వైఎస్ జగన్ మానస పుత్రిక “సాక్షి” పత్రిక దృష్టిలో వేర్వేరు న్యాయాలున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికైతే ఒక న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాదరావుకైతే మరో న్యాయం అన్నట్టుగా ఆ పత్రిక వ్యవహరిస్తోంది. ఇటీవల వైసీపీ కీలక నేతలపై “ఈనాడు” పత్రిక వరుస అవినీతి కథనాలను ప్రచురిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున పలుకుబడిని పెట్టుబడిగా పెట్టి భూదందాలకు పాల్పడ్డారని ఈనాడు పత్రిక బ్యానర్ కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే.
ఈ కథనాలకు “సాక్షి” ఎప్పటికప్పుడు దీటైన కౌంటర్ ఇవ్వడం గమనార్హం. తాజాగా “ఇది సాయిరెడ్డి తడాఖా!” శీర్షికతో ఈనాడు ఓ కథనాన్ని రాసింది. దీనికి “సాక్షి” తన వంతు కర్తవ్యంగా “తడాఖా కాదు… అబద్ధాల తడిక” అంటూ ఎడిట్ పేజీలో కౌంటర్ కథనాన్ని ప్రచురించింది. ఇంత వరకు బాగానే వుంది.
ఇదే ఈనాడు జగన్ కేబినెట్లో కీలక మంత్రిత్వశాఖ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ధర్మాన ప్రసాదరావుపై ఈ నెల 15, 16 తేదీల్లో వరుసగా “ఇది ధర్మాన గారి దోడిపీ”, “అధర్మాన పర్వం” శీర్షికలతో బ్యానర్ కథనాలను ప్రచురించి సంచలనం సృష్టించింది. మాజీ సైనికుల పేరుతో విశాఖ శివార్లలో కేటాయించిన 71.29 ఎకరాలను ధర్మాన ప్రసాదరావు 2005లో హస్తగతం చేసుకున్నారనేది ఈనాడు కథనం అభియోగం.
అదేంటో గానీ, ధర్మానపై ఈనాడులో వచ్చిన కథనాలకు సాక్షి కౌంటర్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. తనపై వచ్చిన కథనాలపై ధర్మాననే కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాన్ని మాత్రం సాక్షి ప్రచురించి… వైసీపీ నేతలంతా తమకు సమానంగా కాదని చెప్పకనే చెప్పింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసి తీరాల్సిందే అంటూ బలమైన గొంతుకగా ధర్మాన నిలిచారు. సహజంగానే ఇది ఎల్లో బ్యాచ్‌కు గిట్టడం లేదు.
దీంతో ఆయన్ను బద్నాం చేసేందుకు 2005లో సాగిన వ్యవహారాలను తెరపైకి తెచ్చి కథనాలను వండివార్చుతోంది. ఉత్తరాంధ్ర గొంతు నొక్కటానికే తప్పుడు రాతలంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాపోవడాన్ని మాత్రమే సాక్షి రాసుకొచ్చింది. విజయసాయిరెడ్డి తరపున వకల్తా పుచ్చుకున్నట్టుగా, ధర్మానకు మద్దతుగా సాక్షి పత్రిక ఎలాంటి కథనాలు రాయకపోవడం విమర్శలపాలవుతోంది. సాక్షి పత్రికకు ఇది ధర్మమా? అని మంత్రి అనుచరులు ప్రశ్నిస్తున్నారు.