కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం సామాన్యులకు అందని ద్రాక్షైంది. సుపథం, బ్రేక్ దర్శనం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది అందరికీ సాధ్యం కావడం లేదు. ఆన్లైన్లో రూ.300 దర్శనం (సుపథం) బుక్ చేసుకోవాలంటే ఓ పెద్ద ప్రహసనమే అని చెప్పాలి.
ఆన్‌లైన్‌ను నమ్ముకుంటే జీవిత కాలంలో దర్శన భాగ్యం కలగదనే ఆవేదన భక్తుల నుంచి వినవస్తోంది. దీంతో సామాన్య భక్తులకు ఉచిత దర్శనం అందుబాటులోకి తేవాలనే డిమాండ్లు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. కానీ టీటీడీ పాలకులు, ఉన్నతాధికారులు సామాన్య భక్తుల మొర ఆలకించడం లేదనే విమర్శలున్నాయి.
కరోనా నిబంధనల నేపథ్యంలో సామాన్యులను స్వామి వారి దర్శనానికి అనుమతించే విషయమై చూద్దాం, చేద్దాం అనే నాన్చివేత మాటలు టీటీడీ నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తిరుమలలో ఉచిత దర్శనాలను పునరుద్ధరించాలని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ ప్రభుత్వ పెద్దలకు స్వరూపానందేంద్ర సరస్వతి మాట వేదవాక్కు అనే విషయం తెలిసిందే.
రుషికేష్‌లోని శ్రీ శారదాపీఠం శాఖలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వామీజీని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కలిసి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారెడ్డిని స్వామీజీ అభినందించి ఆశీస్సులు అందజేశారు.
ఈ సందర్భంగా తిరుమలలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తే ఇబ్బందులుండవని వైవీ సుబ్బా రెడ్డికి సూచించారు. స్వరూపానందేంద్ర స్వామి సూచన మేరకైనా ఏడుకొండల వాడి దర్శన భాగ్యం కలుగుతుందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.