అత్యంత భారీ కలెక్షన్లను సాధించిన కన్నడ సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలుస్తోంది సంచలన సినిమా 'కాంతార'. ఈ సినిమా నెట్ వసూళ్లు వంద కోట్ల రూపాయలను దాటేశాయని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కన్నడ వెర్షన్ విడుదలై మూడు వారాలు గడుస్తున్న నేపథ్యంలో 103 కోట్ల రూపాయల నెట్ వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతోంది. కేజీఎఫ్ 2, కేజీఎఫ్ సినిమాల తర్వాత ఈ స్థాయి వసూళ్లను అందుకున్న కన్నడ సినిమా ఇదే.
అయితే.. కాంతార అసలైన పరుగు ఇప్పుడే మొదలైంది. కన్నడలో ఈ సినిమా సూపర్ హిట్. కన్నడీగులు ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్లను అందుకోవడం కూడా కేవలం కన్నడ వెర్షన్ తోనే! కర్ణాటక ఆవల ఇప్పుడిప్పుడే ఈ సినిమా పుంజుకుంటోంది. తెలుగు వెర్షన్ విడుదలైంది. పాజిటివ్ మౌత్ టాక్ ను పొందుతోంది. మరోవైపు హిందీ వెర్షన్ కూడా పుంజుకుంటోంది.
సౌత్ సినిమాలపై హిందీలో ఆదరణను కొనసాగించే బాధ్యతను కాంతార తీసుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాకు అక్కడ భారీ వసూళ్లు దక్కే అవకాశం ఉంది. కార్తికేయ పార్ట్ 2 తర్వాత కాంతార ఈ రేసును కొనసాగిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. హిందీ వెర్షన్ కు కూడా భారీ వసూళ్లు దక్కే అవకాశం ఉందని, మరీ కేజీఎఫ్ సీరిస్ రేంజ్ లో కాకపోయినా.. కార్తికేయ 2 హిందీ వసూళ్ల స్థాయిలో అయినా కాంతారా నంబర్లు నిలవడం ఖాయమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి.
అలాగే తెలుగు వెర్షన్ కూడా మంచి వసూళ్లను సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏతావాతా.. కన్నడీగులకు విపరీతంగా నచ్చేసి వంద కోట్ల రూపాయల రేంజ్ కు చేరి కన్నడ సినిమా స్థాయిని మరింత విస్తృత పరిచిన కాంతార, బయట కూడా పాజిటివ్ టాక్ ను అయితే పొందుతోంది. మరి వసూళ్ల విషయంలో ఏ రేంజ్ కు చేరుతుందనేది ఆసక్తిదాయకమైన అంశం.