తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఎన్నికతో పాటు జరుగుతున్న వివిధ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఆసక్తిని రేపుతున్న వాటిల్లో మహారాష్ట్రలోని అంథేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోకవర్గం కూడా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అసలే రాజకీయ ప్రతిష్టంభన, తిరుగుబాట్లతో వాతావరణం వేడెక్కి ఉన్న మహారాష్ట్రలో ఆ వేడికి ఈ ఉప ఎన్నిక పోరు ఆజ్యం పోసింది.
మరణించింది శివసేనలోని ఠాక్రే వర్గం అభ్యర్థి. ఆయన స్థానంలో ఆయన భార్యకు టికెట్ ను కేటాయించి పోటీ చేయిస్తోంది ఠాక్రే వర్గం. ఇక్కడ పోటీకి భారతీయ జనతా పార్టీ ఉత్సాహ పడింది. అభ్యర్థిని ప్రకటించింది. నామినేషన్ కూడా వేసింది. అయితే తీరా ఇంత జరిగాకా.. చివర్లో ఆ పార్టీ వెనక్కు తగ్గడం గమనార్హం. తమ అభ్యర్థిని పోటీ నుంచి బీజేపీ ఉపసంహరింపజేసింది.
ఇక్కడ బీజేపీ తన అభ్యర్థిని పెట్టడం పట్ల ముఖ్యమంత్రి హోదాలోని షిండే కూడా నసిగారట. ఈ పరిస్థితుల్లో ఇలాంటి నియోజకవర్గంలో అభ్యర్థి ఎందుకంటూ ఆయన బీజేపీ వాళ్లను వారించినట్టుగా తెలుస్తోంది. ఈ ఉప పోరుకు కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా దూరంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఉప ఎన్నికను ఏకగ్రీవంగా పూర్తి చేయాలం శరద్ పవార్ పిలుపునిచ్చాడు. అంతే కాదు.. బీజేపీకే మద్దతు అంటున్న రాజ్ ఠాక్రే కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థిని పెట్టడం సరికాదని బహిరంగ లేఖ రాశాడు.
మహారాష్ట్ర బీజేపీకి అంతా తానైన ఫడ్నవీస్ పై ఒత్తిడి పెరిగింది. ఇంతమందిని కాదని ఈ బై పోల్ బరిలోకి బీజేపీని దించినా.. అప్పుడు పరువు పోతే ప్రభుత్వ మనుగడపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అసలే తిరుగుబాటు దార్లు, వెన్నుపోట్లతో ఏర్పడిన ప్రభుత్వం. ఇలాంటి ఉప ఎన్నికల బరిలోకి దిగి పరువు పోగొట్టుకుంటే.. వెంట నిలుస్తున్న వారిలో కూడా నమ్మకం సడలవచ్చు.
ప్రజలు అసలు శివసేనగా ఠాక్రే వర్గాన్నే గుర్తిస్తున్నారనే వాదనకు అప్పుడు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే బీజేపీ చివరి నిమిషంలో పోటీ నుంచి వైదొలిగిందనే అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీ మొదట్లోనే ఈ పోటీకి దూరమని ప్రకటించి ఉంటే పోయేది. అయితే చివరి నిమిషంలో వెనక్కు తగ్గడం వల్ల కాస్త ఇమేజ్ డ్యామేజీ తప్పకపోవచ్చు!