రూ.15 కోట్లు ఖ‌ర్చు పెడ్తాం…టికెట్ ప్లీజ్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుప‌తి అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్ర‌త్యేక స్థానం వుంది. తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌రుడి పాదాల చెంత వుండ‌డ‌మే తిరుప‌తి చేసుకున్న అదృష్టం. ప్ర‌పంచంలో తిరుప‌తి గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. అలాంటి ప్ర‌సిద్ధిగాంచిన నియోజ‌క‌వ‌ర్గాల…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుప‌తి అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్ర‌త్యేక స్థానం వుంది. తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌రుడి పాదాల చెంత వుండ‌డ‌మే తిరుప‌తి చేసుకున్న అదృష్టం. ప్ర‌పంచంలో తిరుప‌తి గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. అలాంటి ప్ర‌సిద్ధిగాంచిన నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ప్రాతినిథ్యం వ‌హించాల‌ని ఎవ‌రికి ఉండ‌దు? తిరుప‌తి అసెంబ్లీ జ‌న‌ర‌ల్‌కు, లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయ్యాయి.

మ‌రో ఏడాదిన్న‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో ఆశావ‌హులు త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇందులో భాగంగా తిరుప‌తికి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. తిరుప‌తి అసెంబ్లీ వైసీపీ టికెట్ భూమ‌న కుటుంబానికే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అలాగే తిరుప‌తి లోక్‌స‌భ సీటు మ‌రోసారి డాక్ట‌ర్ గురుమూర్తికే కేటాయించ‌నున్నారని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే అసెంబ్లీ టికెట్‌ను ద‌క్కించుకునేందుకు చాలా మంది పోటీ ప‌డుతున్నారు. రూ.30 కోట్లు ఖ‌ర్చు పెట్టుకుంటామంటే చాలు… టికెట్ ఖ‌రారు చేసేలా ఆ పార్టీ ప‌రిస్థితి వుంది. అయితే మొద‌టి నుంచి పార్టీ జెండా మోస్తున్నాన‌ని, బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన త‌న‌కు ఒకే ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వాల‌ని తుడా మాజీ చైర్మ‌న్ న‌ర‌సింహ‌యాద‌వ్ కోరుతున్నారు. ఈ మేర‌కు అధిష్టానానికి ఆయ‌న విన్నవించుకున్న‌ట్టు తెలిసింది.

త‌న సోద‌రుడు కృష్ణ‌యాద‌వ్‌ను వెంట‌బెట్టుకుని చంద్ర‌బాబును న‌ర‌సింహ‌యాద‌వ్ ఇటీవ‌ల క‌లుసుకున్నారు. త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని అభ్య‌ర్థించారు. అనంత‌రం అధిష్టానం పెద్ద‌ల‌తో యాద‌వ్ బ్ర‌ద‌ర్స్ భేటీ అయ్యారు. రూ.15 కోట్లు ఖ‌ర్చు పెట్టుకుంటామ‌ని, త‌న అన్న‌కు ఈ ద‌ఫా టికెట్ ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న కృష్ణ యాద‌వ్ చేసిన‌ట్టు తెలిసింది. అయితే తిరుప‌తి ఆశావ‌హుల జాబితా ఎక్కువ‌గా ఉంద‌ని, గెలుపు గుర్రానికే టికెట్ ఇస్తామ‌ని అధిష్టానం తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం.

తిరుప‌తిలో బ‌లిజ‌ల‌తో స‌మానంగా త‌మ‌ సామాజిక వ‌ర్గ ఓట్లు ఉన్నాయ‌ని, త‌గిన ప్రాధాన్యం ఇవ్వాల‌ని యాద‌వ్ బ్ర‌ద‌ర్స్ కోరార‌ని తెలిసింది. తిరుప‌తి టికెట్‌ను బ‌లిజ‌ల‌కే ఫిక్స్ చేస్తే, మిగిలిన సామాజిక వ‌ర్గాల వ్య‌తిరేక‌త‌ను చ‌వి చూడాల్సి వ‌స్తుంద‌ని అధిష్టానం పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లార‌ని స‌మాచారం. మ‌రోవైపు జ‌న‌సేన వైపు బ‌లిజ సామాజిక వ‌ర్గం ఉంద‌ని, ఆ కోణంలో చూసినా యాద‌వుల‌కే ఇవ్వ‌డ‌మే స‌రైన నిర్ణ‌యంగా అధిష్టానం పెద్ద‌ల‌కు సూచించార‌ని స‌మాచారం.

త‌మ ప్ర‌తిపాద‌న‌పై టీడీపీ అధిష్టానం సానుకూల ధోర‌ణితో ఉన్న‌ట్టు యాద‌వ్ బ్ర‌ద‌ర్స్ త‌మ స‌న్నిహితుల వ‌ద్ద చెబుతుండ‌డం విశేషం. అస‌లే చంద్ర‌బాబు ప్ర‌యోగాల‌కు పెట్టింది పేరు. పాత అభ్య‌ర్థులపై వ్య‌తిరేక‌త ఉంద‌ని భావించి, కొత్త వారిని బ‌రిలో నిల‌పాల‌ని నిర్ణ‌యం తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. తిరుప‌తిలో న‌ర‌సింహ‌యాద‌వ్‌కు టికెట్ ఇస్తే మాత్రం… టీడీపీకి మంచి అభ్య‌ర్థి దొరికిన‌ట్టే.