ఐదేళ్లలో ఆ లాంఛనం కూడా ముగుస్తుందా?

భారతీయజనతా పార్టీకి స్పష్టమైన ఆధిక్యంతో మోడీ రెండోసారి గద్దె ఎక్కిన తరువాత… సహంజగానే వారి పాలన శైలి మారింది. వారి పార్టీకి దశాబ్దాలుగా ఉన్న ఎజెండా అంశాలను వారు బయటకు తీశారు. పార్టీ పుట్టుకకు…

భారతీయజనతా పార్టీకి స్పష్టమైన ఆధిక్యంతో మోడీ రెండోసారి గద్దె ఎక్కిన తరువాత… సహంజగానే వారి పాలన శైలి మారింది. వారి పార్టీకి దశాబ్దాలుగా ఉన్న ఎజెండా అంశాలను వారు బయటకు తీశారు. పార్టీ పుట్టుకకు మూలకారణాల్లో ఒకటైన ‘ఆర్టికల్ 370 రద్దు’ను పూర్తిచేశారు. మిగిలిన వాటిలో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ అనే అజెండా అంశం కూడా ఉంది. ఆ లాంఛనం కూడా ఈ అయిదేళ్లలోనే పూర్తయిపోతుందని సంకేతాలు అందుతున్నాయి.

ఎన్డీయేలో భాజపా మిత్రపక్షం, వారితో సమానమైన హిందూత్వ భావజాలంతో పెచ్చరిల్లుతూ ఉండే శివసేన వ్యాఖ్యలను గమనిస్తే.. ‘ఒకే ఎన్నికలు’ అనేది త్వరలోనే చట్టరూపం దాల్చవచ్చునని అనిపిస్తోంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే.. తమ పార్టీ అధికార పత్రిక సామ్నా లో ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేస్తూ సంపాదకీయం రాశారు.

అయితే 370కు దీనికి మధ్య కొన్ని తేడాలున్నాయి. 370 అనేదిత కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య. అసంతృప్తి అక్కడ ఒక్కచోట మాత్రమే రేగుతుంది. భద్రతబలగాలతో దాన్ని అణిచేశాక, అది ఇతర ప్రాంతాలకు వ్యాపించేదిన కాదు. కానీ.. ‘ఒకే ఎన్నిక’ లాంటి బిల్లు దేశం మొత్తాన్ని ప్రభావితం చేసేది. దేశమంతా వ్యతిరేకతలు రేగితే మోడీ సర్కారు ఎలా డీల్ చేయగలుగుతుందో తెలియదు.

పైగా 370 అనేది కేవలం రాజ్యసభలో మెజారిటీ సాధించగలిగితే చాలు.. కార్యరూపంలోకి వచ్చేసేది. ఈ ఒకే ఎన్నిక వ్యవహారం అలా కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఇందుకు అనుగుణంగా తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మెజారిటీ రాష్ట్రాల్లో భాజపా పాలనే సాగుతుండవచ్చు గాక… కానీ ఇతర పార్టీలనుంచి వ్యతిరేకత తప్పదు.

ఇలాంటి బిల్లు.. స్థూలంగా చర్చించుకోవడానికి అద్భుతంగా కనిపిస్తుంది. కానీ కాలక్రమంలో ప్రాంతీయ పార్టీల పీచమణచి.. ఒకటిరెండు జాతీయ పార్టీల గుత్తాధిపత్యంలోకి దేశభవిష్యత్తును నెట్టేస్తుంది. ఇది ప్రజాస్వామ్యస్ఫూర్తికే విరుద్ధమైన పరిణామాలకు దారితీసిన ఆశ్చర్యం లేదు. అయినా సరే.. మోడీ సర్కారు మాత్రం.. ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అనే సిద్ధాంతాన్ని కార్యరూపంలోకి తేవడానికి సకల ప్రయత్నాలు చేస్తుందనడంలో సందేహం లేదు.