మూవీ రివ్యూ: శ్రీదేవి సోడా సెంటర్

టైటిల్: శ్రీదేవీ సోడా సెంటర్ రేటింగ్: 2.25/5 తారాగణం: సుధీర్ బాబు, ఆనంది, నరేష్, పావెల్, సత్యం రాజేష్ తదితరులు కెమెరా: షందత్ సైనుద్దీన్ సంగీతం: మణిశర్మ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ నిర్మాతలు: విజయ్…

టైటిల్: శ్రీదేవీ సోడా సెంటర్
రేటింగ్: 2.25/5
తారాగణం: సుధీర్ బాబు, ఆనంది, నరేష్, పావెల్, సత్యం రాజేష్ తదితరులు
కెమెరా: షందత్ సైనుద్దీన్
సంగీతం: మణిశర్మ
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
కథ- దర్శకత్వం: కరుణ కుమార్ 
విడుదల తేదీ: 28 ఆగష్ట్ 2021

“పలాస” తీసి పర్వాలేదనిపించుకున్న దర్శకుడు కరుణ కుమార్ “శ్రీదేవీ సోడా సెంటర్” లాంటి మాస్ టైటిలుతో సుధీర్ బాబుని హీరోగా పెట్టుకుని ముందుకొచ్చాడు. టైటిల్, పొస్టర్, ట్రైలర్ చూడగానే రొమాంటిక్ మాస్ యాక్షన్ మూవీ అన్న ఫీలింగొస్తుంది. కానీ చూస్తుంటే ఏ ఫీలింగొచ్చిందో చూద్దాం. 

సూరిబాబు (సుధీర్ బాబు) ఒక లైటింగ్ టెక్నీషియన్. ఊళ్లో తిరణాళ్లప్పుడు, పెళ్లిళ్లప్పుడు, పండగలప్పుడు లైటింగ్ చెస్తూ బిజీగా ఉంటాడు. శ్రీదేవి (ఆనంది) కుటుంబం ఒక సోడా సెంటర్ నడుపుతుంటుంది. ఆమె తండ్రి (నరేష్) కూతురికి తన కులానికి చెందిన వాడితో పెళ్లి చెయ్యాలనుకుంటాడు. కానీ ఈమె వేరే కులానికి చెందిన సూరిబాబుని ప్రేమిస్తుంది. అదే ఊళ్లో కాశి (పావెల్ నవగీతన్) అనే మోతుబరి ఉంటాడు. అతనిది శ్రీదేవి కులమే. ఆమెకోసం ఒక సంబంధం కూడా చూస్తాడు. చివరికి శ్రీదేవి ఏం చేస్తుంది? ఆమె ప్రేమ ఏమౌతుంది? కాశి ఉద్దేశమేంటి? ఇదంతా చివరి 15 నిమిషాల్లో చెప్పారు. 

ఆ చివరి పావుగంట కథ చెప్పడానికి ముందు రెండుంపావు గంటల కథని బలవంతంగా అతికించినట్టుంది. 

నిజానికి పైన చెప్పుకున్న కథని ఏ హీరోకైనా చెబితే ఆల్రెడీ సైరాట్, ధడక్, ఉప్పెన, రగస్థలంలో ఆది పినిశెట్టి ట్రాక్, పలాస ఇదే కదా అనాలి. కానీ సుధీర్ బాబు ఒప్పుకున్నాడంటే కేవలం క్లైమాక్స్ మాత్రమే చెప్పి ఒప్పించుండాలి. అక్కడ కూడా అద్భుతమైన కొత్త ట్విస్టేమీ లేదు. పాతదే. కానీ స్క్రీన్ ప్లేలో మలచిన తీరు కొత్తగా ఉంది. స్పాయిలర్ ఇచ్చినట్టవుతుంది కనుక అదిక్కడ చెప్పట్లేదు. 

సినిమా చూస్తున్నంత్రసేపూ చాలా నీరసంగా సాగుతుంటుంది. లవ్ ట్రాక్ గానీ, కాశి విలనిజం కానీ అస్సలు ఎక్కదు. ఏ రకమైన ఇంటెన్సిటీ కనపడదు. 

బాడీలో షేపులేనప్పుడు ఎంత ఖరీదైన బట్టలెసినా అందం రానట్టు ఈ కథా గమనానికి మణిశర్మ నేపథ్య సంగీతం కొట్టినా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటరయినా, షందత్ కెమెరా పట్టుకున్నా పని జరగదు. ఏదో తెర మీద సన్నివేశాలు కదులుతుంటాయి తప్ప గుండెల్లోకి చొచ్చుకెళ్లవు. 

ఇలాంటి అన్ని సినిమాల్లోలాగానే హీరోయిన్ హీరోతో శారీరకంగా కమిట్ అయిపోయే సీనొకటుంది. అలాగే హీరో గారి కండలు చూపించడానికి పడవల రేసు సీనొకటి, జైల్లో ఫైట్ సీనొకటి ఉన్నాయి. ఫస్టాఫులో ఊకదంపుడు సాహిత్యంతో ఒక ఐటం సాంగుంది. అన్నీ ఎక్కడో చూసేసిన ఫీలింగొస్తుంది తప్ప కొత్తగా చూస్తున్న అనుభూతి అస్సలు కలగదు. ప్రోడక్షన్ వేల్యూస్ బాగున్నాయి కానీ క్రియేటివ్ వేల్యూస్ పెద్దగా లేవు. 

మణిశర్మ సంగీతం కూడా ఫెయిల్ అనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అక్కడక్కడా ఒప్పించినా పాటలు మాత్రం ఫ్లాప్. ఒక్క పాట కూడా వినసొంపుగా గానీ, హాంటింగ్ గా కానీ లేదు. సుధీర్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, పర్ఫామెన్స్ బాగున్నాయి. ఆనంది కూడా బాగానే ఉంది. క్లైమాక్స్ లో ఆమె చెప్పిన డయలాగ్స్ కి ఈలలు పడ్డాయి. 

ఇందులో నటించిన అందరికీ చివరాఖరి పావుగంట మాత్రమే నటించే స్కోపిచ్చాడు దర్శకుడు. అయినా కాశి పాత్ర వేసిన పావెల్ నటనలో కసి చూపించలేకపోయాడు. మొహంలో భావాలు పలకని ఈ పరభాషా నటుడిని ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాదు. 

నరేష్ కి, అతని భార్యగా చేసినావిడకి కాస్త ట్యాలెంట్ చూపించడానికి ఒకటి రెండు సీన్లు దొరికాయి చివర్లో. ఆల్రెడీ ఇదే జానర్ లో “పలాస” తీసి, మళ్లీ వెంటనే రెండో సినిమా కూడా ఇదే జానర్ అంటే ఈ దర్శకుడు వైవిధ్యం చూపించుకునే అవకాశం మిస్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. 

క్లైమాక్సులో సుధీర్ బాబు కొడవలి పట్టుకొచ్చి నరేష్ ముందు కూర్చుని మాట్లాడే సీన్ రంగస్థలాన్ని గుర్తుకు తెస్తుంది. ఇలా వేరే సినిమాలు గుర్తొచ్చే సీన్లు చాలానే ఉన్నాయిందులో. 

ఒక్క వాక్యంలో ఈ సినిమా గురించి చెప్పమంటే ఒరిజినాలిటీ లోపించిన కులాంతర ప్రేమ కథ అని చెప్పొచ్చు. 

బాటం లైన్: గ్యాస్ లేని సోడా