బుచ్చయ్య రాజీనామా చేస్తే అక్కడితో ఆగదు?

సీనియర్ నేత, మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరిని పార్టీ నుంచి సాగనంపేందుకే చంద్రబాబు ఆయనతో అంటీముట్టనట్టుగా ఉన్నారనే విషయం బహిరంగ రహస్యం. చివరకు ఆయన ఊహించిందే జరిగింది, బుచ్చయ్య రాజీనామాకు సై అన్నారు. అయితే…

సీనియర్ నేత, మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరిని పార్టీ నుంచి సాగనంపేందుకే చంద్రబాబు ఆయనతో అంటీముట్టనట్టుగా ఉన్నారనే విషయం బహిరంగ రహస్యం. చివరకు ఆయన ఊహించిందే జరిగింది, బుచ్చయ్య రాజీనామాకు సై అన్నారు. అయితే ఇక్కడ బాబు ఊహకు అందని మరో విషయం కూడా ఉంది. బుచ్చయ్యతో పాటు, ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని తట్టా బుట్టా సర్దేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. వారిలో జ్యోతుల నెహ్రూ ఒకరు.

గతంలోనే ఆయన పార్టీ నుంచి వీడిపోతారనుకున్నా.. ఆ వ్యవహారం అప్పట్లో సద్దుమణిగింది. తాజాగా జ్యోతుల నెహ్రూ అనారోగ్యం పాలవడంతో బుచ్చయ్య చౌదరి వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత వైసీపీకి చెందిన మంత్రి, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా నెహ్రూని నేరుగా వెళ్లి పరామర్శించారు. దీంతో ఆయన వర్గం వైసీపీకి దగ్గరవుతుందనే విషయం స్పష్టమైంది. టీడీపీకి రాజీనామా ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. బుచ్చయ్యతో పాటు ఆయన కూడా బయటకు నడవాలనుకుంటున్నారని సమాచారం.

రాయపాటి సాంబశివరావు కూడా ఇదే లిస్ట్ లో ఉన్నారు. పార్టీపై, చంద్రబాబుపై ఆయన చాలాకాలంగా వ్యతిరేకతతో ఉన్నారు. కొరకరాని కొయ్యలా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ బ్యాచ్ లో వ్యక్తి కాకపోయినా ఆయన సెపరేట్ గా వ్యవహారం నడుపుతున్నారు. చాన్నాళ్లుగా పార్టీపై రుసరుసలాడుతున్నారు. బుచ్చయ్య బయటికొస్తే టైమ్ చూసి దెబ్బ కొట్టేందుకు కేశినేని నాని రెడీగా ఉన్నారట.

మరో మాజీ మంత్రి నారాయణ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టు ఊహాగానాలున్నాయి. ఆయనకు బుచ్చయ్య ఎపిసోడ్ కి ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఒక్కసారి బాబు చేతుల్లో నుంచి మనుషులు జారిపోవడం మొదలైతే అది బుచ్చయ్యతో మాత్రం ఆగిపోదు. చంద్రబాబుపై మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్న మరికొంతమంది సీనియర్లు కూడా టీడీపీకి టాటా చెప్పే ప్రమాదం ఉంది.

బుచ్చయ్యను టైమ్ కోరిన బాబు..

ఈ ప్రమాదాన్ని చివరి నిముషంలో పసిగట్టిన బాబు తన అనుచరుల ద్వారా బుచ్చయ్యను సమయం కోరారు. ఓ 10 రోజులు టైమ్ ఇస్తే అన్నీ సెట్ చేస్తానని మాటిచ్చారట. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి బుచ్చయ్య కొన్ని డిమాండ్లు చేసినట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, పార్టీలో క్రియాశీలక పదవుల విషయంలో బుచ్చయ్య పట్టుబట్టినట్టు తెలుస్తోంది.

చూస్తుంటే.. బుచ్చయ్యే చంద్రబాబుపై పైచేయి సాధించేలా ఉన్నారు. తన డిమాండ్లన్నిటినీ చచ్చినట్టు బాబు ఒప్పుకునేలా చేయబోతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ కొంతమంది సీనియర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. బుచ్చయ్య ఎపిసోడ్ ఎటు మలుపు తిరుగుతుందో చూసి, అప్పుడు తాము కూడా బయటకు రావాలనుకుంటున్నారు.