టీడీపీ అధినేత చంద్రబాబు, చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం నారాయణస్వామి మధ్య అవినీతి ఆరోపణల వ్యవహారం ముదురుతోంది. తనపై చంద్రబాబు అవినీతి ఆరోపణలు చేయడాన్ని నారాయణ స్వామి జీర్ణించుకోలేకున్నారు. బురద చల్లి తమాషా చూద్దామంటే కుదరదని, నిరూపించాలని నారాయణస్వామి పట్టుబట్టారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఒంటరిగా నిలబడి ఒక్కస్థానం గెలిస్తే తాను చంద్రబాబు ఇంట్లో పాచి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఇటీవల నారాయణస్వామి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబుపై నారాయణస్వామి విరుచుకుపడ్డారు. తాను అవినీతికి పాల్పడలేదని కాణిపాక వినాయకుడి చెంత ప్రమాణానికి సిద్ధమని, చంద్రబాబు రెడీనా అని నారాయణ స్వామి సవాల్ విసిరారు.
తనపై సీబీఐతో విచారణ చేపట్టేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం, బట్ట కాల్చి మీద వేయడం చంద్రబాబుకు అలవాటేనని మండిపడ్డారు. కాణిపాకం వినాయకుడు ప్రమాణాల స్వామిగా పేరొందిన సంగతి తెలిసిందే. స్వామి చెంత ప్రమాణం చేయడం ద్వారా తప్పు పనులు చేసిన వాళ్లు శిక్షకు గురి అవుతారని భక్తుల విశ్వాసం.
అందుకే కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణానికి ఎంతో విలువ. అక్కడ ప్రమాణం చేస్తామనే సవాల్ విసరడం అంటే… తాము ఎలాంటి తప్పు చేయలేదనే బలమైన సంకేతంగా చెబుతారు. ఇప్పుడు ఆ పని మంత్రి నారాయణస్వామి చేయడం గమనార్హం.