టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్డా కడప గడ్డపై ఇవాళ దిగారు. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని ఇటీవల అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రవీణ్‌ను పరామర్శించి, టీడీపీ శ్రేణులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు లోకేశ్ అక్కడికి వెళ్లారు.
కడప విమానాశ్రయంలో కాసేపటి క్రితం ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు విమానాశ్రయంలో టీడీపీ నేతలు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, మల్లెల లింగారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ అయ్యారు.
ప్రొద్దుటూరులో ప్రవీణ్ అరెస్ట్‌కు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కడప జిల్లాలో అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోయాయని, సామాన్యులు బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని లోకేశ్‌కు నేతలు వివరించారు. అధికార పార్టీ వేధింపులపై గట్టిగా పోరాడాలని, భయపడాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇదిలా వుండగా ప్రవీణ్ అరెస్ట్‌ను ట్విటర్ వేదికగా ఖండించడం వరకే లోకేశ్ పరిమితం కాలేదు.
సీఎం సొంత జిల్లాలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ అరెస్ట్‌ను టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. అందుకే లోకేశ్ నేరుగా కడపకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రవీణ్‌ను అరెస్ట్ చేసినా పట్టించుకోని కడప పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి …లోకేశ్ రాకతో పరుగు తీశారు. కడప సెంట్రల్ జైలుకు వెళ్లి ప్రవీణ్‌ను లోకేశ్ పరామర్శించనున్నారు. కడపలో ఆయన ఏం మాట్లాడ్తారో చూడాలి.