యూట్యూబ్ న్యూస్ చానల్ నిర్వాహకుడు, జర్నలిస్టు తీన్మార్ మల్లన్నను శుక్రవారం రాత్రి చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. అసలు ఈ వివాదానికంతటికి కారణం డబ్బే. ఫిర్యాదులో పేర్కొన్నట్టు…. సదరు జ్యోతిష్కుడు లక్ష్మీకాంతశర్మను తీన్మార్ మల్లన్న డిమాండ్ చేసిన సొమ్ము ఎంతంటే, అక్షరాలా రూ.30 లక్షలు.
లక్ష్మీకాంతశర్మ జ్యోతిష్యాలయం నిర్వహణపై తీన్మార్ మల్లన్న తన చానల్లో కథనాలు ప్రసారం చేశారు. దీనిపై లక్ష్మీకాంతశర్మ ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించారు. కొంత మంది నకిలీ భక్తుల్ని తన దగ్గరికి పంపి ఇబ్బంది పెడ్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో గత ఏప్రిల్‌లో లక్ష్మీకాంతశర్మ ఫిర్యాదు చేశారు.
ఏప్రిల్ 19న తీన్మార్ మల్లన్న వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి రూ.30 లక్షలు ఇవ్వాలని తనను డిమాండ్ చేసినట్టు ఆయన ఆరోపించారు. అయితే డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో తప్పుడు ప్రచారం చేయిస్తానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బెదరించినట్టుగానే ఏప్రిల్ 20న తన చానల్లో తప్పుడు వార్తను ప్రసారం చేశారని అతను పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మల్లన్నపై కేసు నమోదు చేశారు. ఈ నెల 3న తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సోదాలు చేశారు. రెండుసార్లు పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించారు. అనంతరం శుక్రవారం రాత్రి అరెస్టు చేయడం గమనార్హం.
ఇటీవల కాలంలో కేసీఆర్ సర్కార్‌కు తీన్మాన్ మల్లన్న కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చర్చకు దారి తీసింది. తీన్మార్ మల్లన్నపై ఆరోపణలు న్యాయస్థానంలో ఏ మాత్రం నిలబడతాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.