పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా డేట్ ను ఇప్పటికి ఒకటికి రెండు సార్లు స్పష్టంగా ప్రకటించారు. జనవరి 12న విడుదల అంటూ. అయినా కూడా ఈ సినిమా వాయిదా పడిపోతుందని, జనవరి 26 కు వెళ్తుందని, చిరు-కొరటాల శివ ఆచార్య ఆ డేట్ కు వస్తుందని గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది. కానీ భీమ్లానాయక్ యూనిట్ మాత్రం ఈ గ్యాసిప్ లు వట్టి గ్యాసిప్ లు అంటూ కొట్టి పారేస్తోంది.
ఆరు నూరైనా తాము జనవరి 12కే వస్తామని అంటోంది. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న ప్రచారం అంటోంది. ఈ నెలాఖరులో మరో నాలుగు సార్లు అదే డేట్ ను స్పష్టంగా ప్రకటిస్తాం అంటోంది.
ఈ నెలాఖరులో హారిక హాసిని అధినేత చినబాబు బర్త్ డే వుంది. అలాగే అక్టోబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే వుంది. ఈ సందర్భంగా పోస్టర్లు, సాంగ్ ప్రోమో, సాంగ్ విడుదల చేయబోతున్నారు. ఈ మెటీరియల్ అన్నిటా జనవరి 12 అని క్లారిటీగా చెప్పబోతున్నాం అని యూనిట్ పేర్కొంటోంది.
ఇదిలా వుంటే ఆర్ఆర్ఆర్ జనవరి 8న విడుదల అనే కొత్త టాక్ ప్రారంభమైంది. ఈ మేరకు నిర్మాత దానయ్య పండగ సినిమాల నిర్మాతలకు ఫోన్ చేసి చెబుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మైత్రీ మూవీస్ కు సమాచారం అందించి, వారి సర్కారువారి పాట సినిమాను వాయిదా వేసుకోవాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ వచ్చినా కూడా భీమ్లానాయక్ 12నే వస్తుందని, పండగ కనుక రెండు పెద్ద సినిమాలకు ఓ మీడియం సినిమాకు ఎప్పుడూ అవకాశం వుంటుందన్నది భీమ్లానాయక్ యూనిట్ ఆలోచన అని తెలుస్తోంది. మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలి.