తెలంగాణలో ప్రతిష్టాత్మక స్థాయిలో జరుగుతున్న ఉప ఎన్నికల పరంపరలో.. ఇది వరకే హుజూరాబాద్ సెట్ చేసిన రికార్డులను మునుగోడు ఉప ఎన్నిక అధిగమించడం ఖాయమనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఓటుకు రేటు విషయంలో హుజూరాబాద్ ఒక భారీ రికార్డును సెట్ చేయగా… ఆ రికార్డును మునుగోడులో రాజకీయ పార్టీలు అధిగమించడం ఖాయమని స్పష్టం అవుతోంది.
గణాంకాల ప్రకారం చూసుకుంటే.. హుజూరాబాద్ లో అన్ని పార్టీలూ కలిపి సగటున ఒక్కో ఓటుకు కనీసం ముప్పై వేల రూపాయల వరకూ ఖర్చు చేశాయని అంచనా! అంటే ప్రతి ఓటుకూ ముప్పై వేల రూపాయల డైరెక్టు క్యాష్ ఇచ్చి ఉండకపోవచ్చు. అన్ని పార్టీల ఎన్నికల ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే… హుజూరాబాద్ లో అన్ని పార్టీ ల తరఫున ప్రతి ఓటుకూ ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకూ ఖర్చు అయ్యిందని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పుడు మునుగోడులో ఈ ఖర్చు ఓటుకు సగటున యాభై వేల రూపాయల వరకూ చేరవచ్చనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ లో ముప్పై వేలు అయిన ఓటు ఖర్చు ఇప్పుడు యాభై వేల రూపాయలకు చేరవచ్చని అంచనా. ఈ సీటుకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందనే ప్రచారం దగ్గరి నుంచినే పార్టీలు ఈ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల మార్గాలను అనుసరిస్తూ వస్తున్నాయి. దీంతో ఖర్చు ఈ సారి మరింతగా పెరిగింది.
ఒక్కో పార్టీ ఓటుకు ఇచ్చే రేటు పది వేల రూపాయల పైనే ఉండవచ్చు. నియోజకవర్గంలోని పరిస్థితులను పార్టీలు జల్లెడపట్టాయి. ఈ వార్డులో ఎన్ని ఓట్లున్నాయి. ఎన్ని తమకు అనుకూలం, ఎన్ని తమకు వ్యతిరేకం.. ఈ సమాచారం పార్టీల వద్ద ఇప్పటికే ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. ప్రతి ఓటూ కీలకమే. దీంతో.. పోటాపోటీ ఉన్న వార్డుల్లో ఓటుకు పది వేల రూపాయలు కాదు, అంతకు మించి కూడా ఇవ్వడానికి పార్టీలు వెనుకాడవు.
ఇక ఉప ఎన్నిక ప్రచారం అలా మొదలైన దగ్గర నుంచి.. విందు, మందు, వినోదం బాధ్యతంతా పార్టీలదే. అభ్యర్థులదే. ప్రతి అభ్యర్థీ ప్రతిరోజూ చికెన్ బిరియానీలు, మటన్ బిరియానీలు వండి పెట్టాల్సిందే. కొన్ని వేల మందికి ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి రోజూ! ఇక మందు, చిందు ఖర్చు గురించి చెప్పనక్కర్లేదు. ఓటుకు ఇచ్చే రేటు కు ఈ ఖర్చులేమీ తీసిపోవు.
పోలింగ్ కు ముందు రోజు, పోలింగ్ రోజు వరకూ కూడా యజ్ఞంలా ఈ ఏర్పాట్లన్నీ సాగుతాయి. ఈ ఖర్చులే అభ్యర్థులకు భారీ ఎత్తున వస్తున్నాయి. ఇదంతా ఎన్నికల ఖర్చే. ఈ ఖర్చును అంతా కలిపి, ఓట్లకు పంచే డబ్బును కూడి.. మొత్తం ఓట్ల నంబర్ తో భాగిస్తే.. అన్ని పార్టీలూ కలిసి ఒక్కో ఓటుకు సగటున యాభై వేల రూపాయల వరకూ ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది మునుగోడులో.