టెక్నాలజీకి తనే ఆద్యుడినని చెప్పుకుంటారు. భారతదేశానికి సెల్ ఫోన్లు పరిచయం చేసింది తనే అంటారు. ప్రతి రంగంలో సాంకేతిక విప్లవం తనవల్లే వచ్చిందని ఎన్నోసార్లు గొప్పలు చెప్పుకున్నారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు అదే టెక్నాలజీ వాడకం కోపం తెప్పిస్తోంది. అవును.. కరకట్టపై డ్రోన్స్ వాడితే చంద్రబాబుకు కోపం వస్తోంది. టెక్నాలజీని తనకు వ్యతిరేకంగా వాడుతున్నారంటూ ఆయన మండిపడుతున్నారు.
కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు లేటెస్ట్ టెక్నాలజీని వాడారు. డ్రోన్ల సహాయంతో నది ఉధృతిని, ప్రవాహాన్ని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఇది చంద్రబాబుకు నచ్చలేదు. తన ఇంటిపై డ్రోన్ తో నిఘా పెట్టారని వితండవాదం చేస్తున్నారు చంద్రబాబు.
నిజానికి ప్రస్తుతం ఆయన కరకట్ట నివాసంలో లేరు. కానీ కేవలం రాజకీయం చేయాలనే దురుద్దేశంతోనే పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి మరీ సీరియస్ అవుతున్నారు. డ్రోన్ తో తన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారంటూ ఆవేశపడుతున్నారు. ఓవైపు నీటిప్రవాహం చంద్రబాబు ఇంటి అవుట్-హౌజ్ వరకు వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. బాబు ఇంటి వెనక ఉన్న ఆవరణ మొత్తాన్ని వరద చుట్టుముట్టడం ఖాయం. కానీ ఇవేవీ చంద్రబాబుకు అక్కర్లేదు. డ్రోన్స్ ఉపయోగించడమే నేరం అన్నట్టు వితండవాదం చేస్తున్నారు.
ఈ విషయంపై వైసీపీ తరఫు నుంచి స్వయంగా మంత్రి అనీల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకొని మరీ డ్రోన్స్ ఉపయోగించి, వరదను అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నామని, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించాల్సింది పోయి, ఇలా అడ్డదిడ్డంగా ఆరోపణలు చేయడం ఏం బాగాలేదని దుయ్యబట్టారు. బ్యారేజీలోకి దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని, పరిస్థితిని అంచనా వేయడం కోసం డ్రోన్స్ సహజం అన్న అనీల్ కుమార్, దేశంలో ఇప్పటికే ప్రభుత్వం అనుమతితో వీటిని ఉపయోగిస్తున్నారని, ఇక్కడ కూడా అదే పని చేస్తున్నామని స్పష్టంచేశారు.
నిజానికి వైసీపీకి చంద్రబాబు నివాసంపై డ్రోన్స్ ను ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే అధికారికంగా అది చంద్రబాబు నివాసం కూడా కాదు. అన్నింటికీ మించి ఆ సమయంలో చంద్రబాబు ఇంట్లో లేరు. ఇన్ని అంశాలు కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ బాబు, అతడి అనుచరులు వితండవాదం చేస్తున్నారు. వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, డ్రోన్స్ సహాయంతో ఈ స్థాయిలో పర్యవేక్షణ చేయకపోతే.. రాబోయే గంటల్లో అది చంద్రబాబు నివాసానికే కాదు, మొత్తం కరకట్టకే ప్రమాదం. టెక్నాలజీతో ఏ వీధి బల్బ్ వెలిగిందో, ఆగిపోయిందో తన డాష్ బోర్డ్ ద్వారా చూడగలనని గొప్పలు చెప్పిన చంద్రబాబుకు, ఇలాంటి వరదల సమయంలో డ్రోన్స్ ఉపయోగిస్తారనే విషయం తెలియకపోవడం హాస్యాస్పదం.
ఇప్పుడు బాబు ఆరోపణలకు వెనక్కి తగ్గి డ్రోన్ల వాడకం ఆపేస్తే.. అది అతిపెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. ఈ విషయం బాబుకు, అతడి అనుచరులకు తెలియనిది కాదు. కానీ వాళ్లకు కావాల్సింది కేవలం రాజకీయం. ప్రజల క్షేమం అనవసరం. ఆ విషయం కృష్ణమ్మ సాక్షిగా ఇప్పుడు మరోసారి జనాలకు తెలిసొచ్చింది.