జగన్ మీద పోరాటం చేయడానికి ఢిల్లీ నాయకుల సహకారం తీసుకోను.. అంటూ జనసేన అని పవన్ కళ్యాణ్ కొత్త ప్రతిజ్ఞ చేశారు. అధికార పార్టీ మీద సహజంగానే వేరే లెవెల్లో రంకెలు వేస్తున్న పవన్ కళ్యాణ్.. నేర రాజకీయాలు చేసేవాళ్లు పాలకులుగా, విధాన నిర్ణేతలుగా ఉండకూడదని సుద్దులు చెబుతున్నారు.
అంతా బాగానే ఉంది.. అయితే, పవన్ కళ్యాణ్ ఏం చేయదలచుకుంటున్నారు? ఆయన మాటల్లోనే చాలా స్పష్టమైన సమాధానం దొరుకుతుంది.. చంద్రబాబు నాయుడుతో మాత్రమే కలిసి ఏపీ రాజకీయాల్లో ముందుకు వెళ్లడానికి పవన్ డిసైడ్ అవుతున్నారు. కమలంతో కటీఫ్ చెప్పడానికి విశాఖపట్నం వ్యవహారాలు శ్రీకారంగా భావించాల్సి ఉంటుంది.
పవన్ కళ్యాణ్ కు విశాఖపట్నంలో ఎదురైన కష్టం, ఆయనను ఇంచుమించుగా హోటల్ కదలనివ్వకుండా పోలీసులు సభల అనుమతులను రద్దు చేసిన వైనం.. ఇవన్నీ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించాయి పవన్ కళ్యాణ్ చేసే విమర్శలకు తగినట్టుగా ఆయనకేదో అన్యాయం, ఘోరం జరిగిపోయినట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, వామపక్షాల నాయకులు కూడా ఆయనకు మద్దతుగా ప్రకటనలు చేయడం, పోలీసుల వైఖరిని నిందించడం, సానుభూతి వ్యక్తం చేయడం చాలా చాలా జరిగాయి.
పవన్ కళ్యాణ్ తో తమకు స్నేహబంధం ఉందని రాబోయే ఎన్నికలలో తాము ఇద్దరమూ కలిసి పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు పదేపదే చెబుతూ ఉండే కమల నాయకులు ఎవరూ పట్టించుకోలేదు! జనసేన కి మద్దతుగా ప్రభుత్వాన్ని నిందించడం కానీ, ఏదైనా నిరసన తెలియజేయడం గాని జరగలేదు. ఈ పరిణామాలు కూడా పవన్ కళ్యాణ్ కు మనస్తాపం కలిగించి ఉండవచ్చు.
మోడీ అమిత్ షా వద్దకు వెళ్లి అమ్మా అప్పా అంటూ బతిమాలబోయేది లేదని చాలా వెటకారంగా, రోషంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ మరి ఏం చేయదలుచుకున్నారు? ఇది మా రాష్ట్రంలో వ్యవహారం మేమే తేల్చుకుంటాం అనడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? వాళ్ళ దగ్గరకు కాకపోతే సోము వీర్రాజు, సత్య కుమార్ లాంటి రాష్ట్ర నాయకుల వద్దకు వెళ్లి కలిసి పోరాడడానికి బతిమాలుతారా? రాష్ట్ర నాయకులను వెళ్లి అడగాలంటే పవన్ కళ్యాణ్ కు ఈగో అడ్డు వస్తుంది కదా? మేం పోరాడతాం అంటే.. తనను చంద్రబాబును కలుపుకుని చెబుతున్నారా? ఇవన్నీ మిలియన్ డాలర్ ప్రశ్నలు! పవన్ కళ్యాణ్ బిజెపితో తెగ తెంపులు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఒక కారణంగా వాడుకోవచ్చు అనేది పలువురి అంచనా!
‘మా రాష్ట్రంలో మేమే కలిసి పోరాడుతాం’ అనే మాటలు అచ్చంగా ఆయనకు విశాఖపట్నంలో ఆయనకు మద్దతుగా మాట్లాడిన వారికి మాత్రమే సంబంధించినవి. అంటే చంద్రబాబు– పవన్ కలిసి ముందుకు సాగుతారని మనం అనుకోవాలి. మొత్తానికి బిజెపితో ఎప్పుడెప్పుడు తెగదింపులు చేసుకుందామా? అందుకు ఏ కారణాలు చూపిద్దామా? అని దేవులాడుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చినట్లయింది.