టాలీవుడ్ కు మళ్లీ స్లంప్?

కరోనా మొదటి దశ దాటేసింది. టాలీవుడ్ మరింత హుషారుగా సినిమాలు స్టార్ట్ చేసింది. కానీ కరోనా రెండో దశ దాటింది. టాలీవుడ్ అయోమయంలో చిక్కుకుంది. సినిమాలు సరిగ్గా లేక జనాలు రావడం లేదా? లేక…

కరోనా మొదటి దశ దాటేసింది. టాలీవుడ్ మరింత హుషారుగా సినిమాలు స్టార్ట్ చేసింది. కానీ కరోనా రెండో దశ దాటింది. టాలీవుడ్ అయోమయంలో చిక్కుకుంది. సినిమాలు సరిగ్గా లేక జనాలు రావడం లేదా? లేక జనాలు రాక సినిమాలు చతికిలపడుతున్నాయా? అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆంధ్రలో చూసుకుంటే రేట్లు లేవు. కేవలం మూడు షో లు మాత్రమే. కానీ తెలంగాణలో అన్నీ అనుకూలంగానే వున్నాయి. అయినా కలెక్షన్లు అంతంత మాత్రంగా వుంటున్నాయి.

కరోనా తొలి దశ తరువాత ప్రతి నెల ఓ పెద్ద హిట్ పడింది. కానీ రెండో దశ తరువాత పరిస్థితి అలా లేదు. రెడీ అయిన, రెడీ అవుతున్న పెద్ద సినిమాలు అన్నీ అలా వున్నాయి. వస్తున్న చిన్న సినిమాలు అన్నీ నిట్టూరుస్తున్నాయి. అదృష్టం కొద్దీ నాన్ థియేటర్ హక్కులు కాస్త కిట్టుబాటు అవుతున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో ఓటిటికి ఇస్తే ఓ గొడవ, ఇవ్వకపోతే మరో గొడవ అన్నట్లు తయారయింది. ఎందుకొచ్చిన తలనొప్పి అని అలా హోల్డ్ చేసి వుంచుతున్నారు. గీతా కాంపౌండ్ లో మూడు సినిమాలు రెడీ అయినట్లే. సితార కాంపౌండ్ లో దాదాపు నాలుగు సినిమాలు రెడీ అయినట్లే. విరాటపర్వం, దృశ్యం 2 సినిమాలు అలా పక్కన వుంచారు. శ్యామ్ సింగ రాయ్ రెడీ అయిపోతొంది. యువి కాంఫౌండ్ లో రెండు మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి.

కానీ ఏ ఒక్కరూ తొందరపడడం లేదు. పరిస్థితులు చూసిన తరువాతే డేట్ లు వేయాలనుకుంటున్నారు. ఆంధ్రలో టికెట్ రేట్లు రావడం అన్నది కీలకం. అలాగే సెకెండ్ షో లు. అది కాక అక్టోబర్ లో మూడో దశ అన్న టాక్ వుంది. దానికి అనుగుణంగానే కేరళలో కేసులు పెరుగుతున్నాయి. గతంలో రెండు సార్లు కేరళ, ఆ తరువాత మహరాష్ట్ర, ఆపై ఆంధ్ర అన్న లైనప్ కనిపించింది. ఈసారి కూడా అలా అయితే టాలీవుడ్ కోలుకోవడం కష్టం. పండగ సినిమాలు అన్నీ కకావికలైపోతాయి.

ఓటిటి ప్లాట్ ఫారమ్ లు రెడీగా వున్నాయి. కానీ పెద్ద సినిమాలు ఏవీ అటు దృష్టి పెట్టడం లేదు. పెద్ద సంస్థలు తమ దగ్గర మీడియం సినిమాలు వున్నా, అనవసరపు వివాదాలకు దారి తీస్తుందని సైలంట్ గా వున్నాయి. ఇలా వుండిపోయినా ప్రమాదమే. థియేటర్లకు కంటెంట్ వుండకుండా పోతుంది. మూడో తేదీ సినిమాలు లేనట్లే. అంటే 27 నుంచి 10 వరకు ఇప్పడు వున్న సినిమాలే ఆడాలి. 10 న కూడా మహా వుంటే ఒక్క సినిమా. 

మొత్తం మీద చూస్తుంటే మళ్లీ టాలీవుడ్ లో స్లంప్ వస్తున్నట్లు కనిపిస్తోంది.