వైసీపీ ఎమ్మెల్యేల‌కు ‘పీకే’ ఫీవ‌ర్‌!

వైసీపీ ఎమ్మెల్యేల‌కు ప్ర‌శాంత్ కిషోర్ టీం ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. ఎన్నికలొస్తున్నాయంటే పీకే టీమ్ ఏపీలో యాక్టీవ్ రోల్ పోషించే సంగ‌తి తెలిసిందే. ఈ టీమ్ వైసీపీ త‌ర‌పున ప‌ని చేస్తోంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల…

వైసీపీ ఎమ్మెల్యేల‌కు ప్ర‌శాంత్ కిషోర్ టీం ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. ఎన్నికలొస్తున్నాయంటే పీకే టీమ్ ఏపీలో యాక్టీవ్ రోల్ పోషించే సంగ‌తి తెలిసిందే. ఈ టీమ్ వైసీపీ త‌ర‌పున ప‌ని చేస్తోంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు పీకే టీం అభ్య‌ర్థుల ఎంపిక‌లో కీల‌క పాత్ర పోషించింది. ఎన్నిక‌ల్లో త‌న పార్టీ ఘ‌న విజయం సాధించ‌డం వెనుక పీకే టీం వ్యూహాలున్నాయ‌ని వైఎస్ జ‌గ‌న్ న‌మ్ముతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి పీకే టీం క్రియాశీల‌క పాత్ర పోషించేందుకు రెడీ అయ్యింది.

ఈ నేప‌థ్యంలో తాడేప‌ల్లిలో ఓ ప్ర‌ముఖ హోట‌ల్‌లో పీకే వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో కీల‌క స‌మావేశాలు నిర్వ‌హిస్తోంది. పీకే టీంలోని ఇద్ద‌రేసి స‌భ్యులు …ఒక్కో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 20 నుంచి 22 మంది నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్ని పిలిపించుకుని మాట్లాడుతోంది. దీనికి వైసీపీ నాయ‌కుడు పుత్తా ప్ర‌తాప్‌రెడ్డి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈయ‌న గ‌తంలో తెలంగాణ నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత టీటీడీ బోర్డు స‌భ్యుడిగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో సంబంధం లేకుండా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని ఎంపిక చేసుకుని, మాట్లాడుతున్నార‌ని తెలిసింది. మొద‌ట గ్రూప్ డిస్కషన్, ఆ త‌ర్వాత ఒక్కొక్క‌రితో నియోజ‌క‌వ‌ర్గంపై పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నార‌ని తెలిసింది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొద‌టిసారి ప్ర‌భుత్వంతో మాట్లాడుతున్నార‌ని, స‌మావేశ వివ‌రాల‌ను నేరుగా సీఎం జ‌గ‌న్‌కు మాత్ర‌మే నివేదిస్తామ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నార‌ని తెలిసింది.

నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట్లు, కులాల వారీగా ఏఏ సామాజిక వ‌ర్గానికి ఎన్నెన్ని ఓట్లున్నాయ్‌? వారి మ‌ద్ద‌తు ఎవ‌రికి? గ‌తంలో అభ్య‌ర్థికి వ‌చ్చిన మెజార్టీ లేదా ఓడిపోతే వాటికి కార‌ణాలు త‌దిత‌ర వివ‌రాల‌పై అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, వాటికి సంబంధించి స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌ను అడిగి తెలుసుకుంటున్నారు. 1983 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంగా ప్ర‌భావితం చేసే కుటుంబాలు, ప్ర‌స్తుతం ఆ కుటుంబ స‌భ్యులు ఏ పార్టీలో వున్నారు? ఇప్పుడు కూడా అదే ప్ర‌జాద‌ర‌ణ క‌లిగి ఉన్నారా? త‌దిత‌ర అంశాల‌పై ఆరా తీస్తున్నార‌ని తెలిసింది.  

ప్ర‌స్తుత ఎమ్మెల్యేపై నెగెటివ్ అంశాలు, వాటికి కార‌ణాల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ప్ర‌స్తుతం అభ్య‌ర్థిని మార్చాల్సిన అవ‌స‌రం ఏమైనా వుందా? అని ప్ర‌శ్నిస్తూ, పూర్తి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నార‌ని స‌మాచారం. మ‌నంద‌రి ల‌క్ష్యం వైఎస్ జ‌గ‌న్‌ను తిరిగి ముఖ్య‌మంత్రి చేసుకోవ‌డ‌మే అని, కావున మ‌న‌సు విప్పి మాట్లాడాల‌ని నొక్కి చెబుతున్నార‌ని తెలిసింది. అంద‌రితో క‌లిసి మాట్లాడే సంద‌ర్భంలో ఎవ‌రూ నెగెటివ్ అంశాల్ని పెద్ద‌గా చెప్ప‌లేద‌ని స‌మాచారం.

కానీ ఒక్కొక్క‌రితో భేటీ అయిన‌ప్పుడు మాత్రం, త‌మ మ‌న‌సులో దాగిన అక్క‌సును కొంద‌రు వెళ్ల‌గ‌క్కుతున్నార‌ని తెలిసింది. వీరి అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారా? అది ఎంత వ‌ర‌కు అనే చ‌ర్చ న‌డుస్తోంది. కానీ పీకే టీంతో భేటీ అంటే వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక ర‌క‌మైన వ‌ణుకు పుడుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.