూడు సంవత్సరాల క్రితం వేరే చోటకి బదిలీ చేసినా వెళ్లలేదు. పద్యాలు రాసి వాటిని పుస్తకంగా వేసింది. పుస్తకం వేయడానికి వీల్లేదని తన పై అధికారులు చెప్పినా వినలేదు. కారు డ్రైవింగ్ నేర్చుకుంది, లైసెన్సు తీసుకుంది, ఆ పై 4 లక్షలు పెట్టి కారు కూడా కొంది. తక్కిన క్రైస్తవ సన్యాసినులు (నన్‌లు) తమ నెల జీతాన్ని చర్చికే అప్పగించేస్తూ ఉండగా, ఈమె మాత్రం 2017 డిసెంబరు నుండి అలా చేయకుండా డబ్బు దాచుకుని కారు కొనుక్కుంది. క్రైస్తవేతర పత్రికలైన మంగళం, మాధ్యమం వగైరా మలయాళ పత్రికలకు వ్యాసాలు రాసింది. సమయం అనే టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ యిచ్చింది. ఫేస్‌బుక్‌లో, టీవీ ఛానెల్స్‌లో చర్చలలో పాల్గొంటోంది.
ఇవన్నీ పెద్ద నేరాలా అని ఆశ్చర్యపోకండి. అసలు కారణం వేరే ఉంది. బిషప్ ఫ్రాంకో ములక్కల్ అనే అతను అనే ఒక నన్‌ను బలాత్కారం చేసిన కేసు ఎదుర్కుంటున్నాడు. కానీ చర్చి ఆ కేసును ముందుకు నడవనీయటం లేదు. దాన్ని నిరసిస్తూ 'మిషనరీస్ ఆఫ్ జీసస్' సంస్థకు చెందిన ఐదుగురు నన్స్ ఎస్‌ఓఎస్ (సేవ్ అవర్ సిస్టర్స్) పేర సంఘటితమై 2018 సెప్టెంబరు 20న ఎర్నాకులమ్‌లో ఓ ప్రదర్శన నిర్వహించారు. ఈ లూసీ ఆ ప్రదర్శనలో పాల్గొంది. అది ఘోరాపరాధంగా తోచి చర్చి ఆమె పని చేస్తున్న వాయనాడ్ చర్చిలో యీమె విధులు నిర్వర్తించడానికి, బైబిల్ నేర్పడానికి, ప్రార్థనలు చేయించడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది. ఆ వేధింపుల గురించి ఈమె టీవీల్లో చర్చించడమే చర్చికి కన్నెర్ర అయింది. లూసీతో బాటు ఎస్‌ఓఎస్ కన్వీనరు ఐన ఫాదర్ అగస్టిన్ వట్టోలీకి కూడా నోటీసు అందింది. నవంబరు నుంచి ఆయన్ని కూడా విధుల నుంచి తప్పించారు.
బిషప్ ఫ్రాంకో 2014-16 మధ్య తనను 13 సార్లు రేప్ చేశాడని ఒక నన్ ఆరోపించడంతో 2018 సెప్టెంబరులో ఫ్రాంకోను అరెస్టు చేశారు. నన్ తాలూకు బంధువులు తనను బ్లాక్‌మెయిల్ చేశారంటూ ఫ్రాంకో ఎదురు కేసు పెట్టాడు. ఇది అబద్ధమని, తను కేసు విత్‌డ్రా చేసుకుంటే పది ఎకరాల భూమి యిస్తానని ఫ్రాంకో రాయబారుల ద్వారా కబురంపాడని నన్ అంటుంది. నన్ ఆరోపణను బలపరిచి, ఫ్రాంకోకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఫాదర్ కురియాకోస్ కట్టూతర జలంధర్‌లోని ఒక చర్చిలో తన రూములో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. మృతుడి కుటుంబసభ్యులు, ఆయనతో పాటు పని చేసే యితర పూజారులు ఆయన చావులో కుట్ర ఉందని ఆరోపించగా, ఫ్రాంకో ప్రతినిథి అయిన ఫాదర్ పీటర్ 'అది సహజమరణమే' అని కొట్టేశాడు.
కేరళలో చర్చికి ధనబలంతో బాటు, పలుకుబడి, రాజకీయ నాయకులపై పట్టు కూడా ఉన్నాయి. వాళ్లు ఫ్రాంకోని రక్షించడానికి నిశ్చయించుకున్నారు. అరెస్టయిన నెలన్నర లోపే ఫ్రాంకో కేరళ హైకోర్టు షరతులతో యిచ్చిన బెయిలుపై బయటకు వచ్చాడు. బయటకు రాగానే అనేకమంది అనుయాయులతో అతనికి బ్రహ్మాండంగా స్వాగతం పలికిన చర్చి మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనకూడదని 'తాత్కాలిక' ఆదేశం ఒకటి యిచ్చింది! ఆ తర్వాత అతనికి ఎదురు నిలిచినవాళ్లని భయపెట్టే కార్యక్రమం చేపట్టింది. ప్రదర్శనలిచ్చిన ఐదుగురిలో ఆల్ఫీ, అనుపమ, జోసెఫైన్, అంకిత అనే నలుగురు సిస్టర్స్‌ను వాళ్లు పని చేస్తున్న కురవిళంగాడ్ కాన్వెంట్ నుంచి జనవరిలో తలో మూలకీ బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఆ విధంగా వారి సంఘటిత శక్తిని బలహీనపరచాలని చూశారు. ఐదో నన్ అయిన నైనా రోజ్‌ను మాత్రం అక్కడే ఉంచారు. బదిలీ అయిన నన్స్ నలుగురూ ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తూ బిషప్ ఫ్రాంకో కు వ్యతిరేకంగా ఉన్న కేసును నీరుగార్చాలని చర్చి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బాధితురాలు కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఇది యిలా జరుగుతూండగానే ఫ్రాంకో బెయిలును కోర్టులు కొనసాగించాయి.
ఫ్రాంకో వంటి మతగురువుల బాధితులు చాలామంది ఉన్నారు కానీ బయటకు వచ్చి చెప్పడానికి లూసీలా ధైర్యం చేసేవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఎందుకంటే నోరెత్తగానే చర్చి వాళ్లను ఆర్థికంగా యిబ్బంది పెడడం మొదలుపెడుతుంది. దానితో ఆగకుండా వాళ్ల శీలం మంచిది కాదని నింద వేయడానికి కూడా వెనుకాడదు. ఇప్పుడు సిస్టర్ లూసీపై పగబట్టింది. తాము అడిగిన ప్రశ్నలకు తృప్తికరమైన సమాధానాలు యివ్వలేక పోయిందంటూ 2019 మే 11న ఆమెను ఎఫ్‌సిసి చర్చి నుంచి బహిష్కరిస్తూ నోటీసు యిచ్చింది. ఈ విషయాన్ని చర్చించిన జనరల్ కౌన్సిల్‌లో ఒక్కరు కూడా లూసీకి అనుకూలంగా మాట్లాడలేదు. చివరకు ఆగస్టు 5న డిస్మిసల్ ఆర్డరు పంపింది. లూసీ ''నా తప్పేమీ లేదు, నన్ను బయటకు పంపించి వేస్తే వెళ్లిపోయి కోర్టులోనే పోరాడతాను.'' అని ప్రకటించింది.
కాముకతతో తన పదవిని దుర్వినియోగం చేసి తన సంస్థకు, మతానికి మచ్చ తెచ్చిపెట్టిన ఫ్రాంకోను చర్చి సమర్థించడమే కాక, అతనిపై కేసు ముందుకు సాగకుండా చేయడానికి సకల యత్నాలు చేస్తోంది. కేసు ఫ్రేమ్ చేయడంలో పోలీసులు కావాలని తప్పులు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కేరళ చర్చి గతంలో కూడా యిలాటి చర్యలకు పాల్పడి, చెడ్డపేరు తెచ్చుకుంది. స్థానికంగా ఉన్న మతాధికారులలోనే యీ దోషం ఉంది అని అనుకుని ఊరుకోవడానికి లేదు. ఎందుకంటే వాటికన్ కూడా లూసీపై చర్యలకు ఆమోదముద్ర వేసింది. ఇది ఆశ్చర్యకరంగా తోస్తుంది.
ఎందుకంటే అనేక దేశాలలో క్రైస్తవ మతాధికారులు ఆడా, మగా చిన్న పిల్లలను, నన్స్‌ను పాడు చేయడం గురించి, ఫిర్యాదు చేసినవారికి చర్చి నిధుల నుంచి పరిహారం చెల్లించడం గురించి, రాజీ పడని వారు కేసు పెట్టిన సందర్భాల్లో లాయర్ల ఫీజులకై భక్తులిచ్చిన విరాళాలు వాడడం గురించి వాటికన్ తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తూంటుంది. పోప్‌గా వచ్చిన ప్రతీ వ్యక్తి యీ పాపాలపై విచారం వ్యక్తం చేస్తారు, క్షమాభిక్ష కోరతారు. తప్పు చేసిన మతాధికారులను నిరసిస్తారు. ఇది ఓ పక్క జరుగుతూండగానే, మరో పక్క యిలా ఆ దుశ్చర్యలపై గళమెత్తినవారిని శిక్షిస్తూండడం జరుగుతోంది.
వాటికన్ యీ ద్వంద్వ వైఖరిని విడనాడాలి. తప్పు చేసినవారిపై న్యాయవిచారణ సక్రమంగా జరగడానికి ఉన్నతాసనం దోహదపడాలి. దానికి బదులుగా సాక్షులు హత్యకు గురి కావడం, నిరసన వ్యక్తం చేసినవారిపై 'క్రమశిక్షణ' చర్యలు – యివన్నీ క్రైస్తవ మతాభిమానులకు ఆవేదన కలిగిస్తాయి. వ్యవస్థీకృత మతాచారంపై రోత పుట్టిస్తాయి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2019)