ప‌వ‌న్ నేల విడిచి సాము

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నేల విడిచి సాము చేస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ప‌వ‌న్ నేల మీద ఉన్న‌ట్టే క‌నిపిస్తారు గానీ, ఆయ‌న క‌ళ్లెప్పుడు ఆకాశంలోనే వుంటాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయంగా తాను ఎంత వ‌ర‌కు…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నేల విడిచి సాము చేస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ప‌వ‌న్ నేల మీద ఉన్న‌ట్టే క‌నిపిస్తారు గానీ, ఆయ‌న క‌ళ్లెప్పుడు ఆకాశంలోనే వుంటాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయంగా తాను ఎంత వ‌ర‌కు ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రో తెలుసు కోకుండా …భారీ డైలాగ్‌లు కొడుతున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబే… వైసీపీ విముక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ చేస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌ల‌క‌లేదు.

అలాంటిది క‌నీసం ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేని, త‌న వాళ్ల‌ను గెలిపించుకోలేని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారు. రాజ‌కీయాల్లో నేరాల గురించి నీతులు చెబుతున్నారు. అందుకే ప్ర‌త్య‌ర్థులు కూడా ప‌దేప‌దే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి విమ‌ర్శించ‌డం. ప్ర‌త్య‌ర్థుల వైపు ఒక వేలు చూపితే, మిగిలిన నాలుగు వేళ్లు ఆయ‌న వైపే ఉన్నాయి. విధానాల‌ప‌రంగానే తాను ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న‌ట్టు ప‌వ‌న్ చెబుతారే త‌ప్ప ఆచ‌రించ‌రు. అదే స‌మ‌స్య‌.

రాష్ట్రం బాగుప‌డాలంటే వైసీపీ నుంచి విముక్తి క‌ల్పించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌లంగా ప‌ని చేసి వైసీపీ విముక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాధిస్తాం అని ఆయ‌న శ‌ప‌థం చేశారు. శ‌ప‌థాల‌కు కాలం చెల్లిన సంగ‌తిని ప‌వ‌న్ గుర్తిస్తే మంచిది. పురాణ క‌థ‌ల్లో శ‌ప‌థాలు చేయ‌డం, నెర‌వేర్చుకునేందుకు య‌జ్ఞ‌యాగాదులు చేయ‌డం చూశాం. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఉన్నాం. పంతం నెగ్గించుకునేందుకు ప్ర‌జాద‌ర‌ణ పొందాలి. ఇందుకు నిత్యం ప్ర‌జ‌ల్లో వుండాలి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ షూటింగ్‌ల్లో త‌ప్ప‌, ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న‌దెప్పుడు?

వైసీపీని విముక్తం చేయ‌డం శ‌ప‌థం చేసినంత సులువా?  విముక్తం చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తుంటే…. ముందుగా త‌న‌లోని చెడును పార‌దోలాలి. ఒక పార్టీ అధినేత‌గా జ‌న‌సేన‌ను అధికారంలోకి తేవాల‌నే ప‌ట్టుద‌ల రావాలి. మ‌న‌సులోంచి చంద్ర‌బాబును విముక్తం చేయాలి. జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌త క‌క్ష‌ను విముక్తం చేయాలి. వైసీపీపై విద్వేషాన్ని విముక్తం చేయాలి. మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీపై పొత్తు పెట్టుకుని, ప‌క్క‌చూపులు చూడ‌డాన్ని విముక్తం చేయాలి.

ఇలా త‌నకు న‌ష్టం క‌లిగించే అంశాల్ని విముక్తం చేయాలి. ఆ త‌ర్వాత వైసీపీ విముక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి క‌ల‌లు క‌నొచ్చు. ఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మా…స్వ‌ర్గానికి ఎగురుతాన‌నే సామెత చందంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ధోర‌ణి ఉంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. మొట్ట‌మొద‌ట తాను గెల‌వ‌డంపై ప‌వ‌న్ దృష్టి సారించాలి. ఆ త‌ర్వాత ఎన్ని ఆలోచ‌న‌లైనా చేయొచ్చు. రాజ‌కీయాల్లో ప్ర‌జాద‌ర‌ణ పొందిన నేత‌ల‌కే విలువ వుంటుంది. త‌న మాట‌ల‌కు విలువ ఎందుకు లేదో ప‌వ‌న్ గుర్తిస్తే మంచిది.