కమలంతో వీళ్ల ప్రయాణం.. కంచికి చేరినట్టేనా?

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో కమలం గూటికి చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల పొలిటికల్ కెరీర్ దాదాపుగా ముగిసిపోయిందనే విషయం స్పష్టమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఆ నలుగురిని బీజేపీ ఇంకా తమ మనుషులుగా…

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో కమలం గూటికి చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల పొలిటికల్ కెరీర్ దాదాపుగా ముగిసిపోయిందనే విషయం స్పష్టమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఆ నలుగురిని బీజేపీ ఇంకా తమ మనుషులుగా గుర్తించడం లేదు. బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులుగానే వారిపై ముద్ర పడిపోయింది. అందుకే బీజేపీ వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

అదే సమయంలో బీజేపీ హార్డ్ కోర్ జనాలకు మాత్రమే ఆ అవకాశం ఉందని, వలస నాయకులకు అంత సీన్ లేదని కూడా అంటున్నారు. ఆల్రెడీ గరికపాటి రామ్మోహన్ రావుకి అది అనుభవంలోకి వచ్చింది. రాజ్యసభ గడువు పూర్తయిన తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ భవిష్యత్ ఏంటో తేలాల్సి ఉంది.

పెద్దల సభలోనూ దారి తప్పారు..

రాజ్యసభ ఎంపీలన్నమాటే కానీ, రాష్ట్రం గురించి వీరు మాట్లాడింది చాలా తక్కువ. టీడీపీ హయాంలో కాస్తో కూస్తో నోరు పెగిలేది కానీ, బీజేపీలో చేరాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఏపీ గురించి ఏతావతా జీవీఎల్ నరసింహారావు నోరు చేసుకునేవారే కానీ.. టీడీపీ నుంచి వచ్చిన జంప్ జిలానీలు మాత్రం షెల్టర్ దొరికినందుకు సంబర పడి సరిపెట్టుకున్నారు. 

సుజనా చౌదరి తన కేసుల వ్యవహారంలో పార్టీని బాగా వాడుకున్నారు. సీఎం రమేష్ కూడా కాంట్రాక్ట్ లు ఇతర వర్క్ లకు పార్టీ పేరు వాడుకుంటున్నారు. టీజీ వెంకటేష్ ది కూడా అదే దారి. దీంతో ఈ ముగ్గురు రాజకీయాల్ని పక్కనపెట్టి, అధికారంలో ఉన్నన్ని రోజులు సొంత వ్యాపారాలపై ఫోకస్ పెట్టారు.

కనిపించుటలేదు, వినిపించుటలేదు..

ప్రస్తుతం ఈ జంప్ జిలానీలు ఎక్కడా కనిపించడంలేదు, వినిపించడంలేదు. ఇప్పటికే పరోక్ష పదవులతో కాలం గడుపుతున్న వీరు, ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం లేదు. ఒకవేళ బీజేపీ పిలిచి టికెట్ ఇచ్చినా తప్పుకోవడం మినహా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి చేతులు కాల్చుకోవడం వీరికి సుతరామూ ఇష్టంలేదు. అందుకే ఎంపీ పదవులున్నంత వరకు ఉండి, ఆ తర్వాత పొలిటికల్ కెరీర్ పై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారట.

బీజేపీ ఎలాగూ వీరిని పక్కనపెడుతుంది కాబట్టి.. పరిస్థితులు అనుకూలిస్తే తిరిగి టీడీపీ గూటికి చేరుకోవాలనేది వీరి ఆలోచన. లేకపోతే వైసీపీపై కూడా కర్చీఫ్ వేయాలని చూస్తున్నారు. కానీ జగన్ ఇలాంటి వారిని దగ్గరకు రానిచ్చే ప్రశ్నే లేదు. సో.. భవిష్యత్తులో చంద్రబాబుపైనే ఆశలు పెట్టుకుంది ఈ టెంపరరీ కమలదళం.